
ఈ రోజు భారత దేశం-మహారాష్ట్రలోని ముంబై పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేసిన స్కాటిష్ మిషనరీ జాన్ ముర్రే మిచెల్ గారు పరమపదించిన రోజు (14.11.1904).
1815లో స్కాట్లాండ్లో జన్మించిన మిచెల్ గారు 1833లో MA పట్టభద్రుడయ్యాడు తరువాత ఎడిన్ బర్గ్ లో (చర్చి మినిస్ట్రీ) సంఘ పరిచర్య కోర్సు పూర్తి చేశారు.
మిచెల్ గారిని 1838లో చర్చి వారు అభిషేకించి ముంబై ప్రాంతానికి పంపించారు. అతి త్వరలోనే ఆయన మరాఠీ మరియు సంస్కృత భాషలపై పాండిత్యం సంపాదించి ముంబై పరిసర ప్రాంతాల్లో పరిచర్య మొదలుపెట్టారు. 1844లో కొత్త పరిచర్య ప్రారంభించడానికి నాగపూర్ ప్రాంతానికి మారి అక్కడి స్థానిక ప్రజలతో తరచుగా సంభాషిస్తూ, కలిసి మెలిసి ఉంటూ పది సంవత్సరాలు వారికి పరిచర్య చేశారు.
1867లో పరిచర్య ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులలో కలకత్తాలోని డఫ్ కాలేజ్ బాధ్యతలు స్వీకరించారు. అక్కడ సంతాల్ ప్రజా గుంపుల మధ్య పరిచర్య స్థాపించారు. 1870లో ప్రారంభించిన సిమ్లా యూనియన్ చర్చ్ స్థాపించడంలో ఈయన పాత్ర ఎంతైనా ఉంది. స్థానిక ప్రజల కోసం మిచెల్ మరాఠీ భాషలో అనేక పుస్తకాలను వ్రాశారు అనేక మరాఠీ పుస్తకాలను ఇంగ్లీషులోనికి అనువదించారు.
మిచెల్ గారు తన 89వ ఏటా 1904 నవంబర్ 14న స్కాట్లాండ్లో ప్రభువు పిలుపు అందుకున్నారు.