నేటి విశ్వాస నాయకుడు.
మైల్స్ కవర్ డెల్
పరలోక పిలుపు : 20 జనవరి 1569.
సంఘ సంస్కర్త, ప్రీస్ట్, బైబిల్ అనువాదకుడు, గీత రచయిత.

మైల్స్ కవర్ డెల్ (1488-1569) ఒక ప్రముఖ ఇంగ్లీష్ సంఘ సంస్కర్తగా, బైబిల్ అనువాదకుడిగా, గొప్ప పేరు గడించారు. 1535లో ఈయన క్రైస్తవ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించారు. మొత్తం బైబిలును ఆధునిక ఇంగ్లీష్లో ముద్రించబడిన మొదటి అనువాదాన్ని రూపొందించి, విలియం టిండేల్ ప్రారంభించిన అనువాదాలను పూర్తిచేసి, ఒక కీలకమైన కార్యసాధనగా నిలిచారు. ఈ విశిష్ట సాహసం, బైబిలును సామాన్య ప్రజలకూ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ప్రోత్సహించడంలో, తదుపరి ఇంగ్లీష్ బైబిల్ అనువాదాల పునాదులను బలపరచడంలో కీలక పాత్ర పోషించింది. కోవర్ డెల్ సంస్కరణ సిద్ధాంతాలను ప్రతిబింబించే కీర్తన రచనల ద్వారా కూడా విస్తృతంగా గొప్ప పేరు సంపాదించారు.

కవర్ డెల్, 1488లో యార్క్షైర్లో జన్మించినట్లు భావిస్తున్నారు. ఆయన కెంబ్రిడ్జ్లో తత్వశాస్త్రం, వేదశాస్త్రం అభ్యసించి, 1513లో బ్యాచిలర్ ఆఫ్ కానన్ లా పట్టా పొందారు. 1514లో జాన్ అండర్వుడ్ చేత ప్రీస్ట్గా అభిషేకం పొందిన కోవర్ డెల్, 1520 నుండి 1525 మధ్య కాలంలో రాబర్ట్ బార్న్స్ నాయకత్వంలో కెంబ్రిడ్జ్లో ఆగస్టినియన్ మఠవాసులకు బోధించాడు. కెంబ్రిడ్జ్లో మానవతావాది ఆలోచనలతో పాటు సవరణ సిద్ధాంతాలను ప్రవేశపెట్టాడు. ఈయన పౌలు గారి లేఖలను అనువాద రూపంలో చదవడంతో పాటు శాస్త్రీయ సాహిత్యాన్ని తన బోధనలో చేర్చడం ద్వారా కోవర్ డెల్ సంస్కరణ భావజాలంపై మరింత ప్రభావాన్ని చూపాడు.

1528లో, ఎసెక్స్లో ప్రీస్ట్గా ఉన్నప్పుడు, కోవర్ డెల్ విగ్రహ ఆరాధనకు వ్యతిరేకంగా బోధించటం ప్రారంభించారు. 1529లో, ఆయన విలియం టిండేల్తో కలిసి హాంబర్గ్లో మోషే వ్రాసిన ఐదు పుస్తకాలను అనువదించడంలో సహకరించారు. ఆ తర్వాత ఈయన ఆంట్వెర్ప్లో స్థిరపడి, అక్కడ బైబిలు అనువాదానికి తన జీవితాన్ని అంకితం చేశారు. తరువాత ఇంగ్లాండ్కు తిరిగి వచ్చిన కోవర్ డెల్, సంఘ సంస్కరణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. ఆయన మత సంబంధిత పత్రాలను అనువదించడం, అలాగే 1539లో గ్రేట్ బైబిల్ అనే పేరుతో ప్రముఖ బైబిల్ సంపాదకత్వంలో భాగమయ్యారు. అయితే, 1540లో హెన్రీ VIII మత విధానాల కారణంగా, కోవర్ డెల్ ఇంగ్లాండ్ను విడిచి వెళ్లాల్సి వచ్చింది. హెన్రీ మరణానంతరం, ఆయన తిరిగి ఇంగ్లాండ్కు వచ్చి ప్రొటెస్టెంట్ సంస్కరణ ఉద్యమంలో మరింత చురుకుగా పాల్గొన్నారు. 1551లో ఎక్సెటర్ బిషప్గా నియమితులైన కోవర్ డెల్, ప్రొటెస్టెంట్ సిద్ధాంతాల బలోపేతానికి తన సేవలను అందించారు. కానీ, క్వీన్ మేరీ I పాలనలో, కాథలిక్ పునరుద్ధరణ కారణంగా, ఆయన తన పదవిని కోల్పోయారు. అంతేకాకుండా, డెన్మార్క్ జోక్యం వల్ల కొంచెంలో బలిదానం నుండి తప్పించుకున్నాడు. 1559 వరకు విదేశాల్లో నివసించిన కోవర్ డెల్, క్వీన్ ఎలిజబెత్ I పాలనలో తిరిగి ఇంగ్లాండ్కు వచ్చారు. అయితే, ఈయన అందించిన ఘనతను పరిగణనలోకి తీసుకున్నా, మతపరమైన పదవులను స్వీకరించేందుకు నిరాకరించారు. ఈయన ప్రసంగాలు విశేషంగా ప్రశంసించబడ్డాయి. ఇవి ఈయనకు అత్యంత గౌరవం కలిగించినవి.

1534లో, కాంటర్బరీ కాన్వొకేషన్ మొత్తం బైబిల్ను ఆంగ్లంలోకి అనువదించడానికి అనుమతించమని హెన్రీ VIIIని అభ్యర్థించింది. ప్రతిస్పందనగా, కోవర్ డెల్ మొదటి పూర్తి ఆంగ్ల బైబిల్ను 4 అక్టోబర్ 1535న ముద్రణ పూర్తి చేసి, రాజుకు అంకితం చేశాడు.ఈ అనువాదం ముఖ్యంగా విలియం టిండేల్ రచనపై ఆధారపడింది. టిండేల్ యొక్క కొత్త నిబంధన మోషే పుస్తకాలు, బుక్ ఆఫ్ యోనా యొక్క అనువాదాలు. ఇతర పాత నిబంధన పుస్తకాల కోసం, మార్టిన్ లూథర్ యొక్క జర్మన్ అనువాదం, ఇతర మూలాల నుండి తీసుకున్నాడు. ఈ బైబిల్లోని కీర్తనల పుస్తక అనువాదం ప్రభావవంతంగా మారింది. ఇప్పటికీ బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్లో ఉపయోగించబడుతుంది, 1926 ఐరిష్, 1928 U.S. ఎపిస్కోపల్, 1962 కెనడియన్ బుక్స్ ఆఫ్ కామన్ ప్రేయర్లలో చిన్న సవరణలు కనిపించాయి.

కవర్ డెల్ 81 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఇంగ్లీష్, కాంటినెంటల్ రిఫార్మర్స్తో అతని విస్తృత పరిచయాలు ఆంగ్ల భాషలో బైబిల్ యొక్క వరుస సంస్కరణల అభివృద్ధికి అంతర్భాగంగా ఉన్నాయి. 2011లో అధీకృత కింగ్ జేమ్స్ బైబిల్ యొక్క 400వ వార్షికోత్సవం కోసం, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఒక తీర్మానాన్ని జారీ చేసింది, దీనిని జనరల్ సైనాడ్ ఆమోదించింది. కవర్ డేల్ బైబిల్తో ప్రారంభమయ్యే ఈ తీర్మానం, అధీకృత కింగ్ జేమ్స్ బైబిల్ (1611) మరియు దాని తక్షణ పూర్వీకుల యొక్క శాశ్వత ప్రాముఖ్యత గురించి క్లుప్త వివరణను కలిగి ఉంది.

“నేటి విశ్వాస నాయకుడు” సంక్షిప్త జీవిత చరిత్రను తెలిసికోవడం ద్వారా, దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం, ఈ పరిచర్య లక్ష్యం. భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి.

ప్రభువు నామమున వందనములు 🙏🏻
జాన్ మైఖేల్, రాజమండ్రి.

Leave a comment