
నేటి విశ్వాస నాయకుడు
సహూ. ఎపఫ్రాస్ ఘోగ్లే
పరలోక పిలుపు : 06 ఏప్రిల్ 2021
ఏర్పరచబడిన పాత్ర, ఆత్మల భారము కలిగినవాడు, సువార్తికుడు, ప్రార్ధనా యోధుడు, దేవుని సేవకుడు.
సహూ. ఎపఫ్రాస్ ఘోగ్లే (1950-2021) హెబ్రోన్ సేవకునిగా అందరికి సుపరిచితులు. ఈయన రక్షణ, పూర్తీ సేవా పరిచర్య ఒకేసారి ప్రారంభమైనవి. నాటినుండి ఆత్మల భారంతో, వివిధ సువార్త పరిచర్యలు చేసేవారు. ఇంటింటికి, అతి దూర ప్రాంతాలకు సైకిళ్ళ మీద క్యాంపులు, బహిరంగ సువార్తలు, రాత్రిపూట సువార్త కూడికలు ఈలాగు, అన్నిరకాల అవకాశాలను దేవుని మహిమార్థమై సద్వినియోగపరచు కొనేవారు. ప్రాముఖ్యముగా! ప్రభువు ఈయనకు అప్పగించిన ప్రత్యేక భాద్యత, ఈయన వ్యక్తిగత సువార్త. ఈ భాద్యత యెడల మక్కువతో చివరివరకు ప్రత్యేక శ్రద్ధ వహించిరి. ఈయన దగ్గర ఎప్పుడూ కరపత్రాలు, సువార్త పుస్తకములు అందుబాటులో ఉంచుకొని ప్రతిరోజూ ఉదయం విధిగా సువార్త చెప్పటానికి వెళ్ళుతుండేవారు. ఈయన బయట ఉన్నపుడు, సమయము సందర్భము లేకుండా, ప్రతి నిముషము సద్వినియోగ పరచుకొనుచు వ్యక్తిగతంగా సువార్త చెప్పేవారు. ఇందులో భాగంగా హాస్పిటల్ పరిచర్య, నగరంలో ఉన్న హాస్పటల్స్ లలో ఉన్న అనేక ప్రాంతాలకు చెందిన విశ్వాస గృహాలకు చెందిన రోగులను రోజూ దర్శించి ప్రార్ధించి, వారికి ఆత్మ స్థైర్యము నింపుతుండేవారు. ఈయనకు సంపూర్ణంగా దేవునిపై ఆధారపడి నడవడం మాత్రమే తెలుసు. ఈయన బహు సహన శీలి. నిన్ను కుడి చెంపమీద కొట్టువాని వైపునకు ఎడమ చెంపకూడా త్రిప్పుము, ప్రభువు వారు కొండమీద ప్రసంగముగా చెప్పబడిన మాటలన్నియు, ఈయన జీవితానికి సరి పోల్చవచ్చును. ఈయనకు సహుదరుడు భక్త్ సింగ్ గారి ద్వారా ప్రభువిచ్చిన వాగ్దానము. (కొలొస్సీ 4:12,13) ముందుగా తనకు అన్వయించుకొని, ఆ వాగ్దానము ఎత్తిపట్టుకొని, దేవుని చిత్తము గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారై నిలుకడగా ఉండవలెనని అందరి కొరకు భారంగా ప్రార్ధన చేస్తుండేవారు.
ఈయన మరాఠా రాష్ట్రము, బుల్దానా జిల్లా, మోటాలా గ్రామములో 15 మే,1950న విగ్రహారాధన కుటుంబమైన సుఖ్‌దేయో ఘోగ్లే; గంగా ఘోగ్లే దంపతులకు, నల్గురు సంతానంలో, ముగ్గురు అక్కల తర్వాత జన్మించెను. ఈయన బాల్యమునుండి మతపరంగా నిష్ఠగల భక్తుడు. అయితే దేవుని గురించి సత్యాన్ని వెతకాలనే కోరికతో, హిందూ గ్రంధాలను అధ్యయనం చేస్తూ, తన సమయాన్ని హిందూ దేవాలయంలో లేదా చదువులో గడిపేవాడు. ఈయన తెలివైనవాడుగా బాగా చదువుకోవాలనే తన కలలకు తన చిన్నాన్న మద్దతుతో, మెరిట్ స్కాలర్‌షిప్‌తో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాడు, ఇలాంటి ఘనత గ్రామంలోనే తొలిసారి. తరువాత విద్యతో పాటు ఎన్ సి సి క్యాడెట్ గా కొనసాగుతూనే, నాగపూర్ రామకృష్ణ మఠములో ఆశ్రయము పొంది, ఎంఎస్సీ – ఫిజిక్స్ చదివారు. ఈయన దేవుని ఏర్పాటులో ఉన్న కారణాన, తన జీవిత పరమార్ధము కొరకు ఎంత భక్తిగా ఉన్నా, మనశాంతి లేనివాడై ప్రేరేపించబడి సముద్రములో దూకి ఆత్మహత్య చేసుకోవాలని బొంబాయి, గేట్ వే అఫ్ ఇండియాకు వెళ్లగా, అక్కడ బెంగుళూరుకు వెళ్లవలెనని ఆశ్చర్యమైన స్వరముతో హెచ్చరించబడినవాడై, ట్రైన్ లో బెంగుళూరుకు వెళ్లెను. ఇదే ఈయన జీవితములో కీలక మలుపు. అక్కడ రైల్వేస్టేషన్లో ప్రదర్శించబడిన బైబిలులో యెహాను 14 : 6, వాక్యము ద్వారా ఆకర్షించబడి, ప్రభువు నడిపింపులో సహూ. అమృతరాజ్ గారిని కలిసికొనగా, ఆయన చెప్పిన వాక్యము ద్వారా ఒప్పించబడి, ఇరువురి మధ్య అర్థంకాని బాష కారణంగా, ఈయనను 1974, మార్చి 21న హైదరాబాద్, హెబ్రోనులో ఉన్న సహూ. భక్త్ సింగ్ గారి దగ్గరకు పంపించబడిరి. అక్కడ దైవదాసుల అనుభవపూర్వకమైన ప్రేమను చూరగొని, సహవాసంలో దేవుని వాక్యం విన్నప్పుడు, పాప క్షమాపణ పొంది ప్రభువైన యేసు క్రీస్తును స్వంతరక్షకునిగా అంగీకరించెను. ఆ తర్వాత 1974, జూన్ 08న బాప్తిస్మములో సాక్ష్య మివ్వగా, సహూ. భక్త్ సింగ్ గారు, కొలొస్సీ 4:12, వాగ్దానము ఇస్తూ ఈయనకుగల నారాయణ అనే పేరుకు బదులుగా కోలస్సి సంఘములో క్రీస్తుయేసు దాసుడైన ఎపఫ్రాస్ అనే పేరు పెట్టియుంటిరి. ప్రభువు ఇదే వాగ్దానముతో, ఈయన పూర్తికాల సేవా పరిచర్యను ధృవీకరించడానికి ఈ పేరునే ఉపయోగించుకొనెను. దీనదాసుడు ప్రభువుకు లోబడి, సమర్పించుకొని, హెబ్రోన్ సహూదరులతో కలిసి ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను బహిరంగ ప్రదేశాలలో ప్రకటించడం ప్రారంభించెను.
హెబ్రోను తర్పీదులో ఉన్న సేవకులకు, అన్ని రకకాల పనులు, వివిధ బాధ్యతలు నెలవారీగా మార్చుతూ, పంచబడతాయి. ఇవన్నీ, ఇంకా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం, పరిచర్య చేయటంతోపాటు, అనుభవపూర్వక శిక్షణగా మారుతుంది. ఈయన 1974 నుండి, అన్నిరకాల దేవుని మందిర విధులన్నియు అత్యంత నమ్మకంగా, సక్రమముగా నిర్వహించెను. ఈ కాలములో పెద్ద సేవకుల జీవితాలను అతి సమీపముగా గమనించి, ఇంకనూ ప్రతి దానికి ఆయన చిత్తమును తెలిసికొనుట, దైవ భయము కలిగి, అనుభవపూర్వకముగా జీవించుట నేర్చుకొనెను. ఈ అనుభవాల ద్వారా, ఈయన ప్రశ్న లన్నింటికీ ప్రభువే సమాధానమనుగ్రహించెను. ఇంకా అతి ముఖ్యమైన పనులైన ఆఫీస్, అకౌంట్స్ ఆఫీస్, హెబ్రోన్ మెసెంజర్ ఆఫీస్, ముఖ్యముగా ఇంగ్లీషు హెబ్రోన్ మెసెంజర్ నుండి హిందీలోకి హెబ్రోన్ సందేశ్ అనువాదం – ప్రూఫ్ కరెక్షన్, ఇంకా హిందీ పాటల పుస్తకమైన సియోన్ కి గీత్ ప్రూఫ్ కరెక్షన్, తెలుగు చిన్న పుస్తకముల పాటలను హిందీకి అనువాదం, ఇంకా అవసరమైన హిందీ అనువాదాలన్నియు చేస్తుండేవారు. సహూ. భక్త్ సింగ్ గారి వర్తమానములకు హిందీ ప్రదేశాలలో తర్జుమాలు కూడా చేస్తుండేవారు. ఈయన తండ్రి గారు, రక్షణ పొంది, హెబ్రోనులోనే బాప్తిస్మము తీసుకొనగా, దైవదాసుడు, ఇంకా ఫిలిప్పు గారితో కలసి ఈయనకూడా చేతులుంచి ప్రార్ధించెను.
సహూ. ఎపఫ్రాస్ ఘోగ్లే గారి వివాహము హెబ్రోను సహుదరైన ఝాన్సీతో, జనవరి 23, 1988,న హెబ్రోనులో సహూ. భక్త్ సింగ్ గారు జరిపించితిరి. ఆదినమున ఒకేసారి జరిగిన మూడు వివాహములలో, వీరి వివాహము కూడా ఒకటి. సహుదరి ఝాన్సీ, పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు దగ్గర తిరుగుడుమెట్ట గ్రామమునకు చెందిన గుండుపు గంగరాజు, రూతమ్మ దంపతుల ముగ్గురు కుమార్తెలలో, రెండవ కుమార్తె. వీరికి ఇద్దరు సంతానము. 1. గ్రేస్ డేనియల్, 2. తిమోతి ఘోగ్లే. ఇంకా ముగ్గురు మనుమళ్లతో ఆశీర్వదించ బడితిరి. వీరు తమ బాధ్యతలతో పాటు ప్రభువు సేవా పరిచర్యను కూడా విస్తారముగా నిర్వర్తిస్తున్నారు.
సహూ. ఎపఫ్రాస్ గారు కుటుంబముగా సేవ చేసిన ప్రదేశములు.
1. రెహబూత్ ప్రార్థన మందిరము, సోమాజుగూడ, హైదరాబాద్ జనవరి 1992 – జూన్ 2004
2. హోరేబు ఆరాధన మందిరము, కొల్హాపూర్, మహారాష్ట్ర : జూన్ 2004 – జూన్ 2008
3. బేతనియ ప్రార్థన మందిరము, గుల్బర్గా, కర్ణాటక జూన్ 2008 – ఆగస్టు 2014
4. మౌంట్ కార్మెల్, పన్వేల్, ముంబై, ఆగస్టు 2014 – సెప్టెంబర్ 2018
5. బెత్ఫగే ఆరాధన మందిరము, ఖర్గర్, ముంబై, సెప్టెంబర్ 2018 – ఏప్రిల్ 2021
వీరు సేవ చేసిన ప్రదేశాలలో ఎంతో నమ్మకముగా, ప్రభువుకు జవాబుదారీతనంతో బాధ్యతలన్నియు నెరవేర్చిరి. ఈయన సేవచేసిన సంఘాలలో సమస్యలద్వారా, సేవకుడిగా మధ్యలో ఉండి పొందిన నిందలనూ, సువార్త ప్రకటించేటప్పుడు వ్యతిరేకుల నుండి పొందిన శ్రమలను, సహనముతో దేవుని నిమిత్తము భరించేవారు. ఈయన ప్రేమను, సహనమును అర్ధం చేసుకున్నవారు తిరిగి క్షమాపణలు కోరి సమకూర్చబడిన సందర్భాలు కూడా కలవు. ఈయన ఇది కావాలని కానీ, ఇది బాగాలేదని కానీ ఎప్పుడూ చెప్పలేదు. అనగా, ఈయన నుండి అభ్యర్థనలు లేవు, ఫిర్యాదులు లేవు. అందరితో సమాధానముగా ఉంటూ, ఎల్లప్పుడూ ప్రభువుపై ఆధారపడి ఉండటమే ఈయనకు తెలిసిన విధానం. అన్ని విషయములలో మాదిరిగా నడచుకొనుచూ చివరివరకు కొనసాగిరి.
దైవదాసునితో నా అనుభవం : ఎపఫ్రాస్ గారికి పెళ్ళైన దగ్గరనుండి ఈయనతో మంచి అనుబంధము కలిగియున్నాను. ఈయన నాకు బావగారు, నన్ను ప్రేమగా పిలిచేవారు. అదే నిష్కల్మషమైన ప్రేమతో అందరిని చూచేవారు, మా అందరి గురించి భారముగా ప్రార్థిస్తూఉండేవారు. సున్నిత మనస్కుడు, మృదుబాషి, మితబాషి, ఎవ్వరిని, ఎప్పుడూ నొప్పించలేదు. ఈయన క్రీస్తు ప్రేమను కలిగి, సంపూర్ణగా విశ్వాస ఆధారంగానే జీవించియున్నారని కచ్చితంగా చెప్పగలను. దైవదాసుడు ప్రభువు మహిమలోకెళ్లిన దగ్గరనుండి, సహుదరి ఝాన్సీ, కుమార్తెతో కలసి హైదరాబాద్, కూకట్ పల్లిలో ఉంటూ, ప్రభువు ఇచ్చిన పరిచర్య బాధ్యతలను నెరవేర్చుచున్నారు. సహుదరి పరిచర్య, ఆరోగ్యము, బిడ్డలు, వారి కుటుంబముల గురించి దయతో ప్రార్ధించగలరు.
ఈయన పొందిన రక్షణ ఆనందమును, విశ్వాసమును కాపాడుకొనుచూ, చివరివరకు పరిచర్యలో కొనసాగుతూ, రెండవ సారి వచ్చిన తీవ్ర కరోనా కారణంగా అస్వస్థతకు గురై తన 71 వ ఏట, 47 సంవత్సరాల, సేవానంతరం ప్రభువు చివరిపిలుపును అందుకొనిరి.