
నేటి విశ్వాస నాయకురాలు
మేరీ గ్రోవ్స్ ముల్లర్
పరలోక పిలుపు : 06 ఫిబ్రవరి 1870
మిషనరీ, సువార్తికురాలు, ప్రార్ధన యోధురాలు, అస్లే డౌన్ అనాథాశ్రమం సహ వ్యవస్థాపకరాలు.
మేరీ గ్రోవ్స్ ముల్లర్ (1797–1870) ప్రఖ్యాత సువార్తికుడు, బ్రిస్టల్‌లోని యాష్లే డౌన్ అనాథాశ్రమ స్థాపకుడైన జార్జ్ ముల్లర్ సతీమణి. ఈమె ఒక ప్రముఖ ప్రొటెస్టంట్ మిషనరీ అయిన ఆంథోనీ నోరిస్ గ్రోవ్స్ సోదరి కూడా. ఈమె 1836లో వారి మొదటి అనాధ ఆశ్రమమును స్థాపించడంలో జార్జ్ ముల్లర్ కు చురుకుగా మద్దతు ఇచ్చింది, తరువాత వందలాది మంది పిల్లలకు ఆశ్రయం కల్పించడానికి విస్తరించింది. అనాథ శరణాలయాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించింది, దేవుని ఏర్పాటుపై తన భర్త యొక్క అచంచలమైన నమ్మకాన్ని పంచుకుంది, విరాళాలు అడగకుండా కేవలం ప్రార్థన, విశ్వాసంపై ఆధారపడింది. 1867లో లండన్‌లో స్టాక్‌వెల్ అనాథాశ్రమాన్ని స్థాపించిన చార్లెస్ స్పర్జన్తో సహా అనేక మంది క్రైస్తవ నాయకులను వారి పరిచర్య తీవ్రంగా ప్రభావితం చేసింది. అనాథల శ్రేయస్సు కోసం మేరీ యొక్క అంకితభావం చివరి వరకు స్థిరంగా ఉంది.
మేరీ ఆగష్టు 28, 1796న న్యూటన్ వాలెన్స్, హాంప్‌షైర్, ఇంగ్లాండ్‌లో ఆంథోనీ గ్రోవ్స్, లిడియా వైట్లకు జన్మించెను. ఈమె ఖగోళ శాస్త్రంలో ప్రత్యేక ఆసక్తితో ఆంగ్ల వ్యాకరణం, భూగోళశాస్త్రం, చరిత్ర, ఫ్రెంచ్, లాటిన్, హీబ్రూ భాషలను అభ్యసిస్తూ చక్కటి విద్యను పొందింది. ఇంకా పియానో వాయించడం, పెయింటింగ్‌లో కూడా నైపుణ్యం సాధించింది. ఈమె పెంచబడిన తీరు భవిష్యత్తులో ఆచరణాత్మక జ్ఞానముతో, భార్యగా, తల్లిగా తన పాత్రలను పోషించుటకు సిద్ధం చేసింది.మేరీ గ్రోవ్స్, జార్జ్ ముల్లర్‌ను అక్టోబర్ 7, 1830న ఇంగ్లాండ్‌లోని ఎక్సెటర్లోని సెయింట్ డేవిడ్ చర్చిలో వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు, వారిలో ఇద్దరు చనిపోయారు, అయినప్పటికీ వారు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు, ఇతరులకు సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేశారు. మేరీ 1836లో జార్జ్‌తో కలిసి స్థాపించిన బ్రిస్టల్ అనాథ శరణాలయాల్లో కీలక పాత్ర పోషించింది, విల్సన్ స్ట్రీట్‌లో 30 మంది బాలికలకు అద్దె ఇంటితో ప్రారంభించి, ఆ తర్వాత కొత్తగా నిర్మించిన యాష్లే డౌన్ అనాథాశ్రమంలో వేలాది మంది అనాథలకు వసతి కల్పించేందుకు విస్తరించింది. అనాథ శరణాలయాలతో ఈమె చేసిన పనికి మించి, బ్రిస్టల్ లోని బెథెస్డా చాపెల్‌లో జార్జ్ ఆత్మీయ సంబంధమైన పరిచర్యకు కూడా తన వంతు కృషి చేసింది.
మేరీ ముల్లర్ ఫిబ్రవరి 6, 1870న 39 సంవత్సరాల వివాహం తర్వాత 73 సంవత్సరాల వయస్సులో ఇంగ్లాండ్‌లోని గ్లౌసెస్టర్ షైర్ లోని బ్రిస్టల్ లో మరణించింది. ఈమె మరణం జార్జ్‌కు తీవ్ర లోటు, ఈమెను “దేవుని నుండి అమూల్యమైన బహుమతి” గా అభివర్ణించారు. ఆయన దుఃఖంలో ఉన్నప్పటికీ, వారి మిషన్‌ను కొనసాగించాడు, ఈమె అచంచలమైన విశ్వాసం, సేవ ద్వారా శక్తిని పొందాడు. ఈమె జార్జ్ ముల్లర్‌తో కలిసి చేసిన విశ్వాస ఆధారిత పరిచర్య ద్వారా లెక్కలేనన్ని జీవితాలను తాకింది. ఈమె వారసత్వం అనాథాశ్రమాలు ద్వారా కొనసాగుతూనే ఉన్నది.