
నేటి విశ్వాస నాయకుడు
జాన్ హల్లియర్, హతసాక్షి
పరలోక పిలుపు : 16 ఏప్రిల్ 1556
దైర్యవంతుడైన బోధకుడు, పండితుడు, గాయకుడు, మతాధికారి.
జాన్ హల్లియర్, (1520 – 1556) తాను నమ్మిన విశ్వాసం నిమిత్తం, సత్యం లోనే నిలబడి, ప్రాణం ఇచ్చిన ధైర్యవంతుడు. ఈయన ఇంగ్లాండులో ఆంగ్ల క్రైస్తవ చరిత్ర అస్థిర కాలంలో ఉన్న గొప్ప బోధకుడు. ఈయన బలిదానం ఆంగ్ల సంస్కరణ చరిత్రలో ఒక పదునైన అధ్యాయం. ఈయన త్యాగం ఆంగ్ల మత చరిత్ర చీకటి కాలాలలో ఒకటైన ప్రొటెస్టంట్ విశ్వాసాన్ని సమర్థించిన వారి ధైర్యం, విశ్వాసానికి శక్తివంతమైన సాక్ష్యంగా గుర్తుంచుకోబడుతుంది.
జాన్ హల్లియర్ 1520లో ఇంగ్లాండ్లో జన్మించాడు. చిన్ననాటినుంచి మంచి విద్యాభ్యాసం పొందిన ఈయన, ఈటన్ కాలేజ్ లో చదివి, తర్వాత కేంబ్రిడ్జ్ లోని కింగ్స్ కాలేజ్ లో ఉన్నత విద్యనంతా పూర్తి చేశాడు. ఈయన సంగీత విభాగంలో మంచి గాయకుడు. అలానే, బైబిల్ మీద మంచి పట్టు, జ్ఞానంతో గొప్ప బోధకుడిగా పేరు పొందాడు. ప్రజలకు స్పష్టంగా దేవుని వాక్యాన్ని బోధించేవాడు. 1549లో, రాజు ఎడ్వర్డ్ VI పరిపాలనలో ఈయన కేంబ్రిడ్జ్ షైర్ లోని బాబ్రహామ్ లో పాస్టర్ గా నియమించబడ్డారు. ఇది ప్రొటెస్టంట్ విశ్వాస పునరుద్ధరణ కాలం. ఆ కాలంలో ఇంగ్లాండ్ లో ప్రొటెస్టంట్ విశ్వాసం అనుసరించేవాళ్లకు స్వేచ్ఛ ఉండేది.
కానీ 1553లో బ్లడీ మేరీగా పేరుగాంచిన రాణి మేరీ సింహాసనాన్ని అధిరోహించడంతో పరిస్థితులు మారిపోయాయి. ఈమె ప్రొటెస్టంట్లను తీవ్రాతి తీవ్రంగా హింసించేది, ఇటువంటి కాలంలో కూడా భయంలేకుండా హల్లియర్, బైబిల్ వాక్యాలను ధైర్యంగా బోధిస్తూ, రాజధాని పరిధిలోని కింగ్స్ లిన్ వంటి ప్రాంతాల్లో ప్రార్థన సభలు నిర్వహించేవారు. ఈ కారణంగా ఈయనను 1556 ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. ఎలీ నగర బిషప్ థామస్ థిరెల్బీ, ఇతర మత గురువుల ముందు విచారణకు లోనయ్యారు. పలుమార్లు విచారణ చేసి, ఈయనపై ఎంతో ఒత్తిడి తెచ్చి, తన విశ్వాసాన్ని మార్చుకోమని కోరారు. కానీ హల్లియర్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. చివరకు 1556 ఏప్రిల్ 16న, ఆ రోజు క్రైస్తవులకు ముఖ్యమైన గురువారం, కేంబ్రిడ్జ్ నగరంలోని జీసస్ గ్రీన్ వద్ద బండిపై కట్టి బతికుండగానే దారుణంగా తగలబెట్టారు.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.