నాస్తికులు, హేతువాదులు గుడ్డిగా నమ్మినట్టు మానవ మేధ కాలం, పదార్థం, సంభావ్యతల వల్ల జీవపరిణామ క్రమంలో పుట్టింది కాదు. మనకు ఆలోచించే పఠిమనే కాదు, ఏం ఆలోచిస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, ఎందుకు ఆలోచిస్తున్నాం అని కూడా ఆలోచించగలం. ఈ పఠిమ సృష్టికర్త మనిషికిచ్చిన ఒక సహజ వరం. హేతువు అనేది ఒక మనో విభాగం. మనం సరిగా ఆలోచించాలంటే హేతువు తప్పనిసరి. విషయ పరిజ్ఞానానికి హేతువు ఒక పరికరం. ఈ సామర్థ్యం లేకుండా మానవుడు ఇప్పుడు సాధించినది సాధించి ఉండేవాడు కాదు. చాలా మంది అభిప్రాయపడ్డట్టు హేతుబద్ధమైన ఆలోచన విశ్వాసానికి వ్యతిరేఖం కాదు. నిజానికి అసలైన విశ్వాసం ఎప్పుడూ హేతుబద్ధంగానే ఉంటుంది.* ఈ హేత్వాలోచనా సామర్థ్యం దేవుని పోలికలో అంతర్లీనంగా ఉన్నదే. ఇది సృష్టిలో (ప్రతీ) మనిషికి దొరికిన భాగ్యం!

విశ్వాసి జీవితంలో హేతువుకు, మేధాపఠిమకు ఉన్న ప్రాముఖ్యతను బైబిల్ తన పేజీల్లో నొక్కి చెబుతోంది. దేవుడు ఏదెను వనంలో ఆదాముకు భూమిని సేద్యపరిచే, జంతుజాలానికి పేర్లు పెట్టే పని అప్పగించినప్పుడు అతడు దేవుడిచ్చిన ఈ సహజ సామర్ధ్యాలను వినియోగించుకోవాలని దేవుడు ఆశించాడు. అలాగే మహా జలప్రళయం నుంచి తప్పించుకునేందుకు ఓడను నిర్మించమని నోవాహుకు దేవుడు అదేశించినప్పుడు కూడా నోవహు ఈ సామర్థ్యాలనే ఉపయోగించాడు. అలాగే ఈజిప్ట్ మహా కరువును అధిగమించే వ్యూహాన్ని రూపొందించడంలో యోసేపు, మామ జెథ్రో సలహా మేరకు అశేష ఇశ్రాయేలు జనగణాన్ని నడిపించడంలో మోషే, వేగు చూడటంలో, యుద్ధ వ్యూహాలు పన్నడంలో యెహోషువా, రాక్షస గొల్యాతును చంపడంలో దావీదు, రాజుగా న్యాయ తీర్పులు తీర్చడంలో సొలొమోను, పాడైన యెరూషలేము గోడలను పునర్నిర్మించడంలో నెహెమ్యా దేవుడు తమకిచ్చిన ఆలోచనా పఠిమను ఉపయోగించినవాళ్లే.

క్రీస్తు నరావతారంలో తన మేధస్సును తన తండ్రి మహిమార్థం, తన ప్రజల క్షేమార్థం ఉపయోగించాడు. “ఆయన జ్ఞానమందు వర్ధిల్లుచుండెను” అని లూకా సువార్త చెబుతోంది. యేసు ఒక వడ్రంగిగా కొయ్య వస్తువులు చేయడానికి తన సృజనాత్మక మేధను, బోధకుడిగా ఆయా చర్చల్లో, వాదాల్లో తన హేతు సామర్ధ్యాన్ని ఉపయోగించాడు. మన దేవుడ్ని మనం “పూర్ణ వివేకంతో” ప్రేమించాలని, సేవించాలని, పూజించాలని బైబిల్ మనకు ప్రబోధిస్తోంది (ద్వితీ.6.5, 11.13, మార్కు 22
30, రోమా 12.2-3). సిలువ వేయబడ్డ క్రీస్తును ప్రకటించడంలో పౌలు యూదులతో, గ్రీకులతో తర్కించాడు.

సంఘ చరిత్రంతటిలో పాలీకర్ప్, జస్టిన్ మార్టా,
ఇరినియస్, ఒరిజిన్, అధ్నీషియస్, అగస్టీన్, ఆన్సల్మ్, థామస్ అక్వయినస్, మార్టిన్ లూథర్, జాన్ కాల్విన్ వంటి సంఘ పితరులు, వేదాంతులు క్రైస్తవ సిద్ధాంతాలను రూపొందించడంలో, సమర్థించడంలో హేత్వాలోచన చేశారు.

ఐనా నేటి క్రైస్తవులు భావావేశ ధోరణులకు లోనైపోయారు. ఇది అపవాది సరికొత్త పన్నాగం. ఈ రోజుల్లో మన ప్రసంగాల్లో, యువత ఆరాధనలో, సువార్త ప్రబోధంలో, చివరికి మన ఉజ్జీవ సభలోని పశ్చాత్తాప ప్రార్థనల్లో సైతం ఈ భావావేశ ధోరణులు ప్రబలంగా కనబడుతున్నాయి. ఈ పద్ధతిలోనే బోధకులు, నాయకులు క్రైస్తవ ప్రజానీకాన్ని తమకనుగుణంగా ఆకర్షించుకుంటున్నారు. భావోద్వేగాలు దేవుడిచ్చినవే. అవి చెడ్డవి కావు. ఎటొచ్చీ అనాలోచితంగా వాటి వశమైనప్పుడే ప్రమాదకరం. మోసపోవడానికి అవకాశమూ ఎక్కువే. మొదటి మహా జాగృతి తర్వాత మెతడిస్ట్ సంఘ స్థాపకుడు జాన్ వెస్లీ సంఘ కాపరులకూ, నాయకులకూ ఈ విషయమే చెప్పి హెచ్చరించాడు. ఆనాడు ఆయన పలికిన ఆ ప్రవచనాత్మక పలుకుల్ని సంఘం పెడచెవిని పెట్టింది. తత్ఫాలితంగా, ఇదిగో, ఈనాడు ఇలాంటి పర్యవసానాల్ని అనుభవిస్తున్నాం.
క్రైస్తవులు తమ ఆధ్యాత్మిక జీవనంలో ఎప్పుడు మానసిక కసరత్తును అలక్ష్యం చేస్తారో, ఎప్పుడు దేవుడిచ్చిన హేతు సామర్ధ్యాన్ని వినియోగించడంలో అనాసక్తిపరులౌతారో అప్పుడు అపవాది మోసానికి ఇట్టే గురైపోతారు. అందువల్లనే మన చుట్టూ ఇంతలేసి దుర్బోధలు, దుర్బోధకులు పోగైపోయారు. మనం ఇప్పటికే వారికి (మన జీవితాల్లో, సంఘాల్లో) చోటిచ్చేసాం. వాళ్ళు దుర్గాలు కట్టేశారు కూడా! అపొస్తలుడైన పౌలు ముందుగానే ఈ పోకళ్ళను ప్రవచనాత్మకంగా ప్రభోధించాడు (2 తిమో. 4.3-4, cf.ఎఫెసి. 4.11-15). మన చుట్టూ పొంచివున్న ఆకలిగొన్న తోడేళ్లకు మనం ఆహారం కాకుండా ఉండాలంటే ఆయన చేసిన హెచ్చరికల్ని పెడచెవిని పెట్టకూడదు.

*ఈ అంశాన్ని ఇదే ధారావాహికలో మనం రాబోయే రోజుల్లో కూలంకషంగా చర్చిద్దాం