
నేటి విశ్వాస నాయకుడు
సహూ. లాజర్ సేన్
పరలోక పిలుపు : 06 మార్చి 2013
స్వర మాధుర్య గాయకుడు, గీత రచయిత, పాటల స్వరకర్త, సువార్తికుడు, సహూ. భక్త్ సింగ్ గారి జతపనివాడు, ఏర్పరచబడిన సహోదరుడు.
సహుదరుడు లాజర్ సేన్ (1927-2013) సహో. భక్త్ సింగ్ గారితో కలసి పని చేసిన దేవుని సేవకునిగా అందరికి బాగా తెలుసు. ఈయన రక్షించబడిన దినము నుండి ఆత్మయందు తీవ్రత, సువార్త భారము కలిగి యున్నారు. ముఖ్యముగా! ఈయన పరిచర్యలో ప్రధాన భాగము పాటల సంగీతము. బైబిలులో దావీదు రాజువలె చిన్న తనము నుండి, పాటలు రాయటం, సంగీతం కూర్చటం, వాయిద్యాలన్నియు వాయించటం, పాడటం, వెన్నతో పెట్టిన విద్యగా అలవరచుకొనిరి. దేవుడు ఈయనకు మంచి గాత్రమును అనుగ్రహించెను. దేవుడు ఈయనకు అనుగ్రహించిన తలాంతులన్నియు ఆయనను సేవించటానికే, మహిమపర్చటానికే ఉపయోగించిరి. ఈయన ప్రతిభను తన పాఠశాల ఉపాధ్యాయులు చాలా చిన్న వయస్సు నుండి గుర్తించారు. ఈయన 7 సంవత్సరాల వయస్సునుండి పాడటం, హార్మోనియం వాయిస్తూ కచేరీలు ఇచ్చేవారు. ఈయన పెరిగేకొద్దీ, చాలా మంది సంగీత దర్శకులు ఈయన ప్రతిభను గమనించారు, ఉపాధ్యాయుల్లో ఒకరు కలకత్తాలో బెంగాలీ సినీ పరిశ్రమలో ప్లేబ్యాక్ సింగర్‌గా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసారు, కానీ 1947లో ఈయన అప్పటికే ప్రభువుకు తన జీవితాన్ని అంకితం చేశారు కాబట్టి, ఆఫర్‌ను తిరస్కరించితిరి. అలాగే ఈయన గాన ప్రతిభను గుర్తించిన సహూ. భక్త్ సింగ్ గారు, హిందీ పాటల బాధ్యతలన్నియు, ఈయనకే అప్పగించిరి. సీయోను పాటల పుస్తకములో అనేకమైన పాటలు ఈయన స్వరపరచినవే. బెంగాలీ, ఇతర భాషలు అన్ని కలిపి దాదాపు 800 వరకు పాటలు కూర్చిరి. అన్ని పరిశుద్ధ సమాజ కూడికలలో, ఈయనే హిందీ పాటల ప్రధాన గాయకుడు. ఇంకా ఈయన విశ్వాస ఆధారిత పరిచర్యలో భాగంగా సువార్త ప్రకటించటానికి, బయట పరిచర్యలకు వెళ్ళినప్పుడు చాలా కాలము కుటుంబమును విడచి ఉండేవారు. సమాచార వ్యవస్థకూడా లేని ఆ కాలములో, తన కుటుంబ భారమంతా, ప్రభువుకే అప్పచెప్పి సేవలో కొనసాగేవారు. ఈయన ప్రారంభ దినమునుండి ప్రభువుకు నమ్మకత్వమును బట్టి, ఏర్పరచబడిన సహుదరులలో, ఒకరిగా నియమించ బడితిరి. పూర్తికాల సేవకులందరూ మాదిరికరంగా విశ్వాసంతో మాత్రమే జీవించాలనే నేర్చుకున్న నిబంధనకు, నిబద్ధతగా నిలబడి చివరి వరకు జీవించితిరి.
సహూ. లాజర్ సేన్ బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగమైన ప్రస్తుత వెస్ట్ బెంగాల్, ఖరగ్ పూరులో 16 అక్టోబర్ 1927న రెండవ సంతానంగా జన్మించెను. ఈయన మాతృ బాష బెంగాలీ. ఈయన తండ్రిగారు తాను యవ్వన దశలో ఉండగానే చనిపోయిరి. కాగా పెద్ద కుమారుడిగా తన తల్లి, అక్క, తమ్ముడు మొత్తం కుటుంబ బాధ్యతలన్ని తానే చూసుకోవలసిన పరిస్థితి ఏర్పడిన కారణాన యవ్వనప్రాయమునుండే కస్టపడి పనిచేస్తుండేవారు. వీరి కుటుంబము మొదటినుండి బాప్టిస్టు సంఘముతో అనుబంధము కలిగియుండిరి. ముఖ్యముగా, ఈయనకు చిన్నప్పటినుండి సంగీతమంటే మక్కువ, ఈ కారణాన ఒక మ్యూజిక్ టీమును ఏర్పాటుచేసుకొనిరి. (1947) ఇండియా, పాకిస్తాన్ విభజించే కాలములో, ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల కారణాన ఈయన మ్యూజిక్ టీం స్నేహితులందరూ మహమ్మదీయులే, కాబట్టి వారందరూ పారిపోవలసివచ్చినది. కావున ఈయన పరిస్థితి మరీ దుర్భరంగా మారెను. ప్రజలు సహూ. లాజర్ సేన్ ను కూడా ముస్లిం అని తీసుకెళ్లబోతుండగా, ఈయన తల్లి తన ప్రాణాలను కాపాడుకోవటానికి, నర్సుగా పనిచేస్తున్న ఆంటీ దగ్గర, జలగ్రామ్ అనే గ్రామములో దాక్కోమని చెప్పిరి. అదే రాత్రి ప్రభువును ఎదుర్కోవటం, సందింపు జరిగినది. ఈయనకు ప్రభువు వేసిన ఒకే ప్రశ్న! ఈ రోజు నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఈయనకు సమాధానం లేదు, కానీ ఈయన చిన్నతనం నుండి లేఖనాలు తెలిసినందున, తన పాపములన్నియు ప్రభువు దగ్గర ఒప్పుకొని, విరిగి నలిగిన హృదయముతో అదే రాత్రి 1947, మార్చి 12న ప్రభువైన యేసు క్రీస్తును, తన స్వంత రక్షకునిగా అంగీకరించెను, రక్షణ తర్వాత కూడా యదావిధిగా బాప్టిస్టు సంఘమునకు వెళ్ళుచుండెడి వారు. ఈ కాలములో, ఈయన డాక్టర్ సైమన్ ద్వారా, సహూ. జోర్డాన్ ఖాన్ గారితో సన్నిహితంగా ఉన్నకారణాన, ఆయన పరిచర్యలో నిజమైన క్రొత్త నిబంధన సంఘ దర్శనమును అనుభవించి, వారందరితో సహవాసములో క్రమం తప్పకుండా అలవాటు పడి, ఈయన ప్రభువు సన్నిధిని అనుభవిస్తూ ఉండేవారు. ఇదే కాలములో, రైల్వేలో పనిచేసేటప్పుడు ప్రభువునుండి సేవా పిలుపును అందుకొనిరి. సహుదరుడు భక్త్ సింగ్ గారు తరచుగా అక్కడికి వస్తూ, లాజర్ సేన్ గారి ప్రతిభను చూచి 1948-49లో మద్రాసుకు ఆహ్వానించిరి. అంతేకాకుండా ఆయన పరిచర్యలో సహూ. లాజర్ సేన్ గారు, పూర్తి కాల సేవకు సమ్మతించి, సమర్పించుకొనిరి. ఈయన తల్లి గారు కూడా, ఈయన దేవుని సేవా పిలుపును ప్రోత్సహించిరి. ఖరగ్ పూరు, నింపురాలో సహో. జోర్డాన్ ఖాన్ గారి దగ్గరే సేవా తర్ఫీదు పొందుచు, అనేక పాటలు స్వరపరిచేవారు. ఆయనను పెద్దన్న మాదిరిగా గౌరవిస్తూ, ప్రభువు సన్నిధిని ఎంతో ఆనందించేవారు.
సహవాసములో ప్రతి విషయము విశ్వాసము మీదే ఆధారపడటం, అలాగే ఈయన వివాహము కూడా జరిగినది, ఎవరు, ఎవరిని పెళ్లి చేసుకుంటారో ఎవరికీ తెలియదు. దైవ దాసులు కనుగొనిన దేవుని చిత్తమునకు విధేయత చూపాలి. 1958 జూన్ 26న సహుదరుడు లాజర్ సేన్ గారి వివాహము సేవకురాలైన సహోదరి అమృతతో కాలింపాంగ్ లో సహో. భక్త్ సింగ్ గారు జరిపించి యున్నారు. వీరి అవసరములన్నియు ప్రభువే సమకూర్చెను. ఈమె కాలింపాంగ్ వాస్తవ్యురాలిగా, క్రైస్తవేతర కుటుంబమునకు చెందిన ఈమె, ఈమె సహుదరి చిన్నతనంలోనే సహూ. జోర్డాన్ ఖాన్ గారి పరిచర్యలో రక్షించబడిరి. ఈ కారణాన వీరిని కుటుంబమునుండి వెలివేయగా, ప్రారంభ విశ్వాసులు వారిని చేరతీసి, శ్రద్ధ వహించి, ప్రభువు సేవకు తమను తాము సమర్పించుకొనేలా నడిపించారు. వివాహం తరువాత, సహూ. లాజర్ సేన్ గారు తన భార్యతో ప్రభువును సేవించడానికి ఖరగ్‌పూర్‌కు పంపబడ్డారు. వారు సహూ. జోర్డాన్ ఖాన్ కుటుంబంతో 3 సంవత్సరాలు కలిసి పనిచేశారు. వీరికి పుట్టిన పిల్లలు చనిపోగా, తరువాత కుమార్తె జెరూషా (సేన్) లూకోస్‌తో ఆశీర్వదించబడ్డారు. చాలా ప్రార్థన తర్వాత సహూ. భక్త్ సింగ్ గారు, ఈయనను కుటుంబముగా అహ్మదాబాదు పరిచర్యకు పంపించిరి. వీరు అక్కడ నుండి మొత్తం గుజరాత్ రాష్ట్రానికి సేవలు అందించారు. నీవు మాకు కుమారుని ఇస్తే మేము వానిని నీకు తిరిగి ఇస్తామని వారు హన్నాలా ప్రార్దించేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభువు వీరికి హనోక్ సేన్ అనే కుమారుని అనుగ్రహించెను. లాజర్ సేన్ గారు అహ్మదాబాద్‌లో 50 సంవత్సరాలు నమ్మకంగా సేవలందించిరి. ఈయన ప్రియమైన భార్య అమ్రితా సేన్ ఏప్రిల్ 26, 1986న ప్రభువు దగ్గరకు చేర్చబడిరి. విశ్వాసులకు సేవ చేయడానికి, ప్రోత్సహించడానికి ఈయన US మరియు అనేక ఇతర దేశాలకు వెళ్లిరి. వీరు ఇద్దరు బిడ్డలు, ఐదుగురు మనుమళ్లతో ఆశీర్వదించబడిరి. వీరు ప్రార్దించిన రీతిగానే, సహుదరుడు హనోక్ సేన్ కుటుంబముతో అమెరికాలో, ప్రభువు సేవలో కొనసాగుచున్నారు. సహుదరి. జెరుషా లుకోస్, కుటుంబము DL మూడి ఇన్స్టిట్యూట్ లో, సేవ చేయుచున్నారు.
సహూ. లాజర్ సేన్ గారు, సేవ చేసిన ప్రదేశాలలో దైవిక క్రమమును, దేవుని ప్రేమను రుచి చూపించుచూ, ఈయన పొందిన రక్షణానందమును పదిలపరచుకొని, తన 86వ ఏట, 65 సంవత్సరాలు సుదీర్ఘ, సంపూర్ణ సేవచేసి తన విశ్వాసమును కాపాడుకొని, బెయేర్షెబా ప్రార్థనా మందిరం నుండి పరలోక పిలుపును అందుకొనిరి.