
వినయ విధేయ విశ్వాసం!
Sunday, May 5, 2024
“యేసుక్రీస్తు…. నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ….”
— రోమా 1:3-5
నేటి క్రైస్తవంలో చాలా మంది విశ్వసించడమంటే మతం పుచ్చుకోవడమో, బాప్తీస్మం తీసుకోవడమో, నిర్ధారణ తీసుకోవడమో లేక స్వస్థత కోసమో, అద్భుతాల కోసమో ప్రార్థన చేయించుకోవడమో అనుకుంటున్నారు. దానికి తోడు మన అయ్యగార్ల ప్రసంగాలూ అలానే ఉన్నాయి. విశ్వాసమంటే పూర్తిగా ఆధారపడటం, ఆనుకుపోవడం. ఈ విశ్వాసం ఒక అయ్యగారి ప్రార్థన పైనో, ఆయన ఇచ్చే నూనె బుడ్డి పైనో, ఒక సంఘ నియమం పైనో, ఒక సిద్ధాంతం పైనో కాదు. ఈ విశ్వాసం ఒక విలక్షణమైన వ్యక్తి పైన! దేవునికి నరునికి మధ్య ఉన్న అనంత అగాధాన్ని పూడ్చ గల్గిన దైవమానవుడైన క్రీస్తు పైన. దేవునికి మనిషికి మధ్య ఉన్న పాప గోడను కూల్చ గల్గిన సిలువ వేయబడిన క్రీస్తు పైన. మనిషిని పాపమరణాల దాస్యం నుండి విడిపించ గల్గిన మృత్యుంజయుడైన క్రీస్తు పైన. విశ్వాసానికి కారకుడు, దాన్ని పరిపూర్తి చేసేవాడూ ఐన క్రీస్తు పైనే మన విశ్వాసం (హెబ్రీ.12.1). ఈ విశ్వాసమే మనిషిని పాపం నుంచి విడిపిస్తుంది (1 యోహా.2.1-2).
ఈ విశ్వాసం వట్టిది కాదు. ఇది విధేయతా విశ్వాసం. విధేయత లేని విశ్వాసం క్రీస్తును మెప్పించ లేదు. అద్భుతాల కోసమే తనను నమ్మిన అనేకుల విశ్వాసాన్ని ఆయన తిరస్కరించాడు. “…ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొనలేదు…”(యోహా. 2:23-24). మరో సందర్భంలో “…మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని”(యోహా. 6:26) చెప్పి ఆయన వారి విశ్వాసాన్ని తిరస్కరించాడు. విధేయత లేని విశ్వాసం ప్రభువు అంగీకరించడు. విశ్వాసంతో క్రీస్తుకు “విధేయులైన” వారికే నిత్య రక్షణ దొరుకుతుందని వాక్యం చెబుతోంది (హెబ్రీ 5.9). సువార్త ద్వారా సమస్త జనులూ విశ్వాస విధేయులు కావాలన్నదే దేవుని సంకల్పం! (రోమా 1.3-5; 16.25). తనకు “విధేయులైన” వారికే దేవుడు తన ఆత్మను దయచేస్తాడని రాసి ఉంది (అపో.5.32). విశ్వాసులు “విధేయులగు పిల్లలు” గా ఉండి పూర్వం చేసినట్టు స్వకీయ ఆశలకు లోబడక తమను పిలిచిన ప్రభువులా “సమస్త ప్రవర్తన”లో “పరిశుద్ధులు”గా ఉండాలనే ఆదేశం మనకుంది (1 పేతు.1:14). “విశ్వాసంతో” అబ్రాహాము తనను పిలిచిన వానికి “విధేయత” చూపాడని హెబ్రీ గ్రంథకర్త చెబుతున్నాడు (11.8). విధేయత లేని విశ్వాసం దేవుణ్ణి సంతోష పెట్టడం అసంభవం (హెబ్రీ 11.6).
సువార్త సభల్లో కన్నీళ్ళతో ప్రార్థించడం ఆ తర్వాత లోకంలో కలిసిపోవడం, ఆరాధనలో భావోద్రేకంతో ఊగిపోవడం ఆ తర్వాత ఇష్టారాజ్యంగా ఉండటం, పునరుత్థాన పండుగల్లో పెద్దవారి ప్రోద్బలంతో బాప్తీస్మాలు తీసుకోవడం ఆ తర్వాత షరా మామూలుగా ఉండిపోవడం…. ఇలాంటి విశ్వాసాలు దేవుడి దగ్గర అర్హత సంపాదించుకోలేవు. గుడిలో ఒక విశ్వాసం, వీధిలో మరో విశ్వాసం అంటే అది కపట విశ్వాసం! నేను చెప్పింది చేయకుండా నన్ను “ప్రభువా, ప్రభువా” అని పిలవడం దేనికి?—అంటూ ప్రభువు ప్రశ్నిస్తున్నారు (లూకా 6.46). విధేయత బలులకన్నా, నైవేద్యాలకన్నా ఉత్తమమైనది (కీర్త.40.6-8).
మన సొంత నీతి క్రియలు మన రక్షణకు ఏ మాత్రం దోహదం చేయవు. మనం కేవలం కృప చేతనే, విశ్వాసం ద్వారా రక్షణ పొందుతాం. ఇది అక్షర సత్యం!(ఎఫె.2.8). ఐతే ఈ విశ్వాసం విధేయత లేని వట్టి మానసిక విశ్వాసం కాదు. విశ్వాసమంటే దాని మూలకర్త ఐన క్రీస్తుకు జీవితమంతటినీ వశం చేయడం (యోహా. 2.23-24; లూకా 6.46). మన ఆలోచనలు సైతం క్రీస్తుకు లోబడాలి. అదే సంపూర్ణ విధేయత (2 కోరిం.10.4-5).
విశ్వాసం కనబడదు. విధేయత కనిపిస్తుంది. నిజమైన విశ్వాసం విధేయతలో కనిపిస్తుంది. విశ్వాసం ద్వారానే రక్షణ పొందాం అని చెప్పి, ఆ తర్వాతి వచనాల్లో మన విశ్వాసం దేవుడు ఉద్దేశించిన నీతి క్రియల్లో కనపడాలని, అందుకే మనల్ని దేవుడు క్రీస్తులో మళ్ళీ సృష్టించుకున్నాడు—అనీ పౌలు చెప్తున్నాడు (ఎఫె.2.10). యాకోబూ ఇదే సత్యం చెబుతున్నాడు (యాకో. 2.20-24, 26). ఇవి రక్షణకు ఉపయోగపడే నీతి క్రియలు కావు. రక్షణ పొందాక నిజమైన విశ్వాసం నుంచి పుట్టుకొచ్చే నీతి క్రియలు. ఇది విధేయత ఉన్న విశ్వాస లక్షణం!
అవిశ్వాసి మనసు దేవునికి లోబడదు, ఆయన్ను సంతోష పెట్టలేదు (రోమా 8.7-8). నా గొర్రెలు నా స్వరం వింటాయి. అవి నన్ను అనుసరిస్తాయి. వాటిని నేను ఎరుగుదును—అన్నారు ప్రభువు (యోహా.10.27). “వినడం” అంటే విధేయత చూపడం. “అనుసరించడం” అంటే ఆయన అడుగుజాడల్లో నడవడం. మనం వెలి చూపు వల్ల కాదు విశ్వాసం వల్లనే నడుచుకుంటాం—అన్నాడు పౌలు (2 కొరిం. 5.7). “నడుచుకోవడం” అంటే ప్రవర్తన, పాటింపు. మన విశ్వాసం మన ప్రవర్తనలో ప్రస్ఫుటం కావాలి. క్రీస్తుకు వశం కాని విశ్వాసం నకిలీ విశ్వాసం. విధేయత లేని విశ్వాసం విశ్వాసమే కాదు. ఈ విశ్వాసం కొరవడిన క్రైస్తవం క్రైస్తవమే కాదు.
—జీపీ
koreshu kodicherla