“మీరు వినువారు మాత్రమై యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.”
—యాకోబు 1:22

వినుట విధేయత కోసమే

సోషల్ మీడియా పుణ్యమా అని నేటి భారతీయ క్రైస్తవంలో వాక్యం వినడం ఎక్కువైంది. వింటున్నదంతా వాక్యమేనా అన్న సంగతి పక్కన పెడితే వినిపిస్తున్న ప్రసంగాలతో పాటు వినే క్రైస్తవులూ ఎక్కువయ్యారు అన్నది వాస్తవం. ఎటొచ్చీ ఎలా వింటున్నారన్నదే ప్రశ్న!

వినుట విధేయత కోసమే!

Monday, June 10, 2024

“మీరు వినువారు మాత్రమై యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.”
— యాకోబు 1:22

సోషల్ మీడియా పుణ్యమా అని నేటి భారతీయ క్రైస్తవంలో వాక్యం వినడం ఎక్కువైంది. వింటున్నదంతా వాక్యమేనా అన్న సంగతి పక్కన పెడితే వినిపిస్తున్న ప్రసంగాలతో పాటు వినే క్రైస్తవులూ ఎక్కువయ్యారు అన్నది వాస్తవం. ఎటొచ్చీ ఎలా వింటున్నారన్నదే ప్రశ్న!

యాకోబు తన పత్రికలో క్రైస్తవ జీవనానికి దేవుని వాక్యం ఎంత కీలకమో చెబుతున్నాడు. శోధనల్ని ఎదుర్కోవడానికీ, శ్రమల్ని తట్టుకోవడానికీ, పాప మాలిన్యం నుంచి బయటపడటానికీ, లోకంతో స్నేహించకుండా ఉండటానికీ, కోపాన్ని అధిగమించడానికీ, నాలుకను అదుపులో పెట్టుకోవడానికీ, విశ్వాస ఫలాలు ఫలించడానికీ అన్నింటికీ వాక్యమే కీలకం అంటున్నాడు యాకోబు. అందుకే వాక్యం పట్ల క్రైస్తవుడి వైఖరి గురించి అతడింతగా నొక్కి చెబుతున్నాడు (యాకో.1.18-25).

వాక్య ధ్యాస లేని క్రైస్తవుడికి వాక్య ధ్యానం కూడా జరగని పని. వాక్య ధ్యానం చేయనివారికి దాన్ని పాటించడం చేతకాని పని.

దేవుని వాక్యం రక్షించడానికి శక్తి కలిగింది (యాకో.1.21; 2 తిమో.3.14). క్రీస్తులో మన పునర్జన్మకు వాక్యమే పునాది వేస్తుంది (యాకో.1.18). సమస్త కల్మషం నుంచీ, దుష్టత్వం నుంచీ వాక్యం మనల్ని విడిపిస్తుంది (యాకో.1.21; యోహా.8.31-34; ఎఫె.5.25-27) అని చెప్తుంది ఈ పత్రిక. ఇటువంటి దేవుని వాక్యం పట్ల క్రైస్తవుడి వైఖరి ఎలా ఉండాలి? మనం దేవుని వాక్యాన్ని సాత్వికంతో స్వీకరించాలి అంటున్నాడు యాకోబు (1.21). అంటే వాక్యాన్ని విన్నప్పుడల్లా వినయ భావంతో, నాకేమీ తెలియదు అన్నట్టుగా పసిపాపల్లా దాన్ని స్వీకరించాలి అని మూలభాషలో అర్థం (cf.1 పేతు.2.2-3). ఇలాంటి వైఖరి ఉన్నవాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడు. ఈ వైఖరి కరువైన క్రైస్తవులు వాక్యాన్ని సరిగా వినలేరు, విన్నా ఏమీ నేర్చుకోలేరు.

వాక్య స్వీకారంలో రెండు విషయాలు ప్రధానం—వినడం, విధేయత చూపడం (యాకో.1.22). “చెప్పడానికే కాదు, వినడానికీ యోగ్యత ఉండాలి” అంటారు ఎ.డబ్ల్యూ.టోజర్. ఎవరైతే తన మీద దృష్టి పెడతారో వారితోనే దేవుడు మాట్లాడతాడు—అంటారాయన. అది నిజమే. దేవుడికి మనకంటే ఎక్కువ ఆత్మ గౌరవం ఉంటుంది. తనను పట్టించుకోని వాడితో ఆయన మాట్లాడడు. “యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు?” అంటున్న కీర్తన కారుని మాటలు వినండి (కీర్త.144:3). ఐతే ఆయన దీనులను లక్ష్యపెడతాడు (కీర్త.138.6). తనకు భయపడే వారిని, తనకు భక్తి చేసే వారిని ఆయన దర్శిస్తాడు, వారితో మాట్లాడతాడు (కీర్త.25.14; 33.19).

వాక్యాన్ని వినే వాళ్ళు దాన్ని శ్రద్ధాసక్తులతో, ఏకాగ్రతతో వినాలి. పరధ్యానంతోనో, పక్క వాళ్ళతో ముచ్చటిస్తూనో వాక్యాన్ని వినకూడదు. సెల్ఫోన్లో చాట్ చేస్తూనో, సోయలేని నిద్రమత్తులోనో వినకూడదు. అలా చేస్తే దేవుడ్ని అవమానపరచినట్టే! వాక్యం పట్ల మన వైఖరి దేవుని పట్ల మన వైఖరికి అద్దం పడుతుంది. వాక్యాన్ని మనం ఎలా వింటున్నాం అన్నది దేవుడ్ని మనం ఎలా గౌరవిస్తున్నాం అన్న దానికి నిదర్శనం (కీర్త.119:57). ఆయన వాక్యాన్ని లక్ష్యపెట్టిన వారికే ఆయన జ్ఞానం అబ్బుతుంది (కీర్త.119:100). ఇతరుల మాటలే కాదు, వాక్యాన్ని వినడానికీ మనం వేగిరపడాలి (యాకో.1.19).

మనం విన్న వాక్యానికి మనం లెక్క చెప్పాలి. ఎంత వింటే అంత లెక్క—అంత జవాబుదారీతనం!

వాక్యాన్ని వింటే సరిపోదు, దానికి విధేయత చూపాలి కూడా. వాక్యం విని, దానికి విధేయత చూపని వాడు తనను తానే మోసం చేసుకుంటున్నాడు—అని నిర్ద్వందంగా చెప్పేశాడు యాకోబు (1.22). రెండు మూడు వారాల క్రితం పాస్టర్ గారు మీకు చెప్పిన వాక్యం మీకు గుర్తుందా అని ఈ మధ్య వెళ్లిన ప్రతీ సంఘంలో ప్రజల్ని ప్రశ్నిస్తూ వచ్చాను. గుర్తుంది—అని గట్టిగా జవాబిచ్చిన క్రైస్తవులు అరుదు! చాలా మందికి లోకం కబుర్ల పైన, భోజనం పైన, సోషల్ మీడియా పోస్టుల పైన, టీవీ సీరియల్స్ పైన ఉన్న ధ్యాస వాక్యం పైన లేదు. ఇలాంటి విషయాలు విన్న వాక్యాన్ని అణచివేస్తాయని ప్రభువు ముందే చెప్పారు (మార్కు 4.18; cf.లూకా 21.34)

విన్న వాక్యం గుర్తుండాలంటే దాన్ని పదే పదే నెమరు వేసుకోవాలి, దినమెల్లా ధ్యానించాలి (కీర్త.119.97). ధ్యానిస్తేనే వాక్యం జీర్ణమవుతుంది. జీర్ణమైతేనే ఆచరణ సాధ్యమవుతుంది. వాక్య ధ్యాస లేని క్రైస్తవుడికి వాక్య ధ్యానం కూడా జరగని పని. వాక్య ధ్యానం చేయనివారికి దాన్ని పాటించడం చేతకాని పని. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి అన్నారు ప్రభువు (యోహా.10.27). వాక్యాన్ని పాటించే వాడే నిజమైన విశ్వాసి (మత్త.7.21).

మనం విన్న వాక్యానికి మనం లెక్క చెప్పాలి. ఎంత వింటే అంత లెక్క—అంత జవాబుదారీతనం! ఎక్కువ తెలిసిన వానికి ఎక్కువ దెబ్బలు—అని మన ప్రభువు చెప్పనే చెప్పారు (లూకా 12:47). ఎంత విన్నాం? ఎంత పాటించాం? ఈ రెంటి మధ్య వ్యత్యాసం పెరిగే కొద్దీ రేపు క్రీస్తు న్యాయ పీఠం ముందు మన దోషం పెరిగిపోతుంది. ఇది భయానకం!

—జీపీ

Previous Devotions