అందరికీ మంచి చేద్దాం!

Wednesday, May 8, 2024

“కాబట్టి మనకు సమయము దొరకిన కొలది అందరి యెడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరినవారి యెడలను మేలు చేయుదము.”
— గలతీ 6:10

క్రైస్తవం స్వార్థ పరాయణత్వంతోనో, మత మౌఢ్యంతోనో ఆవిర్భవించిన విశ్వాసం కాదు. క్రైస్తవం ఇచ్చి వేసుకునే విశ్వాసం. ఆదిమ సంఘంలో విశ్వాసులు తమలోని అక్కర ఉన్న ప్రతి ఒక్కరికీ ఆస్తులను పంచి పెట్టారు(అపో.2.44-45). మన దేవుడు ఇచ్చే దేవుడు, నిలువు దోపిడీ చేసే దేవుడు కాదు. మన దేవుడు లోకాన్ని ప్రేమించి, లోక రక్షణ కోసం తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చివేసిన దేవుడు (యోహా. 3.16). తాను దొంగిలించడానికి రాలేదని, ప్రాణాన్ని పణంగా పెట్టడానికి వచ్చానని, పరిపూర్ణ జీవితాలను ప్రసాదించడానికి వచ్చానని చెప్పారు మన ప్రభువు (యోహా. 10.10-16). ఆయన మన కోసమే కాదు. లోకమంతటి కోసం సిలువలో ప్రాణత్యాగం చేశాడని వాక్యం చెబుతోంది (1 యోహా. 2.2). ఐనా ఎందుకోగానీ, త్యాగపూరిత దాతృత్వం భారతీయ క్రైస్తవులకు ఇంకా అబ్బలేదు. మణిపూర్ బాధితులకు మీరెంత సాయం చేశారు అని మొన్నీమధ్య ఒక ధనిక క్రైస్తవ వర్గాన్ని ప్రశ్నించాను. ఎవరూ జవాబు చెప్పలేదు.

మనం విశ్వాసులతో పాటు, అందరికీ (ఇతరులకు) కూడా మేలు చేసేందుకు ప్రతీ అవకాశాన్ని అంది పుచ్చుకోవాలని గలతీ క్రైస్తవులకు పౌలు ఉద్బోధ చేస్తున్నాడు. ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ “అందరికీ మంచి చేద్దాం” (గలతీ 6.10, వాడుక భాష బైబిల్) అని చెబుతున్నాడు. మన దేవుడు అందరికీ నిత్యం మంచి చేసే దేవుడు. ఆయనకు పక్షపాతం లేదు. మన పరలోక తండ్రిలా మనం కూడా ఉండాలి (మత్త.5.45-48) అని ప్రభువు హితవు పలికారు.

పక్షపాతం లేకుండా అందరికీ మంచి చేయడం. ఇది క్రైస్తవ గుండె! మేలు చేయడానికి మనం ముందుండాలి. మేలు చేసే విషయంలో మనకు కులం, మతం, ప్రాంతం, సంఘం అడ్డం కాకూడదు. మన దేశస్తులకు నిస్వార్థంగా సేవ చేయడానికి జీవితాన్ని పణంగా పెట్టిన ఒక యుగోస్లేవియా వనిత మదర్ థెరిసాకు ఈ దేవుడే స్పూర్తి. ఆమె ప్రేమకు నోచుకున్న అనేకమంది భారతీయుల్లో అభాగ్యులు, అనాథలు, అన్నార్తులే ఉన్నారు. వీళ్ళు క్రైస్తవులా కాదా అన్నది చూడలేదామె. క్రీస్తు సిలువలో ప్రాణత్యాగం చేసినపుడు “అందరి కోసం” త్యాగం చేశాడు. అందుకే నేనూ అందరినీ సేవిస్తాను అందామె. మనిషి జీవితం (అతను ఎవరైనా సరే) దేవుడు దిగివచ్చి ప్రాణం పెట్టగలిగినంత విలువైనది. అందుకే అటువంటి మనిషిని సేవించడం నాకు భాగ్యం—అనుకుందామె. ఇదే క్రీస్తు సిలువను చూసి నేను నేర్చుకున్నానని చెప్పుకుంది.

ప్రతీ మనిషి (కుల మత లింగ ప్రాంతాలకు అతీతంగా) దేవుని పోలిక అని మనం మరచిపోకూడదు. పాపం చేసిన తర్వాత కూడా మనిషిని దేవుని పోలికగానే బైబిల్ సంబోధిస్తోంది (ఆది.1.26,27; 9.6; యాకో.3.9). సాక్షాత్తూ దేవుడే దిగివచ్చి ప్రాణం పెట్టగలిగినంత విలువైన వాడు “మనిషి” అని మనం తెలుసుకోవాలి. ఈ బైబిల్ సత్యం సాటి మనిషి పట్ల మన దృక్పథాన్ని సమూలనంగా మార్చేస్తుంది. వివక్ష లేని క్రైస్తవ ప్రేమకు ఈ దృష్టి పథం స్పూర్తినిస్తుంది. నిజమైన క్రైస్తవం సాటి మనిషిని కులమత సంఘ భేదం లేకుండా సమానంగా ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది, సేవిస్తుంది.

కొందరు మతోన్మాదులు (విష) ప్రచారం చేసినట్టు క్రైస్తవ మిషనరీలు మత వ్యాప్తి కోసమో, మత మార్పిడి కోసమో విద్యాలయాలు, వైద్యాలయాలు పెట్టి భారతీయులకు సేవ చేయలేదు. అలా చేసి ఉంటే మన అంబేద్కర్, అద్వానీలతో సహా అనేకమంది నాటి మేటి దేశ నాయకులు క్రైస్తవులుగా మారిపోయేవారే. ఎందుకంటే ఆనాడు మన దేశంలో వీరంతా క్రైస్తవ పాఠశాల్లలోనే చదివారు. కానీ మిషనరీలు తమ మతాన్ని మన దేశస్తుల పైన రుద్దాలన్న దురుద్దేశంతో సేవ చేయలేదు. నేడు విద్య, వైద్యాన్ని మనమే వ్యాపారంగా మార్చేసుకున్నాం. వాళ్ళు సేవా తత్పరతతో విద్యను, వైద్యాన్ని మనకు అందించారు—నిస్వార్థంగా! ఇదీ క్రైస్తవం!

క్రైస్తవ మిషనరీలు మన దేశస్తులను “దేవుని పోలికలు” గా చూసారు. క్రీస్తు వీరందరి కోసం ప్రాణం పెట్టారు కదా అని ఎరిగి సిలువ స్ఫూర్తితో మన వారిని ప్రేమించారు. మనిషి ఆధ్యాత్మిక అవసరం కోసం దేవాలయాలు, మనిషి ఆరోగ్యం కోసం వైద్యాలయాలు, మనిషిని జ్ఞానవంతుడ్ని చేయడానికి విద్యాలయాలు కట్టి, నిస్వార్థంగా సేవించారు. క్రీస్తు తన నరావతార పరిచర్యలో కేవలం ఆధ్యాత్మిక సేవ చేయలేదు. రోగులను స్వస్థ పరిచాడు, అంటరాని వాళ్ళను తాకాడు, పీడితుల్ని పరామర్శించాడు, నిస్సహాయుల్ని ఆదుకున్నాడు. తాను సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికే వచ్చానన్నాడు (మార్కు 10.45). ఆయన వివక్ష లేకుండా సేవించాడు. ఆ చివరి క్షణాల్లో సైతం తనను బంధించడానికి వచ్చిన రోమా సైనికుడి తెగిన చెవికి వైద్యం చేశాడు.

భక్తి అంటే పవిత్రంగా బ్రతకడమే కాదు, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం కూడా అని యాకోబు ఏనాడో చెప్పాడు (యాకో.1.27). “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి” అని ప్రభువు ఆదేశించారు (మత్త. 5:16).

అందరి కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు మనస్తత్వం, తోటి మనిషిని దేవుని పోలికలుగా చూసి సేవించిన మిషనరీల మనస్తత్వం మనం అలవర్చుకుని “అందరికీ మేలు చేసే” క్రైస్తవాన్ని మనం చూపించిన నాడు నిజమైన క్రీస్తును భారతావనికి మనం పరిచయం చేయగలుగుతాం!

జీపీ