
నేటి విశ్వాస నాయకురాలు
మేరిలౌ హోబోల్త్ మెకల్లీ
పరలోక పిలుపు : 24 ఏప్రిల్ 2004
ధైర్యమైన మిషనరీ, సువార్తికురాలు, పియానిస్ట్, చర్చి సంగీత దర్శకురాలు, కమ్యూనిటీ నాయకురాలు.
మేరిలౌ హోబోల్త్ మెకల్లీ (1928-2004) అమెరికన్ మిషనరీ, ప్రభువైన క్రీస్తులో అంకితభావంతో జీవించిన శ్రద్ధావంతురాలు. ఈమె ఈక్వడార్ లో క్రూరంగా చంపబడిన ఐదుగురు మిషనరీలలో ఒకరైన ఎడ్ మెకల్లీ సతీమణిగా, 1950లలో ఈక్వడార్ లో సేవ చేసిన మిషనరీగా ఈమె విశేషంగా ప్రసిద్ధి చెందారు. ఈమెకు చిన్నప్పటినుంచి విశ్వాసం పట్ల గాఢమైన నిబద్ధత, సంగీతం పట్ల మిక్కిలి ఆసక్తి కలిగి ఉండేవారు. మేరిలౌ జీవితం ప్రేమ, సేవ, దేవుని పట్ల విడవని విశ్వాసానికి ఒక అందమైన సాక్ష్యంగా నిలిచింది. ఈమె తన భర్త ఎడ్ తో 1952లో ఈక్వడార్కు వెళ్లి, అక్కడ అరాజునో మిషన్ కేంద్రంలో క్వెచువా ప్రజలతో కలిసి సేవ చేశారు. 1956లో, హువారోని ప్రజల మధ్య జరిగిన “ఆపరేషన్ ఔకా” సందర్భంగా ఈమె యవ్వన కాలములో తన భర్త దారుణంగా హత్య గావించబడినా, ఈమె మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోకుండా, ఆ తీవ్రమైన దుఖంలోనూ తన విశ్వాసాన్ని నిలుపుకుంటూ, తన ముగ్గురు కుమారులను ఒంటరిగా పెంచుకుంటూ సేవను కొనసాగించింది. ఈమె 1963లో ఫెడరల్ వే అనే ప్రాంతానికి వెళ్లి, ఆబర్న్ జనరల్ హాస్పిటల్ లో పనిచేశారు. ఈమె పాటలు, సంగీత సేవ, మిషనరీ కార్యక్రమములలో చురుకుగా పాల్గొంటూ, స్థానిక సంఘంలో విశేషంగా సేవ చేశారు. ఈమె ప్రేమ, ఆనందం, సేవాపరమైన జీవనశైలితో అనేకమందిని ప్రభావితం చేశారు. ఈమె విశ్వాసం, సేవ, దేవుని పిలుపును గౌరవిస్తూ, చివరి వరకూ క్రీస్తులో నిబద్ధతతో, విశ్వాసపూరిత జీవితం గడిపారు. ఈమె జీవిత చరిత్ర మొత్తం ఇంకా ఎడ్ మెకల్లీ చేసిన మిషనరీ ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేస్తూ, వీటిని వీటన్ కాలేజ్ లో “ఎడ్ అండ్ మేరిలౌ మెకల్లీ పేపర్స్” అనే పేరుతో భద్రపరచడం జరిగింది. ఇవి క్రైస్తవ విశ్వాసానికి చేసిన వారి సేవకు నిలిచిన స్మృతిసౌధంగా నిలుస్తున్నాయి.
మేరిలౌ 1928 ఏప్రిల్ 18న మిచిగన్ రాష్ట్రంలో జన్మించారు. ఈమె శిక్షణను చికాగోలోని మూడి బైబిల్ ఇన్స్టిట్యూట్లో పొంది, అక్కడే పియానోలో సంగీత ప్రతిభను అభివృద్ధిచేసుకొని క్రైస్తవ సేవ పట్ల లోతైన నిబద్ధతను ఏర్పరచుకొని, అనేక క్రైస్తవ మినిస్ట్రీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1951లో జరిగిన ఒక క్రైస్తవ యువకుల సమావేశంలోనే మేరిలౌ, ఎడ్ మెకల్లీను కలుసుకున్నారు, ఆ పరిచయమే వారి వివాహానికి దారి తీసింది.
1952లో క్రిస్టియన్ మిషన్స్ ఇన్ మెనీ ల్యాండ్స్ మిషనరీ సంస్థ ద్వారా ఈక్వడార్ లో అరజునో మిషన్ స్టేషన్ లో సేవను ప్రారంభించారు. అక్కడ క్వెచువా ప్రజల మధ్య సువార్త ప్రచారం, సంఘ సేవ కార్యక్రమాల్లో ఈమె చురుకుగా పాల్గొనేవారు. సంగీతం ద్వారా సేవ చేయడం ఈమె మినిస్ట్రీలో కీలక భాగంగా ఉండేది. ఈమె స్థానిక క్రైస్తవ సంఘ అభివృద్ధికి గణనీయమైన కృషి చేశారు. మేరిలౌ, తన భర్త ఎడ్ మెకల్లీతో కలిసి, క్వెచువా భాషలో సరళమైన చిన్న పల్లవులు స్వరపరిచి, స్థానిక పిల్లలకు వాటిని నేర్పుతూ సువార్తను పంచేవారు. తన పరిచర్య ద్వారా అనేకమందికి ఆత్మీయ స్పర్శ అందించారు. మేరిలౌ కథ ప్రముఖ క్రైస్తవ రచయిత ఎలిసబెత్ ఎలియట్ రూపొందించిన “ఆనంద ద్వారం” అనే రేడియో కార్యక్రమంలో “విపత్తులో నుంచే విజయం : మేరిలౌ మెకల్లీ” అనే ఎపిసోడ్లో ప్రత్యేకంగా ప్రస్తావించబడింది.
మేరిలౌ హోబోల్త్ మెకల్లీ, 2004, ఏప్రిల్ 24న, 76 ఏళ్ల వయస్సులో, వాషింగ్టన్ రాష్ట్రంలోని సమ్ నర్ పట్టణంలో క్యాన్సర్ తో జరిగిన దీర్ఘకాల పోరాటానంతరం ప్రభువు పిలుపును అందుకొనిరి.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.