పండిత రమాబాయి (1858-1922) భారత దేశంలో మొదటి మహిళ భారతీయ మిషనరీ, ప్రార్ధన యోధురాలు, పండితురాలు, మహిళా హక్కుల కార్యకర్త, సంఘ సంస్కర్త, ముక్తి మిషన్ వ్యవస్థాపకురాలు.

నేటి విశ్వాస నాయకురాలు
పండిత రమాబాయి సరస్వతి
పరలోక పిలుపు : 05 ఏప్రిల్ 1922
భారతీయ మిషనరీ, ప్రార్ధన యోధురాలు, పండితురాలు, మహిళా హక్కుల కార్యకర్త, సంఘ సంస్కర్త, ముక్తి మిషన్ వ్యవస్థాపకురాలు.

పండిత రమాబాయి (1858-1922) భారత దేశంలో మొదటి మహిళ మిషనరీ, తన భర్త మరణానంతరం, వైద్య విద్య కొరకు 1883 లో ఇంగ్లాండుకు వెళ్లగా, అక్కడ కలసిన ఆంగ్లికన్ సోదరి చూపించిన దయ, సేవకు ప్రభావితమై ఈమె క్రైస్తవ్యము స్వీకరించెను. తర్వాత అమెరికాలో విస్తృతంగా పర్యటించి నిరుపేద భారతీయ మహిళల కోసం నిధులు సేకరించారు. ఈ నిధులతో బాల వితంతువుల కోసం శారదా సదన్ ను ఏర్పాటు చేసిరి. 1890లో, ఈమె పూణే సమీపంలోని కేద్గావ్లో ముక్తి మిషన్ అనే క్రిస్టియన్ ఛారిటీని స్థాపించిరి, ఆ తర్వాత దీనిని పండిత రమాబాయి ముక్తి మిషన్గా మార్చారు. ముక్తి మిషన్ అంటే వెలుగును ప్రసారించే గొప్ప ఆశ్రమం, దీని నినాదం “రెస్క్యూ, రీడీమ్, రీస్టోర్.” నిరాశ్రయులైన స్త్రీలు, పిల్లలను రక్షించి, ఆశ్రయమిచ్చి, విద్య ద్వారా వారికి స్వేచ్ఛను, గౌరవమును కల్పించడం, వంటి మిషన్ అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ముక్తి మిషన్ అంటే అదొక పరలోకము. అనాథలు, నిరాశ్రయ మహిళలు, హీనజాతి బాలికల కోసం భద్రమైన ఆశ్రయం, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, సేవా అవకాశాలను అందించే గొప్ప ఆశ్రమం. ఇది కేవలం ఒక ఆశ్రమం మాత్రమే కాకుండా, అనేక జీవితాలను మార్చిన ఆధ్యాత్మిక పునరుజ్జీవన కేంద్రం. సమాజంలో మహిళల స్థాయిని పెంచి, వారికి హోదా, ఆత్మగౌరవాన్ని కలిగించింది. వీళ్ళ అవసరాలన్నీ, ఆశ్రమములోనే తీర్చబడతాయి, అన్నిరకాల కుటీర పరిశ్రమలు ఉన్నాయి. అనగా వీళ్ళ బట్టలు, తినే తిండి ప్రతీది వీళ్ళే ఉత్పత్తి చేసుకుంటారు, ఇదొక పెద్ద గ్రామము, ఇంకా చెప్పాలంటే బయటవారే వీళ్ళ మీద ఆధారపడతారు. ప్రభువు ఈమెను ఈ ఉన్నతమైన సేవ చేయుటకు ఏర్పాటుచేసుకొనెను. నేటికీ, ముక్తి మిషన్ అనేకమందికి ఆశాజ్యోతి, ప్రేమ, దైవభక్తి యొక్క వెలుగు ప్రసరించే స్థలంగా నిలుస్తోంది. ఓర్చుకోలేని సాంప్రదాయిక హిందూ సమాజం నుండి విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, ఈమె విశ్వాస లక్ష్యంలో స్థిరంగా ఉండి, దేవునిమీదే భారము వేసికొని నడచుకొనెను. ఈమె ప్రేమ, పరిచర్య, ప్రార్ధనా జీవితం, 1905లో జరిగిన పరిశుద్ధ ఆధ్యాత్మిక మేల్కొలుపుతో, ముక్తి మిషన్లో “పరిశుద్ధ అగ్ని” వెలుగొందింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వ్యాపించగా, దీన్ని ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక మేల్కొలుపు చిహ్నంగా భావించిన మిషనరీలను ఆకర్షించింది. దేశములో వారి వారి ప్రార్ధనా పరిచర్యలో భాగంగా ముక్తి మిషన్లో కూడా ప్రభువిచ్చిన ప్రత్యేక భారంతో, 1905 లో ప్రేయింగ్ హైడ్ 2 వారాలు, 1938 మేలో బ్రదర్ భక్త్ సింగ్ 19 రోజులు, ఇంకా బారమున్న మిషనరీలు, ఆల్ నైట్ ప్రేయర్లు జరిపించితిరి. దీని వల్ల ఉజ్జీవము, భవిష్యత్తు పరిచర్య ముక్తి మిషన్లోనే కాకుండా దేశమంతా విస్తరించడానికి వీలయినది. ఈ ముక్తి మిషన్ లో నిత్యమూ ప్రభువు పరిచర్య జరుగుతూనేయుంటాది. ఈమె కాలంలో అనేకమంది మిషనరీలతో, పాస్టర్లతో సువార్త చెప్పిస్తూ ఉండేది. ముక్తి మిషన్ ద్వారా లక్షలాదిమంది దాస్యబంధనాల నుండి విముక్తి పొంది, అసలైన ముక్తిని పొందారు. మహిళల అభ్యున్నతికి, క్రైస్తవ మిషనరీ సేవకు ఈమె చేసిన కృషి తర తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది.

రమాబాయి నిష్ఠగల బ్రాహ్మణ కుటుంబంలో 23 ఏప్రిల్ 1858న అనంత శాస్త్రి, లక్ష్మీబాయి దంపతులకు జన్మించెను. తెలివైన బాలికగా సంస్కృతము అంతయు నేర్చుకొనెను. హిందూ గ్రంధములన్నియు చదివెను. 16 సంవత్సరాల వయస్సులోనే అనాథ అయిన ఈమె, సోదరునితో కలసి కరువు సమయంలో భారతదేశం అంతటా ప్రయాణిస్తూ, గ్రంథాలు పఠిస్తూ, బాషలన్నియు నేర్చుకొనెను. ఈకాలంలొ వితంతువుల దుస్థితి, అనాధ పిల్లల పరిస్థితి చూచెను. ఇంకా క్రిస్టియన్ మిషన్ పాఠశాలలు, అనాథాశ్రమాలను సందర్శించిన సమయంలో, క్రైస్తవులు అనాథలు, స్త్రీల పట్ల ఎలా శ్రద్ధ వహిస్తారో పరిస్థితులన్నియు, గమనించిన ఈమె చలించిపోయి సమాజాన్ని సంస్కరించాలని కోరుకుంది. ఈమె ప్రతిభ గల విద్యార్థిగా కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పండిత మరియు సరస్వతి అనే బిరుదులను 1878లో సంపాదించికొనెను. క్రైస్తవ మతం, కొత్త ఆలోచనలకు గురైన ఈమె తన నమ్మకాలను ప్రశ్నించడం ప్రారంభించింది. ఈమె బెంగాలీ న్యాయవాది అయిన బిపిన్ బిహారీ మేధ్వీని కులాంతర సంఘంలో వివాహం చేసుకుంది, కానీ అతను 1882లో కలరాతో మరణించగా, 23 సంవత్సరాల వయస్సులోనే ఈమె వితంతువుగా మిగిలిపోయింది. ఆ తర్వాత పూణేకు వెళ్లి, స్త్రీల విద్యను ప్రోత్సహించడానికి, బాల్య వివాహాలను వ్యతిరేకించడానికి ఆర్య మహిళా సమాజ్ను స్థాపించెను.

రమాబాయి 1882లో హంటర్ కమిషన్ ముందు సాక్ష్యం చెప్పింది, స్త్రీ విద్య పట్ల వ్యతిరేకతను విమర్శిస్తూ, స్త్రీల వైద్య శిక్షణ కోసం వాదించింది. ఈమె ప్రసంగం భారతదేశంలోని మహిళా వైద్య ఉద్యమాన్ని ప్రభావితం చేసింది. ఈమె వైద్య శిక్షణ కోసం 1883లో బ్రిటన్కు వెళ్లింది కానీ చెవుడు కారణంగా తిరస్కరించబడింది. అక్కడ ఉన్నప్పుడే క్రైస్తవ మతంలోకి మారింది. 1886లో, ఈమె U.S సందర్శించి, హై-కాస్ట్ హిందూ స్త్రీలకు ఉపన్యాసాలు ఇస్తూ, ఆకట్టుకుంది. ఇది హిందూ మహిళల అణచివేతను బహిర్గతం చేసింది, బాల వితంతువుల కోసం ఒక పాఠశాల కోసం నిధులను సేకరించడంలో సహాయపడింది. 1889లో భారతదేశానికి తిరిగి వచ్చిన ఈమెను భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఆహ్వానించిరి. పది మంది మహిళా ప్రతినిధులలో ఈమె కూడా ఒకరు. అదే సంవత్సరము పూణేలో శారదా సదన్ ను స్థాపించారు, అయితే విద్యార్థుల మతమార్పిడుల కారణంగా హిందూ సంస్కరణవాద మద్దతును కోల్పోయిన తర్వాత దానిని ముక్తి మిషన్గా కేద్గావ్కు మార్చారు. 1896 కరువు సమయంలో, ఆమె వేలాది మంది నిరుపేద స్త్రీలను, పిల్లలను రక్షించింది. 1900 నాటికి, ముక్తి మిషన్ 1,500 మంది నివాసితులను కలిగి ఉంది. ఈమె బైబిల్ను మరాఠీలోకి కూడా అనువదించింది.

రమాబాయి స్వతంత్రంగా ఉంటూ, తన కుమార్తె మనోరమా బాయి కూడా తల్లితో కలసి పనిచేసింది. మనోరమ శారద సదన్ కి ప్రిన్సిపాల్గా, గుల్బర్గాలో క్రిస్టియన్ హైస్కూల్ను స్థాపించడంలో సహాయం చేసింది. 1920లో, రమాబాయి ముక్తి మిషన్లో మనోరమను తన వారసురాలిగా నియమించింది, అయితే మనోరమ 1921లోనే మరణించింది. తీవ్ర ఒత్తిడికి గురైన రమాబాయి తొమ్మిది నెలల తర్వాత 63వ ఏట మరణించింది. ఇప్పటికి నిరాటంకంగా ఈమె స్థాపించిన సంస్థలు, సేవలందిస్తూ, రమాబాయి సాక్ష్యమును సజీవంగా చూపిస్తున్నాయి.

Leave a comment