విశ్వాస వీరుడు
సహోదరుడు. భక్త్ సింగ్
బాప్తిస్మము : 4 ఫిబ్రవరి 1932
సంఘ సంస్కర్త.

(సామెతలు. 10:7)
సహూ. భక్త్ సింగ్ గారు బాప్తిస్మము ఆవశ్యకతను ఎలా గుర్తించిరి? తరువాత ఇచ్చే హస్త నిక్షేపణను, సంఘ క్రమమును ఎలా సంస్కరించిరి?

సహూ. భక్త్ సింగ్ గారు మారుమనస్సు పొందిన రెండు సంవత్సరముల తర్వాత బాప్తిస్మము తీసుకొనెను. ఈ రెండు సంవత్సరములు బైబిలు చదవటంలోనే నిమగ్నమై, బాప్తిస్మము తనకు అవసరము లేదని భావించేవారు. అప్పటికే వివిధ చర్చిలలో బోధించుచూ, ఒక రోజు ఉదయం మౌనధ్యానములో ఉండగా, “నీ బాప్తిస్మము విషయము ఏమిటి అని ప్రభువు ప్రశ్నించగా!” నాకు బాప్తిష్మము అంత అవసరమని అనుకొనుట లేదు. ఎందుకనగా నేను తిరిగి జన్మించితిని, ప్రతిచోటా నా సాక్ష్యము చెప్పుచున్నాను అని చెప్పగా, మత్తయి 3:13 “ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను” అంతేకాకుండా దేవుడు ఈయనతో స్పష్టముగా “నీవు రక్షకునికంటే ఏ విధముననైనను అధికుడువా?” అని ప్రశ్నించగా, ప్రభువా! నేనెప్పుడూ అట్లు చెప్పలేదని సమాధానమిచ్చెను. దేవుడు సంధించిన విధానమునకు లోబడి, యేసు ప్రభువుకు బాప్తిస్మము తీసుకొనవలసిన అవసరము లేనప్పటికీ తన కొరకే బాప్తిస్మము తీసికొనెనని ఎరిగి, మరుసటి రోజే బాప్తిస్మము తీసుకొనెను ఈయన కెనడా దేశము విన్నిపెగ్ లో ఉంటున్నప్పుడు, రక్షణ పొందుటకు సహాయము చేసిన ఒవెల్ హాన్సన్, మిషనరీ హేవార్డ్స్ కుటుంబమునకు పరిచయము చేసెను. వీరి కుటుంబములో ఈయనను కుమారునిగా స్వీకరించి, అన్నివిధాలా సహాయపడుచు ఉండేవారు. వీరు వాంకోవర్ కు బదిలీ ఐనప్పుడు వీరితో ఈయన కూడా వెళ్లెను. వాంకోవర్ లో అక్కడ వారితో పాటు వెస్ట్ బ్రాడ్ వే చర్చికి వెళ్లుచు, అక్కడే 4 ఫిబ్రవరి 1932న బాప్తిస్మము తీసికొనెను. తర్వాత నీళ్లలో నుండి బయటకు వచ్చినప్పుడు గొప్ప సంతోషముతో నింపబడి, ఆ దినము నుండి పరిశుద్ధ గ్రంధమును ఇంకా క్రొత్త అనుభూతితో ధ్యానించుచు, ప్రార్ధనలోను, సాక్ష్యమిచ్చుటలోను గొప్ప స్వేచ్ఛతో కొనసాగుచు ఉండెను.

“బాప్తిస్మము అనేది విధేయత చూపించడం” అంతే కాదు నేను క్రీస్తును కలిగి యున్నానని సంఘానికి, ఈలోకానికి బహిరంగంగా విశ్వాసాన్ని ప్రకటించడమే! బాప్తిస్మము (“బాప్టిజ్”) అనే పదం గ్రీకు పదం బాప్టిజో నుండి వచ్చింది, దీని అర్థం “మునిగి, ముంచడం, మునిగిపోవడం లేదా ముంచెత్తడం”. నీటిలో ముంచి పైకి తీసుకురాబడే ఈచర్య మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ, భూస్థాపన, పునరుత్థానంను సూచిస్తుంది. అనగా తిరిగి జన్మించినట్టు బహిరంగ సాక్ష్యము. కాబట్టి రక్షించ బడిన లేక విశ్వసించిన వ్యక్తి బాప్తిస్మ అనుభవముగుండా వెళ్ళవలసినదే! మొదటిది, విశ్వసించుట-అంతరంగ క్రియ. రెండవది, బాప్తిస్మము పొందుట-బాహ్య క్రియ. మూడవది, హస్త నిక్షేపణ-సంఘములో అంగముగా చేర్చబడుట.

క్రైస్తవ లోకం అనాదిగా, ఇప్పటికి కూడా అత్యధిక వర్గం ప్రారంభ సంస్కరణలనే ప్రాతిపదికగా తీసుకొని, అనగా “కృప ద్వారానే రక్షణ”. దీని ప్రకారం, ఈ అంతరంగ క్రియ మినహాయించి, బాహ్య క్రియ అయిన పూర్తిగా ముంచే బాపిస్మము అవసరంలేదని వారి వాదన. ఈ విషయంలో పేరు గాంచిన అనేక ప్రపంచ సువార్తికులు కూడా, వారి సువార్తలో భాగంగా రక్షణ మరియు బాప్తిస్మము గురించి కూడా దీటుగా ప్రకటించుచు, దీనిని నెరవేర్చవలసిన భాధ్యత ప్రపంచ దేశాలలో ఉన్న, వివిధ డినామినేషన్ సంఘాల నాయకులదే, పాస్టర్లదే అని వారి బావన. సిద్ధాంత పరంగా ఈ ముఖ్యమైన బాప్తిస్మము అవసరము లేదని గ్రహింపులో ఉన్న, ఈ అత్యధిక క్రైస్తవవర్గం ఈ ప్రక్రియను ఎలా నెరవేర్చగలదు? కొన్ని క్రైస్తవ వర్గ సంఘములలో ముంచే బాప్తిస్మము ఉన్నప్పటికీ, తదుపరి హస్త నిక్షేపణ ఉండదు. బాప్తిస్మము తదుపరి హస్తనిక్షేపణ ప్రాముఖ్యతను, ఇంకనూ సంఘ వ్యవస్థలో ఉన్న అనేక లోటు పాట్లను, గమనించిన ప్రపంచ సువార్తికుడైన సహో. భక్త్ సింగ్ గారికి ప్రభువు బయలుపరచిన ప్రత్యక్షత అ.కా 2:42, “నూతన నిబంధన సంఘము”.
ఈ నూతన నిబంధన సంఘ నియమావళి క్రమము ప్రకారము ప్రాముఖ్యతలో ముందున్న, హితమైన అంశములు.
1.సువార్త ప్రకటించుట. మార్కు 16:15.
2.విశ్వసించిన వారికి బాప్తిష్మము ఇచ్చుట. మత్తయి 28:19; అ.కా 2:41.
3.బాప్తిస్మము ఇచ్చిన వెంటనే హస్త నిక్షేపణ జరుపుట.అ.కా 8:16,17;19:6;2తిమోతి 1:6.
4.సంఘముగా(సహవాసముగా) చేర్చబడుట. అ.కా 2:42.
5.ప్రభువు దినమందు వ్యక్తిగత ఆరాధన. PS 95:7, Heb 13:15
6.ప్రతి ఆదివారము ప్రభువు బల్ల. అ.కా 2:42,1కొరింథీ 11:23-25
7.సంఘముగా కూడి ప్రార్ధించుట. అ.కా 2:42,1థెస్స 5:16.

ఆ దినము, ప్రభువు దినము, 22 జూన్ 1941, సంఘ స్థాపన జరిగిన దినము. విశ్వసించి, సిద్ధపడిన 16మందికి అదే రోజున సహో. భక్త్ సింగ్ గారు బాప్తిస్మము ఇచ్చి, సహూ. గోల్డ్స్ వర్ధిగారితో కలసి హస్తనిక్షేపణ చేసితిరి. చేర్చబడిన వీరు, సంఘ మార్గదర్శక బృందము కలసి సంఘముగా ఏర్పడి, పైన చూపిన నూతన నిబంధన నియమావళి అంశముల ప్రకారము, సంపూర్ణ క్రమములో ప్రభువును ఆరాదించిరి. ఈ ప్రక్రియ అంతయు ప్రభువు చెప్పిన విధముగా, మరియు (అ.కా 2:42) వాక్య ప్రకారము దేవుని దాసుడైన సహో. భక్త్ సింగ్ గారు ఆనాటి సంఘ వ్యవస్థలో లోటు పాట్లన్నియు సరిచేసి, పూర్తి స్వదేశీ సంఘమును (అనగా విదేశాల నుండి ధన సహాయము ఆశించకుండా) మద్రాసులో స్థాపించిరి. ప్రారంభ సంఘ స్థాపన బాప్తిస్మములు తదుపరి హస్తనిక్షేపణతో మొదలైనదని గమనించగలరు! కావున ఈయనను సంఘ సంస్కర్తగా చెప్పవచ్చును. ఎందుకనగా! ప్రపంచ క్రైస్తవ సంఘ వ్యవస్థలో వివాదాస్పదంగా ఉన్నట్టి బాప్తిస్మము తరువాత ఇచ్చే హస్తనిక్షేపణనూ, ఇంకనూ వ్యవస్థలో లోటులన్నియు సంపూర్ణ క్రమములో క్రమబద్దీకరించి ప్రభువు ఈయనను నడిపించిన విధముగా, ప్రారంభ సంఘములో మొదటి దినమందే సంస్కరించిరి. కొంతకాలమైన తర్వాత, ప్రభువు సహూ. భక్త్ సింగ్ గారు చేపట్టిన సిద్ధాంతపరమైన సంఘ ప్రక్షాళనను లేక సంస్కరణలను ప్రశ్నించటానికి మద్రాసు నగర క్రైస్తవ సమాజ బిషప్పులు, నాయకులు వచ్చిరి. వారిని సాదరంగా ఆహ్వానించి, వారితో మాట్లాడే ముందు దైవదాసుడు మోకరిల్లి, ప్రభువు సహాయముతో వివరణాత్మకంగా ప్రార్ధించెను. వారు ఆ ప్రార్ధన విని తిరిగి ఏమి మాట్లాడకుండానే వెనక్కి వెళ్లిపోయి, తిరిగి ఎప్పుడూ ఈయనను దర్శించ లేదు. ఈ విధముగా దైవదాసుడు సహూ. భక్త్ సింగ్ గారు ఆనాటి క్రైస్తవ వ్యవస్థలో ఉన్న లోపాలన్నియు సరిచేసి స్థాపించిన నాటి సహవాస క్రమమును, నేటి (సంఘ దుస్థితిని) సహవాస క్రమమును విజ్ఞత కలవారు సరిపోల్చవచ్చును!

సిద్ధాంతపరంగా మొదటి ప్రాధాన్యతలో ఉన్నట్టి రక్షణ తదుపరి బాప్తిస్మము విషయములో నేటి సంఘములు తప్పిపోవుచున్నవి. నామకార్థ క్రైస్తవులకు బాప్తిస్మము ఒక ఆచారము గాని, విశ్వాసులకు ఒక సాక్ష్యము. ముఖ్యముగా ఈ విషయములో క్రొత్తగా వచ్చే వారికి అవగాహన కల్పించుట, కొన్ని సంఘాలలో ఎక్కడో తీసుకొన్న అవగాహన లేని బాప్తిస్మమునకు హస్తనిక్షేపణ ఇస్తున్నారు. అవగాహన లేని (నీటిలో ముంచినా సరే) బాప్తిస్మము తీసుకొన్నవారికి తిరిగి బాప్తిష్మము ఇప్పించవలెను,(అ.కా 19:3-5). (మంచి ఉదాహరణ : మద్రాసులో వివిధ డినామినేషన్లకు చెందిన వారు, తరువాత హైద్రాబాదులో చేర్చబడిన బాప్టిస్టు సంఘములవారు, బాప్టిస్టు పాస్టరు కుమారుడైన సహూ. GT బెంజమిన్ గారు, ఇంకా అనేకమంది, వీరందరూ అవగాహన లేని బాప్తిస్మము పొందిన వారే, విశ్వాసములోకి ఒప్పించబడి తిరిగి బాప్తిస్మము తీసికొనిరి.) మొదలగు ప్రాధమిక సిద్ధాంతాలను నెరవేర్చుటలో సంఘ నాయకులు తప్పిపోవుచున్నారు. అతి ప్రాముఖ్యమైన ఇటువంటి విషయాలను గాలికి వదిలేస్తున్నారు. కొంతమందైతే అసలు సంఘముకు అవసరము లేని విషయాల కొరకు సమస్తమును వృధా చేస్తున్నారు. ఎంతోమంది క్రొత్తగా చేర్చబడుచు వస్తుంటారు. వారి ఆత్మీయ ప్రధాన అక్కరలను తెలిసికొని తీర్చడం ప్రాధమిక బాధ్యత. అసలు సంఘ నాయకులకే సిద్ధాంతపరమైన అనుభవం లేనప్పుడు తప్పిపోయిన సంఘ పరిస్థితులను ఎలా సరిచేయగలరు? తమకు అప్పగించిన బాధ్యత ఈలోకంలో ఎవ్వరికి లేదన్న గ్రహింపుతో, ప్రభువు మీద భారము వేసి, ముందు వారు సరిచేసికొని, ఆయన చిత్తములో నడచుకొన్నచో, సహూ. భక్త్ సింగ్ గారిని నడిపించిన దేవుడు, సంఘ బాధ్యతలు వహించే వారికి కూడా (ఆయన జీవముగల సంఘ అభివృద్ధికి, సంఘము పైకెత్తబడటానికి సిద్ధపరచుటలో) నడిపించగలడు.

Leave a comment