నేటి విశ్వాస నాయకుడు.
లియోన్హార్డ్ స్కీమర్ – హత సాక్షి
పరలోక పిలుపు : 14 జనవరి 1528.
ప్రారంభ అనాబాప్టిస్ట్, వేదాంతవేత్త, రచయిత, కీర్తన స్వరకర్త.

లియోన్హార్డ్ స్కీమర్ (1500-1528) ఒక ప్రారంభ అనాబాప్టిస్ట్ నాయకుడు, కేథలిక్కుల బాప్తిస్మము సరైనది కాదు, మరలా బాప్తిస్మము తీసుకోవాలన్న విశ్వాసము నిమిత్తము రోమన్ కాథలిక్ అధికారులచే దారుణంగా చంపబడి, హతసాక్షి అయినాడు. ఈయన హన్స్ డెంక్, హన్స్ హట్, హన్స్ ష్లాఫర్, అంబ్రోసియస్ స్పిట్టెల్ మేయర్, హన్స్ నాడ్లర్ వంటి నాయకులతో కలిసి పాల్గొన్న దక్షిణ జర్మన్ అనాబాప్టిస్ట్ ఉద్యమం ద్వారా వీరి విశ్వాసము, ఆధ్యాత్మిక విధానము బలంగా ప్రతిబింభించింది. నిజమైన అవగాహన కోసం “బయటి పదం” (లేఖనాలు మాత్రమే) సరిపోవు కానీ, హృదయంలో ప్రకాశించే పరిశుద్దాత్మ ద్వారా నిజమైన మార్పు వస్తుంది. ఈ విశ్వాసముతో ఈయన, తన అనుచరులు తమ ఆస్తిని వదులుకొని ఉద్యమములోకి రావటం ద్వారా వీరి సంఘసభ్యులను ప్రభావితం చేసిరి. ఈయన సిద్ధాంతము ఆనాటి క్రీస్తు బాధలను ప్రజలకు తెలియచేసింది. ఈ ఇతివృత్తం ఈయన కీర్తనలలో కూడా ప్రతిబింబిస్తుంది, ఇవన్నీ బధ్రపరచబడి, నేటికీ వాడబడుచున్నవి.

స్కీమర్ వోక్లాబ్రక్, వియన్నాలో భక్తులైన తల్లిదండ్రులకు జన్మించాడు, మొదట్లో కాథలిక్ ప్రీస్టుగా చేరాలని కోరుకున్నాడు, కానీ ప్రీస్టులలో దైవభక్తి లేకపోవడంతో భయపడి, పవిత్రమైన బేర్ఫుట్ ఫ్రైయర్స్ (ఫ్రాన్సిస్కాన్స్)లో చేరాడు, అయితే అక్కడ కూడా కపటత్వం, కలహాలు కనిపించాయి. ఆరు సంవత్సరాల తరువాత, స్టైరియాలోని జుడెన్బర్గ్లోని మఠం నుండి పారిపోయాడు. ఈయన నార్న్బెర్గ్కు వెళ్లి, అక్కడ టైలరింగు నేర్చుకున్నాడు. ఈయన రాడికల్ రిఫార్మేషన్ యొక్క ముఖ్య వ్యక్తులను ఎదుర్కొని, తరువాత, మొరావియాలోని నికోల్స్బర్గ్కు వెళ్లి, గతంలో వ్యతిరేకించిన హబ్మైర్ బోధనలను వినడానికి వెళ్ళాడు. అక్కడ నుండి, ఈయన హాన్స్ హట్ దగ్గర నిజమైన క్రైస్తవత్వాన్ని వెతకడానికి వియన్నాకు వెళ్లి, 1527లో ఓస్వాల్డ్ గ్లైట్ నుండి విశ్వాస బాప్తిస్మము తీసుకున్నాడు. బాప్తిస్మము పొందిన ఆరు నెలల్లో ఈయన 28 నగరాల్లో బోధించి, 200 మందికి పైగా అనాబాప్టిజం విశ్వాసంలోకి మార్చగలిగాడు.

స్కీమర్ రాడికల్ ఆలోచనలకు కేంద్రంగా ఉన్న అప్పర్ ఆస్ట్రియాలోని స్టెయిర్కి వెళ్లాడు, అక్కడ ఈయన చాలా మంది మతమార్పిడులకు బాప్తిస్మము ఇచ్చి, బోధకుడిగా నియమించబడ్డాడు, కాథలిక్ అధికారులు తనను స్వాధీనం చేసుకోవాలని చూస్తునప్పటకీ, ఈయన విశ్వాసాన్ని వ్యాప్తి చేయడానికి సాల్జ్బర్గ్, బవేరియా, టైరోల్ లకు వెళ్లాడు. ఈయన మారిన ఆరు నెలల తర్వాత, నవంబర్ 25, 1527న టైరోల్లోని రాటెన్బర్గ్లో అరెస్టు చేయబడ్డాడు. ఖైదు చేయబడినప్పటికీ, బోధన, రచనను కొనసాగించాడు, ఈయన లేఖలు అనాబాప్టిస్ట్ ఉద్యమాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. జనవరి 1528 వరకు ఈయన ఖైదు సమయంలో, అనేక ప్రభావవంతమైన రచనలను వ్రాసి ప్రచురించాడు. ఈ రచనలు ఈయన వేదాంతపరమైన అంతర్దృష్టులను, అనాబాప్టిస్ట్ నమ్మకాల పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తాయి, మరణము ఆసన్నమైన కాలములో, అమలు అయేంతవరకు కూడా, ఈయన తన వేదాంతాన్ని ప్రతిబింబించే కీర్తనలను కూడా రచించాడు.

జనవరి 1528లో స్కీమర్ తప్పించుకోవాలాకున్నప్పటకి, మళ్లీ అరెస్టు చేసి, తలారికి అప్పగించారు. విపరీతమైన చిత్రహింసల తర్వాత, చివరికి 14 జనవరి 1528న రాటెన్బర్గ్లో శిరచ్ఛేదం చేయబడ్డాడు. 1528 -1540 మధ్యకాలంలో, మరో 70 మంది అనాబాప్టిస్ట్ పురుషులు, స్త్రీలు వారి విశ్వాసం కోసం రోమన్ కాథలిక్ అధికారులచే ఉరితీయబడ్డారు.

“నేటి విశ్వాస నాయకుడు” సంక్షిప్త జీవిత చరిత్రను తెలిసికోవడం ద్వారా, దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం, ఈ పరిచర్య లక్ష్యం. భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి.

ప్రభువు నామమున వందనములు 🙏🏻
జాన్ మైఖేల్, రాజమండ్రి.

Leave a comment