‘మనిషి వివేచనాత్మక జంతువు’. ఇది మనిషికి అరిస్టాటిల్ ఇచ్చిన నిర్వచనాల్లో ఒకటి. అంటే మనిషి ‘ఆలోచించే జంతువు’ అన్నమాట. ఈ నిర్వచనం మనిషిలోని విశిష్టమైన ఆలోచనా పఠిమను గుర్తించినా చివరికి మనిషిని ‘జంతువు’గానే చూస్తోంది. ఒకవేళ మనిషి ‘కేవలం’ జంతువే ఐతే ఇతర జంతువుల్లో లేని ఈ విశిష్టమైన హేత్వాలోచనా సామర్ధ్యం అతనికెలా అబ్బింది? ఇక్కడే మరికొన్ని ప్రశ్నలు పుట్టుకొస్తాయి. హేతువు కాని దాన్నుంచి హేతువు పుడుతుందా? ముడి పదార్థం మానవ మేధ గా పరిణామం చెందగలదా? ప్రకృతి వరణం (ఎన్నిక) వివేచనను పుట్టిస్తుందా? కార్యకారకాల్లో కారకంలో లేని సహజ లక్షణం కార్యం (పరిణామం) లోనికి వస్తుందా? ఉదాహరణకు, అంకెలు గుణించే సామర్థ్యం ఒక కాలిక్యులేటర్ (కార్యం)కి రావాలంటే ఆ సామర్థ్యం మొదట దాని సృష్టికర్త౼మనిషి (కారకం) లో ఉండాలి కదా!
వీటికి బైబిల్ అర్థవంతమైన జవాబులిస్తోంది. మనిషిని దేవుడు తన పొలికలో సృజించుకున్నాడు గనుకనే అతడు (లేక ఆమె) జీవులన్నింటిలో విభిన్నంగా, విశిష్టంగా ఉన్నాడు. ఈ హేతు సామర్థ్యం, వివేచనా పఠిమ కూడా అతనికి ఆ సృష్టికర్తనే సహజాతాలుగా ఇచ్చాడు. ముందటి శీర్షికలో చెప్పినట్టు సహేతుక ఆలోచన మనిషి స్వతస్సిద్ధమైన సామర్థ్యం. ఇది దైవ పోలికలో అంతర్భాగం.
అయితే తన దైవాన్ని తానే ధిక్కరించడం వల్ల మనిషి ఈ సామర్థ్యాన్ని(దాని అసలు రూపంలో) నిలుపుకోలేక పోయాడు. ఈ ధిక్కారాన్నే బైబిల్ ‘పాపం’ అని పిలుస్తోంది. ఈ పాపం మనిషిలోని ప్రతీ అంగాన్ని స్పృశించింది, పాడుచేసింది. దీన్నే సంస్కరణ వేదాంతులు ‘పూర్ణ భ్రష్టత్వం’ అన్నారు. నార్మన్ గైజ్లర్ చెప్పినట్టు ఈ పూర్ణ భ్రష్టత్వం మానవ వ్యవస్థలోని ‘అన్నిటినీ’ పాడుచేసింది కానీ ‘అంతటినీ’ పాడుచేయలేదు. అంటే, ప్రతీ సామర్థ్యాన్ని తాకింది కానీ ఆ సామర్థ్యాల్ని పూర్తిగా నాశనం చేయలేదు. ప్రతీ మనిషీ, అతడు ఎవరికీ పుట్టినా, ఏ మతం వాడైనా, ఏ నేపధ్యం నుండి వచ్చినా, ఇంకా దేవుని పోలికలో ఉన్నవాడే. ఇందువల్లనే క్రైస్తవేతరులు సైతం శాస్త్రీయంగా రాణిస్తున్నారు. ఇందువల్లనే లౌకిక సమాజంలో ఇంకా మనం ‘కొంత మంచిని’, ‘మంచి పనుల్ని’ చూడగలుగుతున్నాం (cf. లూకా 23.50-51, అపో.కా. 10.31). మనిషి గురించిన ఈ దృక్పధాన్ని బైబిల్ సమర్థిస్తోంది. ఏదెను వనంలో మానవ పతనం తర్వాత కూడా బైబిల్ మనిషిని ‘దైవ పోలిక’ గానే చూస్తోంది (cf.ఆదికాండం.9.6, మత్తయి.22.20-21, యాకోబు 3.9).
మనిషి పాపం వల్ల తన మేధను పాడు చేసుకోవడమే కాదు, దైవ ప్రయోజనాలకు వ్యతిరేకంగా, తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆ మేధను దుర్వినియోగం చేయడం మొదలెట్టాడు. బాబెలు గోపురం దగ్గర జరిగిన మానవ ప్రయత్నం ఈ మేధా దుర్వినియోగాన్ని ఎత్తి చూపించే మంచి ఉదాహరణ (ఆదికాండం 11.1-9). దేవుడు మనిషి మేధకు వ్యతిరేఖి కాదు. నిజానికి అది మనిషికి దేవుడిచ్చిన వరం. వారి ప్రయత్నం కాదు, వారి ప్రయోజనం దేవునికి కోపం తెప్పించింది. ఆ మనుషుల ప్రయోజనాలు ఆదికాండం మొదటి అధ్యాయంలో సుస్పష్టం చేసిన దేవుని ప్రయోజనాలకు వ్యతిరేఖంగా ఉన్నాయి. మనిషి ‘భూమ్మీద విస్తరించి, దాన్ని స్వాధీనం చేసుకోవలన్నది’ దేవుని నిర్ణయం. బాబెలు గోపుర నిర్మాణకులేమో తాము ‘భూమ్మీద విస్తరించకుండా’ ఒక్క చోటే స్థిరపడాలనుకున్నారు (ఆదికాండం 1.28, 9.4 లను పోల్చి చూడండి). తన సృష్టి ఐన మనిషి ప్రతీ పనిలో తన పేరును నిలబెట్టాలన్నది దేవుని ఆకాంక్ష (రోమా.11.36, 1 కొరింథీ. 10.31, కొలస్సీ.3.23). గోపుర నిర్మాణకులేమో తమకు పేరు తెచ్చుకోవాలని తహ తహలాడారు (ఆదికాండం 11.4).
చరిత్రలో మొదటి హత్య (హేబెలు హత్య) కూడా దేవుడిచ్చిన మానవ భావోద్రేకాలు, ఊహా పఠిమ, వివేచన, స్వేచ్ఛాధికారాలను దుర్వినియోగం చేయడం వల్లనే జరిగింది (cf.ఆదికాండం 4.5-8). ఎందుకంటే అది పధకం ప్రకారం (పూర్వాలోచనతో) చేసిన హత్యేనని తెలిసిపోతోంది. నేడు జరుగుతున్న నేరాలు ఘోరాల్లో మానవ మేధ, సృజనాత్మకత ఎలా దుర్వినియోగానికి గురవుతోందో నేటి న్యూస్ ఛానెల్సూ, న్యూస్ పేపర్లూ, సోషల్ మీడియా వార్తలూ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. పన్నెండవ యునైటెడ్ నేషన్స్ కాంగ్రెస్ ఆన్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రిమినల్ జస్టిస్ పరిశోధన (2011) ప్రకారం చెప్పాలంటే, సమాచార సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల, అంతర్జాల వినియోగం ఉధృతం కావడం వల్ల నేరగాళ్లకు అవకాశాలు పెరిగి, నేరాలు అధికమవుతున్నాయని తేలింది.
లోకం గురించిన ఈ భయానక చిత్రం క్రైస్తవుల్నీ, క్రైస్తవ సంఘాన్నీ కదిలించాలి. క్రైస్తవులు తోటి మనుషుల పట్ల సానుభూతి, శ్రద్దాసక్తులతో వారికి సువార్త చెప్పాలి (మత్తయి.9.36, 15.32, 23.23, మార్కు 6.34, లూకా.6.36, మత్తయి.5.7). అనేకులు అభిప్రాయపడ్డట్టు మతమార్పిడి కోసం కాకుండా, ఈ సువార్త ప్రయత్నం, ప్రయాస మానవ క్షేమార్థం, దైవ మహిమార్థం జరగాలి. నిజానికి, క్రీస్తు వచ్చిందే అందుకు౼నశించిన దాన్ని పునరుద్ధరించడానికి, పునీతం చేయడానికి!