ఈ రోజు బిషప్, సువార్తికుడు, సమాజ సేవకుడైన మార్టిన్ ఆఫ్ టూర్స్ పరలోక పిలుపు అందుకున్న రోజు (08.11.397).

ఫ్రాన్స్ లోని సెయింట్స్ అందరికంటే అత్యంత ప్రభావంతమైన మరియు మంచి పేరొందిన ఈ మార్టిన్ ఆఫ్ టూర్స్ గారు జాలిపరుడైన మార్టిన్ గా అందరికీ తెలుసు. ఇటలీలోని క్రైస్తవేతర కుటుంబంలో జన్మించిన ఈయన తన యుక్త వయసులో ప్రభువును తెలుసుకొని, మార్పు పొందాడు. తన జీవితకాలమంతా క్రైస్తవుడైనందుకు ఎన్నో శ్రమలు, హింసలు పొందినా గానీ చివరి వరకు వీగిపోని, చెక్కుచెదరని విశ్వాసం కలిగి జీవించాడు. అనేకమంది క్రైస్తవేతరులకు సువార్త చెప్పి వారిని క్రీస్తు ప్రేమకు పరిచయం చేసేవాడు. అనేక సంఘాలను స్థాపించాడు. మార్టిన్ తన ప్రవచనాలు, దర్శనాలు, అద్భుతాలు మరియు స్వస్థతల వలన సుప్రసిద్ధుడయ్యాడు. క్రీ. శ 372లో బిషప్ గారి మరణం తర్వాత తనకి ఇష్టం లేకపోయినా స్థానిక ప్రజలందరి ఏకాభిప్రాయంతో మార్టిన్ బిషప్ గారి వారసునిగా ఎన్నుకోబడ్డాడు.
ఈ మార్టిన్ పేద ప్రజల పక్షపాతి. ప్రజలందరూ త్రాగుడుకు దూరంగా ఉండాలని బోధించిన వ్యక్తి.

తాను స్థాపించిన దేవాలయంలోనే తన మరణ పర్యంతం ప్రార్థనలోనూ, సంఘ, సమాజ సేవలోను ఈయన జీవితం గడిపారు.