సహూదరుడు అబ్రహాం జోసెఫ్ (1914-1995) మంచి పేరున్న పాత కాలపు దేవుని సేవకునిగా సహవాసములో తెలియనివారులేరు. సువార్త యోధుడు, ప్రార్ధనా యోధుడు, ఆత్మల విజేత. సంఘముల స్థాపకుడు, ధైర్యశాలి, సహూ. భక్త్ సింగ్ గారి జత పనివాడు.

నేటి విశ్వాస నాయకుడు
సహూ. అబ్రహాం జోసెఫ్
పరలోక పిలుపు : 28 మార్చి, 1995.
సువార్త యోధుడు, ప్రార్ధనా యోధుడు, ఆత్మల విజేత. సంఘముల స్థాపకుడు, ధైర్యశాలి, సహూ. భక్త్ సింగ్ గారి జత పనివాడు.

సహూదరుడు అబ్రహాం జోసెఫ్ (1914-1995) మంచి పేరున్న పాత కాలపు దేవుని సేవకునిగా సహవాసములో తెలియనివారులేరు. ఈయన బర్మా (ప్రస్తుత మయన్మార్) నుండి వచ్చిన కారణాన బర్మా జోసెఫ్ గా సుపరిచితులు. ఈయన సేవా పిలుపు పొందినప్పటినుండి మండుతున్న హృదయముతో ఆత్మల బారము కలిగి యుండుట వలన, అదే భారంతో బహిరంగ సువార్త పరిచర్యలు చేస్తుండేవారు. కావున, ఈ పరిచర్యలో నైపుణ్యము, అనుభవము చాలా ఎక్కువ. సైన్యములో సైనికుడు ఎలా కష్టపడతాడో, అదేవిధమైన అనుభవము గలవాడై, ఈయన ప్రభువు పరిచర్యలో కూడా క్రీస్తు యేసుని మంచి సైనికునిగా, ప్రాముఖ్యముగా, ఓపెనైర్ స్పెసలిస్ట్ గా గుర్తింపు పొందారు. సహోదరుడు భక్త్ సింగ్ గారు ఈయన శ్రమజీవితాన్ని, క్రమశిక్షణను, ప్రతిభను ముందే గ్రహించి, దైవదాసుని ఆధ్వర్యములో జరిగే సువార్త దండయాత్రలకు, పరిశుద్ధ సమాజ కూడికల చివరి రోజు జరిగే ఉరేగింపులలోను సక్రమముగా నిర్వహించగలడని, ఈయన నాయకత్వం వహించేలా ప్రోత్సహించేవారు. క్రమమైన లైను తప్పితే, స్త్రీలైనా సరే జడ పట్టుకొని లాగి లైనులో పెట్టేవారు. ఈయనకు మొహమాటం లేదు, రాజీపడడు. తేడా వస్తే కఠినముగా గద్దించేవాడు. ఈయన మిలిటరీ నుండి సేవకు రావటాన్ని బట్టి పరిచర్యలోను, ప్రతి విషయములోను, మిలిటరీ క్రమశిక్షణయే. ముఖ్యముగా! బహిరంగ సువార్త దండయాత్రలలో, ఈయన గంభీరమైన, గర్జించే గళంతో ఆదేశించడం, ప్రజలను ఆకట్టుకునే ఉజ్జివమైన పాటలు పాడటం, వివిధ నినాదాలు ఉల్లాసంగా చెప్పటం, సువార్త వాక్యము వినూత్నంగా చెప్పటం ప్రజలను బాగా ఆకర్షిస్తూ, ప్రభావితం చేసేవారు. ఈయన వాగ్దాటికి అసలు మైక్ అవసరము లేదు. ఈయన, “జై బోలో ఖుదావంద్ ఈశు మసీకి జై”, ఇంకా మార్చి మార్చి నినాదాలు అన్నీ బిగ్గరగా అరచి చెప్పుచుంటే, అందరూ ఉజ్జీవముతో సువార్త ప్రకటించెడివారు. ఈలాగు అన్ని పరిచర్యలలో ఎప్పటికప్పుడు అందరిని ఉత్సాహపరుస్తూ దేవునికి మహిమ కలిగిస్తూ కొనసాగేవారు. ఈయన సేవ చేసిన ప్రతి చోట సంఘములతో పాటు, నిర్మాణాలు కూడా చేపట్టి సమాజములను అభివృద్ధి చేశారు. ఈయన వర్తమానములు కూడా ఎక్కువుగా “నా సంఘమును కట్టుదును” అనే వాక్య బారముతో ఉండేవి. ఈయన చివరగా కడపలో చేసిన పరిచర్య విశిష్టమైనది. 1945 జూన్ లో కడప నివాసి ఐన RR శామ్యూల్ గారి ద్వారా, సహూ. భక్త్ సింగ్ గారు, సువార్త దండయాత్ర జరిగించి ప్రారంభించిన సంఘము కడప. తెలుగు ప్రాంతాలన్నింటికీ సహవాసములో మొదటి సంఘమైన ఈ కడపలో, కేంద్రీకృతముగా 1971 నుండి 24 సంవత్సరములు అనేక సంఘములు కట్టబడుట ద్వారా పరిచర్య విస్తృతంగా విస్తరించటానికి ప్రభువు సహూదరుడు అబ్రహాం జోసెఫ్ ను బలమైన పాత్రగా వాడుకొనెను. ఈయన ఎన్నో సంఘములకు మార్గ దర్శకుడు. దీని వెనుకనున్న ఆయుధము, ప్రభువు ఈయనకు అప్పగించిన ప్రత్యేక భారమైన బాధ్యత, ఈయన బహిరంగ సువార్త దండయాత్రలే. ప్రభువు ఈయనకు ఇచ్చిన ఈ తలాంతుల ద్వారా, ప్రభువు కొరకు ఈయన సంపాదించిన ఆత్మలు అనేకం. ఈయన కట్టిన సంఘములు అనేకం. ఈయన పరిచర్య ఫలాలు అనుభవించినవారు అనేకం. పరిచర్యలో అలుపెరగకుండా కష్టపడటం తప్ప ఈయనకు ఏమి తెలియదు. ఈయనకంటూ ఏమి ఏర్పాటు చేసుకోలేదు, ఉదాహరణకు, ఎంతో కాలముగా కటిక నేల మీద పడుకొనియుండుట, గమనించిన సహూ. భక్త్ సింగ్ గారు, గద్దించి 12 అణాలు లేక 72 పైసలు ఇచ్చి బెడ్, దిండి కొనుక్కోమని చెపితే, అవి కొని తెచ్చుకొని వాటిమీద నిద్రపోయెను. ఈయన చిన్నతనము నుండి కష్టపడి పని చేసే మనస్తత్వము, అలాగే, తన జీవితములో ఎదుర్కొన్న పరిస్థితులు, అన్యాయాన్ని అసలు సహించేవాడు కాదు. దీనిని బట్టి కొంచెము కోపము కూడా ఎక్కువే, ఈ అనుభవాలన్నియు ఈయన విశ్వాస ఆధారిత సేవా పరిచర్యలో దృఢముగా ఉండుటకు, సహించుకొని సంతోషముగా ఉండుటకు ప్రభువు సహాయపడెను. ప్రభువు సేవా కాలములో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చివరిలో అనారోగ్య పరిస్థితులు చోటు చేసుకున్నా విశ్వాసము ద్వారానే పోషించబడితిరి.

బ్రిటిష్ ఇండియా కాలములో బర్మా కూడా ఉమ్మడిగా ఒకే దేశముగా ఉన్నప్పుడు, ఉపాధి అవకాశాలు బర్మాలో మంచిగా యుండుట వలన, ఈయన తండ్రి గారు, మద్రాసు నుండి అక్కడ కెళ్ళి, బర్మా పౌరురాలిని పెళ్లి చేసికొని అక్కడే స్థిరపడిరి. వీరికి జోసెఫ్ గారు 1921 డిసెంబర్ 7న జన్మించిరి. ఈయన బాల్యము నుండి అతి హుషారుగా ఉండేవాడు. ఇలాగే, విద్యభ్యాసమంతయూ ముగించుకొని స్థిరపడటానికి చూచుచుండగా, ఇండియా మరియు బర్మా స్వతంత్ర దేశాలుగా విడిపోక ముందే, జరిగిన జాతీయీకరణ విధానాలు, భారత వ్యతిరేక భావాల కారణంగా, గుర్తింపు లేని వలసదారులపై వ్యతిరేకత పెరిగి, చాలామంది భారతదేశానికి బలవంతంగా తిరిగి రావాల్సి వచ్చింది. వీరిలో సహూ. అబ్రహాం జోసెఫ్ గారు కూడా ఒకరు. వీరి కొరకు ప్రభుత్వము సిద్ధపరచిన ప్రయాణ సౌకర్యమును చివరలో అందుకోలేని కారణాన, భయంకరమైన అరణ్యము గుండా నెలల తరబడి నడచుకొంటూ కలకత్తా చేరి, అక్కడ నుండి రైలు మార్గములో మద్రాసుకు చేరితిరి. మద్రాసులో ఈయన రక్త సంబంధీకుల ఇంటిలో ఉంటూ, వారి కుమార్తెను వివాహము చేసుకోవలెనని ఆకాంక్ష కలిగి, పట్టుదలతో జీవితములో స్థిరపడుటకు ఆర్మిలో మంచి ఉద్యోగము సంపాదించుకొనెను. ఈయన మొదటి నుండి రక్షణ లేనప్పటికీ, క్రైస్తవ భక్తుడుగా ఉండేవాడు. అలాగే, ఆర్మీలో ఉన్నప్పుడు కూడా, క్రైస్తవ్యము మీద ఇష్టుడుగా, ఎవరైనా పాస్టర్లు కలసినప్పుడు, వారిని ఆర్మీ క్యాంప్స్ కు తీసుకెళ్లి వాక్యము చెప్పిస్తూ ఉండేవారు. ఇలాగే 1946 జూలై, ఢిల్లీలో యాదృచ్చికంగా సహూ. BJ పాల్ గారిని కలసినప్పుడు ఆర్మీ క్యాంపుకు తీసుకెళ్లి, రెండు వారములు వాక్యము చెప్పించుకొనిరి. చివరి రాత్రి వర్తమానమైన లాజరు లేపబడటం, అనే అంశము, జోసెఫ్ గారి హృదయమును తాకి రక్షణ నిశ్చయత లోకి నడిపించ బడితిరి. అయినప్పటికీ, ఈయనకు తీరని అనేకమైన సందేహాలు అలాగే మిగిలి యున్నవి. కొంతకాలమైన పిమ్మట, సెలవులో తిరిగి మద్రాసుకు చేరి, పురుషవాక్కం రోడ్డులో వెళ్లుచు, జెహోవా-షమ్మాలో పరిశుద్ధ సమాజ కూడికలు అనే బ్యానర్ ను చూచి, అక్కడకు నడిపించబడితిరి. ఇదే ఈయన జీవితానికి సరికొత్త మలుపు. అది 1948 డిసెంబర్, పరిశుద్ధ సమాజ కూడికల సమయం, ఈయన జెహోవా-షమ్మాలో కూడికలకు హాజరై, సహవాసములో 3 రోజులు గడిపిన తర్వాత, నేరుగా స్టేజి దగ్గరకు వెళ్లి పెద్ద అయిన సహూ. రాజమణి గారితో, నేను మీతో మాట్లాడవలెనని ఎంతో ఎదురు చూస్తున్నాను, నన్ను ఎవరూ సంప్రదించటం లేదని కోపంగా నిలదీయగా, ఆ సమయములో బోధించే సహూ. ఫిలిప్ గారు ఈయన సందేహాలన్నియు తీర్చి, ప్రార్థించారు. ఈయన కూడిక లన్నింటికీ హాజరై, దేవుని సందేశమును మరింతగా తెలిసికొని, ఈయనకు కలిగిన రక్షణానందమును వాక్యపు వెలుగులో, ఇంకా దేవుని సేవకుల ద్వారా మరింతగా బలపడి, తర్వాత సేవకు కూడా తీర్మానించుకొనిరి. ఈయన మారిన జీవితాన్ని, ఈయన చెప్పే సువార్తను, గమనించిన ఆ పెళ్లి చేసుకోవాలనుకున్న బంధువుల అమ్మాయి వ్యసనపడి, కోపంతో తిరస్కరించి వేరొకరిని వివాహం చేసుకొనెను. ఈ సంఘటన తర్వాత, సహూ. జోసెఫ్ ఒంటరిగా మద్రాసులో ఉంటూ, భవిష్యత్తులో దేవుని ఏర్పాటు కొరకు ప్రార్థిస్తూ, వాక్యము ద్వారా ధైర్యపరచబడి, ఈయనకున్న పిలుపును బట్టి సహూ. ఆర్.పీ. దొరైరాజ్ గారిని కలిసి ప్రభువుకు సేవ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే, ఆయన ఆర్మీలోనే కొనసాగుచూ, దేశానికి సేవ చేయండి, తరువాత చూడొచ్చని సూచించారు. కానీ సహూ. జోసెఫ్ గారు దేశమునకు సేవ చేయుటకంటె, దేవునికి సేవ చేయుటే మేలని గుర్తించి, ఆర్మీ ఉద్యోగమును త్యజించి, పూర్తిగా దేవుని సేవకు సమర్పించుకొనిరి.

సహూ. జోసెఫ్ గారు, జెహోవా-షమ్మాలో ఎంతో శక్తిమంతుడుగా, మిలిటరీ క్రమశిక్షణతో, మొత్తము పనులన్నియు చక్కపెట్టేవారు. మొత్తం ప్రాంగణం, మరుగుదొడ్లు శుభ్రం చేయడం, వీధులలో సువార్త చెప్పటం, పరిశుద్ధ సమాజకూడికలకు వచ్చే విశ్వాసులందరూ దేవుని వాక్యమును గుర్తించే లాగున, రైల్వే స్టేషన్లలో “యోహాను 3:16” వాక్యమును ఇండియా భాషలన్నింటితో బిగ్గరగా పలుకుచూ, సిపాయి మాదిరి డ్రెస్ వేసుకొని, “క్రైస్ట్ వారియర్” క్రాస్ బ్యాడ్జితో, ప్రత్యేక ఆకర్షణతో సాదరంగా అందరిని తోడుకొని జెహోవా-షమ్మాకు తీసుకెళ్ళుచుండేవారు. ఇంకా చెప్పాలంటే ఈయన చేయలేని పని, చేయని పని, చేతకాని పని అంటూ ఏమీలేదు. మిలిటరీ మాన్ గా, “అల్ రౌండర్ ఛాంపియన్” అని చెప్పవచ్చును. తరువాత, హైదరాబాద్ ఏలీముకు నడిపించబడి, ఇంకా అనుభవము సంపాదించిన తర్వాత సేవకు పంపించ బడితిరి. మొదటిగా, ఈయనను 1955 లో సహూ. ఫిలిప్పు గారికి సహాయకులుగా కర్నూలుకు పంపించిరి.

1957 జూన్ 17 న సహూ. జోసెఫ్ గారి వివాహము సహోదరి బియాట్రిస్ తో సహో. భక్త్ సింగ్ గారు జరిపించి యున్నారు. ఈమె జెహోవా-షమ్మా పెద్దలైన సహూ. దొరైరాజ్, రాజమణిలకు మేనకోడలు. వివాహము జరగటానికి రెండు రోజుల ముందు ఆమె తమ్ముడు టి.బి వ్యాధితో మరణించగా, ఆమె కుటుంబ సభ్యుల విశ్వాసం వలన, అనుకున్న ప్రకారమే వివాహం జరిగించిరి. వీరు ఇద్దరూ కుటుంబముగా 1.వెల్లూరు, 2.బెంగుళూరు, 3. వెల్లూరు 4.కర్నూల్, 5.బెంగుళూరు, 6.నంద్యాల, 7.అనంతపురం, 8.కడప ఇంకా దేశములో అనేక ప్రాంతాలలో దేవుని సేవను ఆయన మహిమార్థమై చేసియున్నారు. చివరగా 1971లో కడపకు పంపబడి, అనేక విశ్వాసులకు శిక్షణ ఇచ్చి, దేవుని సేవలోకి సిద్ధం చేసారు. VBS , ఆదివారం బైబిల్ పాఠశాలలను ప్రారంభించి, అనేక పిల్లలను ప్రభువు వద్దకు నడిపించారు. లెక్క లేనన్ని సంఘములను రాయలసీమలో కట్టియుండిరి. ఈయన జీవితమంతా సేవకు ముందు, సేవలోను అలుపెరగకుండా నిరంతరమూ శ్రమించెను. ఈయన రోగాలతో బాధపడినా, అసలు చింత లేకుండా, ఎప్పుడు, ఏమి పట్టించుకోకుండా నిరీక్షణతో నిలబడ్డారు. ఈయనకు తీవ్రమైన అనారోగ్యం ఏర్పడి, చనిపోయే ముందు, నిరీక్షణ గీతమైన, “God is still on the throne and he will remember his own……………. He will not forget you . God is still on the throne.” ఈ పాటను సంతోషంగా పాడి, తన భార్యను ఎంతో ధైర్యపరిచి, తన 74వ ఏట, విశ్వాసమును కాపాడుకొని, సంతోషముగా ప్రభు వద్దకు పయనమైరి. నేటికి, బ్రదర్ అబ్రహాం జోసెఫ్ గారు ప్రభువు వద్దకు వెళ్లి 30 సంవత్సరాలు అయినా, సహుదరుడు వారసత్వముగా వదలి వెళ్లిన పరిచర్య ఫలాలు, జీవిత ఔన్నత్యం, నడిచిన మార్గం అనేకమందికి ఆదర్శంగా, మాదిరిగా కనిపిస్తూనే ఉన్నది.

Leave a comment