“దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.౹”
—ఎఫె.5:15

కాలం వృధా = జీవితం వృధా

సమయం విలువ తెలీక కాలయాపన చేసే వాళ్ళ జాబితాలో మన దేశస్తులు ముందుంటారు అనడంలో అతిశయోక్తి లేదేమో! జనాభాలో దాదాపు అర్ధభాగం యువజనులు ఉన్న ఏకైక దేశం మన భారతదేశం. ప్రపంచం మన దేశాన్ని ఇపుడు “యువ భారతం” అని పిలుస్తోంది. అంటే ప్రపంచంలో కెల్లా అత్యంత ఎక్కువ యువ శక్తి ఉన్న దేశం మనదే. అంటే దేశ యువశక్తి పరిపూర్ణంగా సద్వినియోగమైతే మన దేశం ప్రగతిలో అగ్రభాగాన నిలిచేదేమో! ఐనా మన యువత సినిమా హీరోల వెంటో, రాజకీయ నాయకుల వెంటో తిరిగి తమ అమూల్యమైన జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు.

కాలం వృధా = జీవితం వృధా

Friday, June 7, 2024

“దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.౹”
— ఎఫె.5:15

మయం విలువ తెలీక కాలయాపన చేసే వాళ్ళ జాబితాలో మన దేశస్తులు ముందుంటారు అనడంలో అతిశయోక్తి లేదేమో! జనాభాలో దాదాపు అర్ధభాగం యువజనులు ఉన్న ఏకైక దేశం మన భారతదేశం. ప్రపంచం మన దేశాన్ని ఇపుడు “యువ భారతం” అని పిలుస్తోంది. అంటే ప్రపంచంలో కెల్లా అత్యంత ఎక్కువ యువ శక్తి ఉన్న దేశం మనదే. అంటే దేశ యువశక్తి పరిపూర్ణంగా సద్వినియోగమైతే మన దేశం ప్రగతిలో అగ్రభాగాన నిలిచేదేమో! ఐనా మన యువత సినిమా హీరోల వెంటో, రాజకీయ నాయకుల వెంటో తిరిగి తమ అమూల్యమైన జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు.

కాలయాపన చేయడంలో సగటు క్రైస్తవుల పరిస్థితీ అలానే ఉంది. మనవాళ్ళు సగం జీవితం సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. “దినములు చెడ్డవి గనుక మీరు…సమయాన్ని సద్వినియోగం చేసుకోండి” అంటున్నాడు పౌలు. రెండువేల సంవత్సరాల క్రిందటే చెడ్డ దినాలు ఉంటే నేటి రోజులు ఎంత ఘోరంగా ఉన్నాయో వేరే చెప్పనక్కర లేదు. “చెడ్డ దినాలు” అంటే చుట్టూ ఉన్న లోకంలో ఉన్న చెడుతనం, దాని పోకళ్ళు. క్రైస్తవుడి పైన దీని ప్రభావం అనివార్యం. సోషల్ మీడియా వచ్చాక ఆ ప్రభావం అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ “చెడ్డ దినాల” ప్రభావం మన అమూల్యమైన సమయాన్ని అనవసరమైన, అపవిత్రమైన విషయాలకు ఆహుతి చేస్తుంది. లోకం మన సమయాన్ని దొంగిలించకుండా మనం ఎప్పటికప్పుడు కాచుకోవాలి. ఇది నిరంతర పోరాటం!

“కాలం, కెరటం ఎవ్వరి కోసం ఆగవు” అన్నది ఇంగ్లిష్ సామెత. నిజమే, కాలం వెంట మనం పరిగెట్టాల్సిందే తప్ప అది మాత్రం మన కోసం ఆగదు గాక ఆగదు. అందుకే “సమయాన్ని పోనివ్వకండి” అంటున్నాడు పౌలు ఎఫెసీ పత్రికలో. ఒడిసిపట్టుకున్న పిచ్చుక సడలిన చేతి నుంచి ఒక్క ఉదుటున ఎగిరిపోయినట్టు కాలమూ ఎగిరిపోతుంది. కాలంతో పాటు జీవితమూ ఆవిరైపోతుంది. అందుకే మనం సమయాన్ని ఒడిసి పట్టుకోవాలి. ప్రతీ క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అపుడే జీవితంలో ఏదైనా సాధించడానికి వీలౌతుంది. ఎఫెసీ పత్రికలో పౌలు “సమయం” కోసం వాడిన గ్రీకు పదం “కైరోస్”. ఇది సమయంలోని “వాసి”ని సూచించే పదం. మనం ఎంత సమయం గడిపాం అన్న దానికంటే దాన్ని ఎలా గడిపాం, ఎంత నాణ్యంగా గడిపాం అన్నది చాలా ప్రాముఖ్యం.

“ఒకరు సమయాన్ని ఎలా గడుపుతున్నారు అన్నది వారి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తుంది” అంటాడు జోనాథన్ ఎస్ట్రిన్. ఈ భూమ్మీద అతి తక్కువ కాలం జీవించి అత్యద్భుతంగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఏకైక వ్యక్తి మన ప్రభువు. ఈ భూమ్మీద శరీరంతో ఉన్న రోజుల్లో ఆయన సమయాన్ని గడిపిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మూడున్నర సంవత్సరాల్లో ఆయన చేసిన సేవ, భావి పరిచర్యకు వేసిన పునాది రెండువేల సంవత్సరాలు నిలిచి ఉంది. ఆయన సమయ పాలనలో రాసి కన్నా వాసి ఎక్కువ!

తండ్రి తనను ఎందుకు ఈ భూమ్మీదికి పంపాడో ప్రభువు ఎన్నడూ మరచిపోలేదు. ఆయన చిన్ననాటి నుంచీ “తండ్రి పనుల మీద” ఉన్నాడు (లూకా 2.49). ఈ స్పృహ వల్లనే ఆయన తన సమయాన్ని ఎన్నడూ వృధా చేయలేదు. సరికదా, తనకున్న సమయాన్ని అమూల్యంగా ఎంచి, దాన్ని అన్ని విధాలా సద్వినియోగం చేసుకున్నాడు. ఆయన తల్లిదండ్రులకు సమయం ఇచ్చాడు (లూకా 2.51), పండితులకూ బోధకులకూ సమయమిచ్చాడు (లూకా 2.46,47). పామరులకూ, దీనులకూ, నిస్సహాయులకూ, రోగులకూ సమయమిచ్చాడు (యోహా.1.43; 9.35; మత్త.4.24,25; 20.17; యోహా.5.5-9; మార్కు 5.25-34). మన ప్రభువు చిన్న పిల్లలకూ సమయం కేటాయించారు (మత్త.19.13-15). ఆయన సమరయులకూ సమయం ఇచ్చాడు (యోహా.4.40). ఆయన తన శత్రువులకు సైతం సమయమిచ్చాడు (మత్త.22). ఆయన తన శిష్యులకు ప్రత్యేక సమయం ఇచ్చాడు (మత్త.20.17; 24.3; మార్కు 9 2). వీటన్నిటి మధ్య ఆయన తన తండ్రికి సమయమివ్వడం మానలేదు (మత్త.14.23; మార్కు 1.35). ఇలా సమతుల్యంగా, సముచితంగా సమయ పాలన చేయడం మనం మన ప్రభువు దగ్గర నేర్చుకోవాలి.

“ఒకరు సమయాన్ని ఎలా గడుపుతున్నారు అన్నది వారి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తుంది”

దేవుడు మనల్ని ఈ భూమ్మీద ఎందుకు ఉంచాడు, మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, మనం ఆయన కోసం ఏం సాధించాలి అన్న స్పృహ మనకు ఉన్నపుడు మనం ప్రభువులా సమయాన్ని సముచితంగా వినియోగించడం నేర్చుకుంటాం. అనవసరమైన పనికిమాలిన విషయాలకు సమయాన్ని వెచ్చించి వృధా చెయ్యం. జీవితంలో దేనికి ఎప్పుడు ఎంత సమయం ఇవ్వాలో నేర్చుకుంటాం (ప్రసం.3.1-8). మన జీవన పరమార్థం మన జీవితంలో సమయ పాలనకు ప్రమాణంగా, ప్రేరణగా నిలుస్తుంది.

కాలానికి జీవితానికి అవినాభావ సంబంధం ఉంది. కాలం వృధా అయితే జీవితం వృధా అయినట్టే. కాలం సద్వినియోగమైతే జీవితమూ ఎంతో కొంత సాఫల్యం సాధించినట్టే. “మన ఖాళీ సమయాన్ని మనం ఎంత చక్కగా వినియోగించాం అన్నదే మన జీవన సాఫాల్యాన్ని నిర్ధారిస్తుంది” అన్న మైక్ డన్లప్ మాటలు అక్షర సత్యాలు. సమయ వినియోగానికి, జీవన సాఫల్యానికి అంత దగ్గర సంబంధముంది మరి!

మనిషి జీవితం చాలా చిన్నది (కీర్త.103.15,16; 90.3-6,10). అతని సమయం చాలా అమూల్యమైంది. మన జీవితంలో ప్రతీ ఇరవైనాలుగ్గంటలూ దేవుడు మనకిచ్చిన వరం. అంచేత మోషే లాంటి ప్రార్థనా వైఖరి మనం పెంపొందించు కోవాలి. మనం సంవత్సరాల్ని కాదు “ప్రతీ దినాన్నీ లెక్కించడం” నేర్చుకోవాలి. మనం సమయోచితంగా బ్రతకడానికి దేవుడ్ని జ్ఞానం అడగాలి. ఆయన ప్రసన్నతను, కృపను కోరుకోవాలి (కీర్త.90.12-17). ఎవరైతే ప్రభువిచ్చిన సమయం గురించి ప్రభువుకు ఒక రోజున లెక్క చెప్పాలి అన్న జవాబుదారీతనంతో ఉంటారో వాళ్ళే సమయాన్ని సముచితంగా సద్వినియోగం చేసుకుంటారు. వాళ్ళే ఆయన కోసం ఈ భూమ్మీద ఏదైనా సాధిస్తారు, కొందరికైనా ఆశీర్వాదంగా మారతారు, జీవితాన్ని సార్థకం చేసుకుంటారు.

—జీపీ

Previous Devotions