కాలాన్ని శాసించే దేవుడు
Thursday, May 23, 2024
“నా కాలగతులు నీ వశములో నున్నవి.”
— కీర్త. 31:15
“అతని టైం బాలేదండి, ఏం చేస్తాం!” “కాలమే నిర్ణయించాలి” “కాలమే గాయాన్ని మాన్పుతుంది”. ఇలాంటి మాటలు తరచూ వింటూ ఉంటాం. కాలానికి అంత సీన్ లేదు! కాలం సృష్టికర్త కాదు, అది సృష్టం మాత్రమే! అంచేత కాలం ఎవడ్నీ శాసించ లేదు, ఎవడికీ ఒకింత సాయం చేయలేదు. ఎవ్వరికీ అదృష్టాన్ని తెచ్చిపెట్ట లేదు. అరిష్టాన్ని అసలివ్వలేదు.
కాలానికి దేవుడే సృష్టికర్త! కాల పదార్థ ప్రదేశాలను వేరు చేయలేం. దేవుడు పదార్థ ప్రపంచాన్ని సృజించినప్పుడే కాలం కూడా దాంతో పాటే ఏర్పడింది. కాలం సృష్టం గనుక కాలగతులకూ దేవుడే కారణభూతుడు. “సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు” అన్నపుడు (యోహాను 1.2,3) కాలం కూడా ఆయన మూలంగానే కలిగింది, ఆయన లేకుండా కాలం లేదు—అని అర్థం. దేవుడు కాలానికి కర్త ఐతే దాని గతులను పాలించే వాడూ ఆయనే అవుతాడు. సృష్టికర్తే సృష్టాన్ని పరిపూర్ణంగా పాలించ గలడు! అంచేత, కాలగతులు దేవుని ఆధీనంలోనే ఉంటాయి, ఉండి తీరాలి కూడా!
కాలానికి కర్త, దాన్ని పాలించే దేవుడు ఖచ్చితంగా కాలానికి బందీ కాడు. ఆయన కాలానికి బయట ఉండే కాలాతీతుడు, కాలాధీశుడు! ఆయన యుగయుగాలకూ దేవుడు, ఒక్క యుగానికి పరిమితమైన యుగపురుషుడు కాడు (కీర్త.90.2). కాలం పరిమితమైంది, దేవుడు అపరిమితుడు. కాలంతో సహా పరిమిత ప్రపంచమంతా ఆ అపరిమిత దేవుడిలోనే చలిస్తుంది. అందువల్లనే ఆయన మనందరికీ నిర్ణయ కాలాన్నీ, నివాస స్థలాల్నీ నియమిస్తాడు (అపో.17.27,28).
దేవుడు నిత్యుడు (యెష.40:28). ఆయన శాశ్వతుడు (ద్వితి.33.27). ఆయన నిత్యం మారని వాడు (కీర్త.102.27). అంచేత కాలంతో మనకున్న సంబంధానికీ, ఆయనకున్న సంబంధానికీ విపరీత వ్యత్యాసం ఉంటుంది. కీర్తనకారుడి మాటలు వినండి. “నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలె నున్నవి రాత్రి యందలి యొక జామువలె నున్నవి” (కీర్త.90.4). “చీకటియైనను నీకు చీకటి కాక పోవును రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి”(కీర్త.139.12). ఈ దేవునికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ ఒక్క “ప్రస్తుతం”గానే ఉంటాయి. మనకు గతించిన కాలం ఆయనకు గత కాలం కాదు. మనకు తెలీని భవిష్యత్తు ఆయనకు తెలియనిది కాదు.
త్రికాలాల్ని పాలించే ఈ దేవుడు మన గతాన్ని మార్చగలడు. మన ప్రస్తుతాన్ని శాసించగలడు. మన భవిష్యత్తును తీర్చిదిద్దగలడు. మన నష్టాల్ని పూడ్చగలడు. మనం పోగొట్టుకున్న కాలాన్ని తెచ్చిపెట్ట గలడు. మన భవితల భయాల్ని పోగొట్టగలడు. ఈయన మోషేను దర్శించినట్టు వృద్ధాప్యంలోనూ నూతన బలం ఇచ్చి గొప్ప కార్యాలు చేయించగలడు. అబ్రాహామును దర్శించినట్టు జవసత్వాలు ఉడిగిన తర్వాత కూడా గర్భ ఫలాన్ని ఇవ్వగలడు. అది విద్యైనా, వృత్తైనా, వివాహమైనా, ఆరోగ్యమైనా, ఐశ్వర్యమైనా ఈయన ప్రతి గతాన్నీ మార్చగలడు, ప్రతి నష్టాన్నీ పూడ్చగలడు, ప్రతి అక్కరనూ తీర్చగలడు. ఈయన “నూతన” బలాన్ని ఇవ్వగలడు (యెష. 40.31; 41.1). సమస్తాన్నీ “నూతనంగా” మార్చేయగలడు. ఈయన అరణ్యంలో మార్గాలు సృష్టించ గలడు. ఎడారిలో నదులు పారేలా చేయగలడు (యెష.43.19).
ఈయన మన దేవుడు. కాలగతులను తన వశంలో ఉంచుకున్న దేవుడు. ఈయన సర్వాధికారి. సర్వకాలాలనూ శాసించే సార్వభౌముడు. ఈయన్ని నమ్మడం నేర్చుకుంటే మనం గతం గురించి చింతించం. భవిషత్తు గురించి భయపడం. ఈయన చేతుల్లో మన ప్రస్తుతమూ పదిలం. ఇక మూఢం, ముహూర్తం, తిథి నక్షత్రాలూ మనకు అక్కర్లేదు. మహోన్నతుడి చాటున నివసించే వాడికి, సర్వశక్తుడి నీడలో విశ్రమించే వాడికి ఏ దిగులూ, ఏ చింతా, ఏ భయం, ఏ బాధా, ఏ శంకా ఉండనక్కర్లేదు(కీర్త.91.1).
—జీపీ
koreshu kodicherla
J RAJASEKHAR