
ఈరోజు (07.11.1873) ఆంధ్రాలోని గుంటూరులో గొప్ప పరిచర్య చేసిన మిషనరీ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు దేవుని పిలుపు అందుకున్న రోజు ..
హయ్యర్ దొరగారు విదేశాలకు పంపబడిన తొలి అమెరికన్ లూథరన్ మిషనరీ. అంతేకాకుండా ఆంధ్రాలోని గుంటూరుకి మొట్టమొదటి మిషనరీ. ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ చర్చ్ (AELC) యొక్క వ్యవస్థాపకుడు. ఈ అలుపెరుగని ప్రేషితుడు, అందరితోనూ ఆప్యాయంగా ఫాదర్ హయ్యర్ అనీ, హయ్యర్ దొరగారు అని పిలవబడేవారు. జర్మనీలో జన్మించిన ఈయన అమెరికాలో వేదాంత విద్యనూ, జర్మనీలో వైద్య విద్యనూ పూర్తి చేసి, దానితో పాటు హెబ్రీ, గ్రీక్ సహా అనేక భాషలపై పట్టు సంపాదించారు. 1820 నుండి 20 సంవత్సరాలు అమెరికాలోని సుమారు 300 చర్చిలను దర్శించి, తన వాక్యోపదేశంతో పురికొల్పి, ఎన్నో నూతన సంఘాలను, సండే స్కూల్ గ్రూపులను ప్రారంభించారు. 1841 అక్టోబర్ 15 న ఈయన విదేశీ మిషనరీగా బోస్టన్ నుంచి మద్రాస్ కు ప్రయాణమై వచ్చారు. దక్షిణ భారతదేశంలోని అన్ని మిషన్ ఫీల్డ్ లను సందర్శించి, తన సువార్తతో బలపరిచారు.
1842 జూలై 31న గుంటూరు ప్రాంతానికి చేరుకుని, తెలుగు నేర్చుకొని పరిచర్యను గుంటూరు ప్రాంతంలోని పల్నాడులో ప్రారంభించారు. పురుషాధిక్య సమాజంలోని అనేకులు బాలిక విద్యను నిరసిస్తున్నా, ఆరోపణలను ఎంతో ధీటుగా ఎదుర్కొని బాలికలకు విద్య అందించడంలో, వారికి ప్రత్యేక పాఠశాలలను స్థాపించడంలో ఎంతో కృషి చేశారు. ఒక మెడికల్ మిషనరీ గా పలుచోట్ల క్యాంపులు నిర్వహించడం మాత్రమే కాక గుంటూరు, భీమవరం, రాజమండ్రి లలో ఆసుపత్రులను స్థాపించి, ఎందరికో ఉచిత వైద్యాన్ని అందించారు.
హయ్యర్ దొరగారు తన 80వ ఏట 1873 నవంబర్ 7న పెన్సిల్వేనియా లో పరమపదించారు.