
నేటి విశ్వాస నాయకుడు
జార్జ్ వెర్వర్ – OM
పరలోక పిలుపు : 14 ఏప్రిల్ 2023
ప్రపంచ సువార్తికుడు, బహుళ దేశాల మిషనరీ, రచయిత, ఫ్లోటింగ్ బుక్ షిప్స్ పితామహుడు, ఆపరేషన్ మొబిలైజేషన్ వ్యవస్థాపకుడు. ప్రపంచ యువతను మిషనరీ పిలుపుకు ప్రభావితం చేసిన మిషనరీ నాయకుడు.
జార్జ్ వెర్వర్ (1938–2023) ప్రపంచంలోని అతిపెద్ద మిషనరీ సంస్థలలో ఒకటైన ఆపరేషన్ మొబిలైజేషన్ (OM) వ్యవస్థాపకుడు. ఈయన యుక్త వయస్సులోనే, సంపద, భవిష్యత్ అవకాశాలను త్యాగం చేసి, దేవుని సేవలో అడుగుపెట్టాడు. విభిన్న మత సంప్రదాయాల మధ్య సువార్త ఎలా పని చేయగలదో, ఆప్రకారముగా ఈయన సువార్త ప్రచారం పట్ల అసాధారణమైన విధానం, మిషన్ ల పట్ల మక్కువతో కూడిన హృదయం, ముఖ్యంగా సువార్త చేరుకోని మారు మూల ప్రాంతాలలో ప్రజలవద్దకు లోతైన నిబద్ధతతో సువార్తను వ్యాప్తి చేయడంలో ప్రసిద్ధి చెందాడు. ఈయన యేసునందు విశ్వాసముంచిన ప్రజలందరు కచ్చితంగా శిష్యత్వం తీసుకోవాలని తీవ్రంగా ప్రోత్సహించిన ఉత్సాహవంతుడైన ప్రచారకుడు. వేలాది యువతను మిషనరీ సేవకు ప్రేరేపించాడు, ప్రపంచాన్ని యేసు కొరకు జయించండి అనే భారమును వారికి పంచాడు. వ్యక్తిగతంగా ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, ప్రపంచాన్ని చేరే లక్ష్యంతో పనిచేశాడు. మైనారిటీ దేశాల ప్రజలకు బైబిల్, జ్ఞానం పంచడం, నిషేదిత దేశాల్లో సైతం సువార్త వెలుగును చాటడం, ఎంతోమంది యువతకు శిక్షణా శిబిరాలు నిర్వహించడం ఇలా ఎన్నో చేపట్టాడు. ఈయన వివిధ క్రైస్తవ ఇతివృత్తాలపై అనేక పుస్తకాలు రాశాడు, ఇవన్నీ మిలియన్ల కొలది ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయబడ్డాయి. ఈయన లోగోస్, డౌలాస్ ఇతర మిషనరీ షిప్లకు మార్గదర్శకత్వం వహించాడు, వినూత్నంగా ఓడల ద్వారా సువార్త జరిగేది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ బుక్‌ఫెయిర్ గా గుర్తింపు పొందింది. ఇవి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు సువార్త, క్రైస్తవ సాహిత్యం, మానవతా సహాయాన్ని తీసుకు వెళ్ళేవి. ఇందులో భాగంగా వందలాది దేశాల్లో క్రైస్తవ పుస్తకశాలలు నెలకొల్పి, పుస్తకాల ప్రదర్శన, పంపిణీ ద్వారా సువార్త ప్రకటించబడింది. వివిధ భాషలలో వేలాది పుస్తకాలు అందుబాటులో ఉండేవి. 1964 లో ఇండియాకు వచ్చినప్పుడు, తన బహుళ దేశాల మిషన్ చరిత్రలో అందరికంటే ఎక్కువుగా బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యకు ప్రభావితుడై దైవదాసునికి మద్దత్తు తెలిపి, ప్రభువు సేవకు సహకరించెను. లీడర్ గా కాకుండా, “సేవకుడు”గా జీవించాలనే తత్వం ఈయనది. ఉదాహరణకు భక్త్ సింగ్ గారు సువార్తకు టీముగా పంపించేటప్పుడు, అవసరాన్ని బట్టి ఈయనే ట్రక్ డ్రైవ్ చేసేవాడు. వెర్వర్ హాస్యాస్పదంగా తనను తాను “గాడ్స్ బంగ్లర్” అని పిలుచుకొనేవాడు, అంటే దేవుని దృష్టిలో అల్పుడుగా తగ్గించుకొనేవాడు. ఈయన మిషన్ పిలుపుకు గుర్తుగా ప్రసిద్ధ “గ్లోబ్ జాకెట్” ను ధరించి, మిషన్ల కోసం ప్రపంచ దృష్టిని కలిగి ఉండమని క్రైస్తవులను ప్రోత్సహించేవాడు. కొన్ని వ్యతిరేక దేశాలు ఈయనను నిషేదించినప్పుడు ఈయనన్న మాటలు, “మనము కొన్ని దేశాల నుండి త్రోసివేయబడ్డాము, కాని మనము దేవుని ప్రణాళిక నుండి ఎన్నడూ త్రోసివేయబడలేదు”
జార్జ్ వెర్వర్ జూలై 3, 1938న న్యూజెర్సీలోని వైకాఫ్ లో డచ్ వలస తల్లిదండ్రులకు జన్మించాడు. ఈయన మేరీవిల్లే కాలేజీలో చదివి, మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ కు బదిలీ అయ్యాడు. ఈయన యవ్వన దశలోనే పరిస్థితులను అధిగమించి, 1953లో బిల్లీ గ్రాహం గారి ద్వారా క్రీస్తు దగ్గరకు నడిపించబడి, సువార్త ప్రకటించడానికి ప్రేరణ పొందగా, డాసన్ ట్రోట్మన్ నావిగేటర్ ఈయన శిష్యత్వాన్ని, భవిష్యత్తు మిషనరీ పరిచర్యకు తీర్చిదిద్దాడు. 1957లో మెక్సికోలో యోహాను సువార్తను పంపిణీ చేయడం ప్రారంభించాడు, 17 ఏళ్ల వయసులోనే లెక్కలేనన్ని పాఠశాలలకు బైబిళ్లు పంచడం ప్రారంభించాడు. ఇది “సెండ్ ది లైట్” ఏర్పడటానికి దారితీసింది, తరువాత ప్రధాన మిషనరీ ఉద్యమం అయిన OMగా మారింది. 2009లో, ఈయన బయోలా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టర్ ఆఫ్ డివినిటీని అందుకున్నాడు.
గ్రాడ్యుయేషన్ తర్వాత, జార్జ్ వెర్వర్, తన బృందం వారి ప్రారంభ మిషనరీ ప్రయత్నాలలో భాగంగా స్పెయిన్ వెళ్లారు. USSRలో బైబిళ్లను పంపిణీ చేయడంలో ఈయన ధైర్యం అరెస్టు, బహిష్కరణకు దారితీసింది, ఇది మిషన్ల కోసం తన సంకల్పాన్ని ఇంకా బలపరిచింది. 1961లో, ప్రార్థన కూడిక తర్వాత, ఆపరేషన్ మొబిలైజేషన్ (OM) అధికారికంగా స్థాపించబడింది. ఆగస్ట్ 2003లో ఈయన, 15 సంవత్సరాలుగా అసోసియేట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్న పీటర్ మైడెన్కి OM యొక్క అంతర్జాతీయ నాయకత్వాన్ని అప్పగించాడు. వైదొలిగిన తర్వాత కూడా, వెర్వర్, తన భార్య ప్రత్యేక ప్రాజెక్ట్ల మంత్రిత్వ శాఖలలో నిమగ్నమై విస్తృతంగా ప్రయాణించడం కొనసాగించారు, ప్రతిచోట బోధిస్తూ, మిషనరీలను, ప్రపంచ సువార్త ప్రచారాన్ని ప్రోత్సహించారు.
వెర్వర్ క్యాన్సర్తో పోరాడుతూ 84 ఏళ్ల వయసులో కన్నుమూశారు. తన చివరి రోజులలో కూడా, ఈయన గ్లోబల్ మిషన్ల పట్ల మక్కువతో, క్రీస్తు కోసం పూర్తిగా జీవించమని విశ్వాసులను ప్రోత్సహించాడు. ఈయన వారసత్వం ఆపరేషన్ మొబిలైజేషన్ (OM), ఇంకా తన సువార్త సేవ, ఈయన ప్రభావితం చేసిన లెక్కలేనన్ని జీవితాల ద్వారా కొనసాగుతూనె ఉన్నది.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.