ఇది కమ్యూనికేషన్ యుగం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉధృతంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో భూగోళం అవతలకు సందేశాలు పంపడమే కాదు అంగారకుని ఉపరితలం నుండి సంకేతాలు అందుకోవడమూ క్షణంలో పని. మనుషులతోనే కాదు గ్రహాంతర వాసులతో సైతం (అలాంటివారు ఉంటే) సంబంధాలు పెట్టుకోవాలన్న ఈ తపన మనిషికి సహజంగానే అబ్బిన గుణం. ‘మానవుడు సంఘజీవి’ అని అరిస్టాటిల్ అనడం సబబే అనిపిస్తుంది. అయితే మనిషిలోని ఈ సామాజిక తపన ఇక్కడితో ఆగిపోయింది అనుకుంటే పొరపాటే. తనకంటే ఉన్నతమైన దానితో సంబంధం పెట్టుకోవాలని మనిషి ఎప్పుడూ తపిస్తాడు. ఇక్కడే “ఆరాధన” పుట్టింది. మనిషిలోని ఈ తపన విశ్వవ్యాప్తమైంది. “నీకు ఆకలేస్తుంది అంటే ఎక్కడో అన్నం ఉందన్నమాట. అలాగే నీలో దేవుని గూర్చిన ఆకలి వుంది అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడన్నమాట” అంటాడు నాస్తికత్వం నుంచి ఆస్తికత్వంలోకి వచ్చిన ఆక్స్ఫర్డ్ మేధావి సి.ఎస్.లుయీస్.
మరి ఈ దేవునితో మనిషి సంబంధం ఏర్పరుచుకోగలడా? కొందరు మానవుడే దేవుడని, మరికొందరు మానవుడూ, దేవుడూ వేరువేరని నమ్ముతారు. “అహం బ్రహ్మస్మి” అన్నట్టు ఒకవేళ మానవుడే దేవుడైతే ఈరోజు మనిషిలోని విపరీత నేర ప్రవృత్తికి, పాప నైజానికి జవాబు దొరకదు. అంతేకాదు, మనిషి దేవుడైతే తనను తాను తెలుసుకోవడానికి గురువునో, ధ్యాన పద్ధతులనో ఆశ్రయించాల్సిన పనీ లేదు. తనలోని దైవత్వాన్ని తెలుసుకునే ప్రయత్నమూ చేయనక్కర్లేదు. దేవుడు అన్నవాడు తనను తాను మరచిపోవడం అంటూ జరగదు సరికదా తన గురించి తానే ఎరుగని పరిస్థితిలో ఉండడు ఉండలేడు. దేవుడు అనంతుడు గనుక తన గురించి తనకు తెలియని సందర్భం అంటూ ఉండదు మరి!
అలా కాదు మనిషి, దేవుడు వేరువేరని (వేరు వేరు అస్తిత్వాలని) అనుకుంటే అపరిమితమైన దేవుణ్ణి పరిమితమైన మానవుడు తనంతట తాను తెలుసుకోవడం అసాధ్యం! మనిషి పరిమితుడు కనుక అతని జ్ఞానమూ పరిమితమైనదే. దీనికి ఒక్కటే పరిష్కారం. అనంత తత్త్వానికి పరిమిత తత్త్వానికి మధ్య ఉన్న అనంత అగాధాన్ని దాటి ఇవతలికి రాగలిగిన వాడు అనంతుడే! కనుకనే దేవుడు మనిషిగా అవతరించాలి. అనంతుడైన దేవుడు తనంతటతాను మనిషికి తెలియజేసుకుంటే తప్ప అతడు దేవుణ్ణి తెలుసుకోలేడు. అంచేతనే మన పూర్వీకులు “తమసోమా జ్యోతిర్గమయ” అంటూ దైవ జ్ఞానం కోసం ప్రార్థించారు. దేవుడు అవతరించాల్సిన అవసరాన్నీ మన వాళ్ళు గుర్తించారు.
మరో విషయం. మనిషి దేవుడిని తెలుసుకోకపోవడానికి మరో కారణం అతని నైజంలోనే వుంది. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నప్పుడు దూరదర్శన్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రముఖ సినీ నటుడు అక్కినేని తాను సినిమాలు తీయడం ఎందుకు మానేశాడో చెబుతూ “సినిమాల్లో మంచీ, చెడూ రెండూ ఉంటాయి. కానీ ప్రజలు చెడును మాత్రమే నేర్చుకుంటారు” అని వ్యాఖ్యానించాడు. ఇదీ మనిషి నైజం! మనం మంచి కన్నా చెడునే సులభంగా చేస్తాం. మంచిగా బతకాలన్న ఆశ మనలో ఉన్నా అలా బతకలేక విఫలమైపోతుంటాం. చేయకూడదని తెలిసి తప్పు చేస్తుంటాం. ఈ పాపనైజమే మనిషిని పరమ పవిత్రమైన దేవునికి దూరం చేసింది. “పాపోహం పాప కర్మాహం” అన్నారు. లోపలి వ్యక్తి చెడిపోతే అతని బయట ప్రవర్తనా చెడిపోతుంది కదా! మన మనసు చెడిపోయిన కారణంగా మన క్రియలూ చెడిపోయాయి. “ఏ బేధమూ లేదు అందరూ పాపం చేసినవారేనని” బైబిల్ ఏనాడో తెగేసి చెప్పేసింది.
అలా దేవుడు అవతరించి మనిషిని ఉద్ధరించాల్సిన అగత్యం ఏర్పడింది. ఐతే దేవుడు “దుష్ట శిక్షణకు, శిష్ఠ రక్షణకు” అవతారిస్తాడని మనం తరతరాలుగా వింటున్న మాటే! ఇక్కడే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. దేవుడు ఒకవేళ శిష్ఠ రక్షణకు వస్తే ఆ శిష్టులు (మంచి వారు) ఎవరు? మనిషి అహం, ఆత్మ, క్రియ పాప పంకిలమైనప్పుడు ఇక మంచి వారు ఎక్కడ? ఒకవేళ దేవుడు దుష్ట సంహారానికి దిగివస్తే ఇక భూమ్మీద ఎవడు మిగులుతాడు? అయినా, అనంతుడైన దేవుడు దుష్ట సంహారానికి దిగిరావాల్సిన పని లేదు కదా! దేవుడు మాట సెలవిస్తే దుష్టుడు భూమ్మీద లేకుండా పోతాడు కదా! మరి దేవుడు ఎందుకు దిగి రావాలి?
అందువల్ల దేవుడు అవతరిస్తే మనిషిని పాప విముక్తుడ్ని చేయడానికే రావాలి. అంటే మానవాళి పాప నిష్కృతి కోసం రావాలి, అంతే! “త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే. అన్యదా శరణం నాస్తి” అన్నారు. మరో మార్గం లేదు. దేవుడే దిగివచ్చి మనిషిని కృప చూపి, పాపం నుంచి పరిరక్షించాలి. ఈ పాప హరణం ఎలా జరుగుతుంది? పాపిని చంపడం వల్లనా? అప్పుడిక రక్షించడానికి ఏం మిగులుతుంది? కరోనా వైరస్ విశ్వవ్యాప్తంగా ప్రబలినప్పుడు అది శోకిన మనిషిని బ్రతికించి వైరస్ ని మాత్రమే అంతమొందించడానికి మనం శ్రమించాం. అంతేగానీ, వైరస్ శోకిన మనిషిని చంపి వైరస్ పైన విజయం సాధించ లేదు. మనిషిగా అవతరించే దేవుడూ అదే చేస్తాడు. పాపాన్ని దునుమాడి దాని బారి నుండి మనిషిని పరిరక్షిస్తాడు తప్ప మనిషిని చంపడు. ఇదెలా సాధ్యం?!
రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదని సర్వ సామాన్యంగా తెలుస్తోందని బైబిలు చెబుతోంది. అలాగే “సర్వపాప పరిహారోం రక్తప్రోక్షణ మవశ్యకం” అన్న వేద సూక్తీ మనకు తెలిసినదే. పాప పరిహారానికి రక్తమే ఎందుకు చిందించాలి? పాపం వల్లనే మరణం సంభవించింది. “పాపం వల్ల వచ్చు జీతం మరణం” అని సత్య వేదమైన బైబిల్ ఘోషిస్తోంది. అంటే, పాపం వచ్చినపుడు ప్రాణం తోడేసిందన్న మాట. మరి పాపం పోవాలంటే మళ్ళీ ప్రాణం పెట్టాల్సిందే కదా! రక్తంలో ప్రాణం ఉంది. “రక్త దానం ప్రాణ దానం” అన్నారు. మరి పాపాన్ని తొలగించే రక్తం పాప పంకిలం కానిది అయివుండాలి కదా! మానవాళి మొత్తం పాప పంకిలమైపోతే అలాంటి పవిత్ర రక్తం ఎక్కడ దొరుకుతుంది?
అందుకనే దేవుడు మానవుడై మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తంగా మానవ రక్తాన్ని చిందించాలి. “తత్ రక్తం పరమాత్మేణ పుణ్య దాన బలియాగం” అన్నారు. దేవుడొక్కడే పవిత్రుడు గనుక ఆయన కృప చూపి మనిషిగా దిగివచ్చి మన స్థానంలో బలియాగమై పవిత్రమైన తన రక్తాన్ని చిందిస్తే తప్ప పాప పరిష్కారం జరగదు. అందుకే దేవుడు చంపడానికి రాడు. మన స్థానంలో తాను మరణించి, పాపశిక్షను చెల్లించి, మనల్ని బ్రతికించడానికి వస్తాడు.
అలా సర్వ మానవాళిని పాప విముక్తం చేయడానికి పవిత్ర రక్తం చిందించడానికి వచ్చిన అవతార పురుషుడు ఎవరున్నారు చరిత్రలో—ఒక్క క్రీస్తు ప్రభువు తప్ప?! యేసుక్రీస్తు నరావతారిగా ఉన్నపుడు ఒక్కసారి కూడా శత్రువులు సైతం తప్పు పట్టలేకపోయిన పావనుడాయన. కనుక మన పక్షాన పాప శిక్షను చెల్లించడానికి ఆయన మాత్రమే అర్హుడు, సమర్థుడు కూడా. ఆయన మనకు బదులుగా మన స్థానంలో పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన తన పాపం కోసం చనిపోలేదు కనుక పాప పర్యవసానమైన మరణాన్ని గెలిచి తాను అనంతుడైన దేవుడినని, పాపం లేనివాడనని నిరూపించుకున్నాడు. మానవుడు అనాదిగా జయించలేని పాపమరణాలను తాను జయించి మనకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాడు. తత్ఫలితంగా పాపశాప వ్యసన దాస్యాల నుండి మనిషిని విడిపించడమే గాక మరణ భయం నుంచి కూడా మనల్ని విడిపించాడు.
పాపం లేని వాడే కదా మనిషిని పాపం నుంచి విడిపించ గలడు! మరణాన్ని జయించిన వాడే కదా మనిషిని మరణం నుంచీ, దాని భయం నుంచీ విడిపించ గలడు! “పాపోహం పాప కర్మాహం” అంటూ మనం ఆక్రోశిస్తే “అహమేవ రక్షః” (ఆ పాప విమోచకుణ్ణి నేనే) అంటూ మనల్ని ఆదుకునే వాడూ, “మృత్యోర్మ అమృతంగమయ” అంటూ మనం ప్రార్థిస్తే “అహమేవ జీవః” (ఆ అమృత మూర్తిని నేనే) అంటూ మనకి అభయమిచ్చే వాడూ ఆ క్రీస్తే కదా!
పాపాన్నీ మరణాన్నీ జయించిన వాడు దేవుడు కాక మరెవడు? అందుకే యేసుక్రీస్తు ముమ్మాటికీ దేవుడు, జగద్రక్షకుడు! దేవుడైతే అందరికీ దేవుడే కదా! ఆయనకు కులం, మతం, విదేశీయత ఆపాదించలేం!
పాప మరణాల దాస్యం నుండి విముక్తి పొందడం సర్వ మానవాళి అవసరం కదా! అటువంటి ముక్తిదాత ఐన క్రీస్తును కొందరి వాడని ఎలా అనగలం? ఆయన అందరివాడు. అందరికీ అవసరమయిన వాడు. “యేసుక్రీస్తు అందరికీ ప్రభువు!”
ఆయనను ఆశ్రయించిన వారికందరికీ ఆయన ప్రాయశ్చిత్త ఫలం దొరుకుతుంది. ఆయన సిలువ రక్తంలో సర్వ పాపాలనూ కడిగివేసుకోగలం. మనకై మనం స్వచ్చంధంగా, విశ్వాసంతో, చిత్త శుద్ధితో క్రీస్తు ప్రభువుకు చేసే ఒక పశ్చాత్తాప ప్రార్థన మనల్ని పాప వ్యసనాల నుంచి విముక్తి చేయగలదు. అపుడు పరమ ప్రభువైన క్రీస్తును మన గుండె గుడిలో మన దేవుడిగా ప్రతిష్టించుకోవడానికి అర్హత పొందగలం. దైవాశీస్సులు!