“మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు.”
—మత్తయి 23:10
గురువు పాదాల చెంత…

గురువు పాదాల చెంత…
Tuesday, June 11, 2024
“మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు.”
— మత్తయి 23:10
మన దేశంలో గురు సంప్రదాయం కొత్తేమీ కాదు. అనాది కాలంగా వస్తున్నదే! దైవాన్ని పరిచయం చేసుకోవడానికి, దైవ తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి గురువు తప్పనిసరి అన్నది మన వాళ్ళ నమ్మకం. అంచేత గురువు గారిని దేవుడి స్థానానికి ఎత్తేసి “గురు దేవోభవ” అని మొక్కేసే పరిస్థితీ మన సంస్కృతిలో ఉండనే ఉంది. ఇందుకు భిన్నమైన ప్రబోధం చేస్తున్నారు మన ప్రభువు.
మీరెవరూ మిమ్మల్ని మీరు పైకెత్తేసుకోవద్దు. గురువులని గానీ, బోధకులని గానీ, తండ్రులని గానీ పిలిపించుకోవద్దు. మీలో నాయకుడు సేవకుడిలా ఉండాలి—అని తెగేసి చెప్పేశారాయన (మత్త.23.1-12). నాటి మత నాయకులను ఉద్దేశించి ప్రభువు చెప్పిన ఈ ప్రబోధం నేటికీ వర్తిస్తుంది. ఈ అంశాన్ని మనం మరోసారి మాట్లాడుకుందాం. ఐతే ఇపుడు ఇక్కడ మరో విషయం పైన మనం దృష్టి సారించాలి. అది క్రీస్తు గురుతత్త్వం, మన శిష్యరికం.
క్రీస్తు అందరిలాంటి గురువు కాదు…ఈ గురువు పాదాల చెంత గడిపే శిష్యుడు ఆయన తత్త్వాన్నే కాదు, ఆయన వ్యక్తిత్వాన్నీ పుణికిపుచ్చుకుంటాడు.
ప్రభువు మన గురువైతే, మనం ఆయన శిష్యులం. గురువంటే నేర్పించే వాడు, శిష్యుడు నేర్చుకునే వాడు. గురువంటే జ్ఞానాన్ని అందించే వాడు, శిష్యుడు జ్ఞానాన్ని అర్థించే వాడు. గురువంటే సత్యాన్ని తెలియ చెప్పేవాడు, శిష్యుడు తెలుసుకునే వాడు. గురువంటే శాసించే వాడు, శిష్యుడు శిరసావహించే వాడు. క్రీస్తు మన గురువైతే ఆయనతో మనకున్న సంబంధం ఎలా ఉందో మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. శిష్యులే క్రైస్తవులు (అపో.11.26). శిష్యులు కాని వారు ఆయన వారు కాదు (మత్త.10.37,38).
ప్రభువొక్కడే మన గురువు. ఆయనే పరమ గురువు. ఆయనలాంటి గురువు మరొకరు లేరు. ఇది స్వయంగా ప్రభువే చెప్పుకున్న మాట. ఈ లోకంలో గురువులు దేవుడ్ని పరిచయం చేస్తామని వచ్చిన మానవమాత్రులు. దేవుడే మనిషి కోసం, మానవుడై దిగివచ్చిన దైవ గురువు క్రీస్తు. అందుకే ఆయన లాంటి గురువు లేడు. ఆయన తప్ప వేరొక సత్య గురువు లేడు. మానవమాత్రులు దేవుడ్ని యథాతథంగా పరిచయం చేయలేరు. దేవుడే గురువైనప్పుడు ఆయన నిజంగా మనకు వెలుగునిస్తాడు (యోహా.1.4,9; 12.46). క్రీస్తే దేవుడు (యోహా.1.1,14). ఈ గురువు మన ప్రభువు!
అది గురువు గొప్పతనం. మరి శిష్యుడి బాధ్యత? ఇంత గొప్ప గురువు దగ్గర మనం ప్రతీ దినం ఏం నేర్చుకుంటున్నాం? ఇపుడు క్రైస్తవంలో మార్తలు ఎక్కువయ్యారు. మరియలు తగ్గిపోయారు. ప్రభువు సమక్షంలో కూర్చుని నేర్చుకునే ఓపిక తీరిక మనకు లేవు. ఉద్యోగం, సంపాదన, పిల్లల చదువులు, లోకంలో హోదా, ఇల్లు కట్టుకోవడం, పెళ్ళి చేసుకోవడం… మనం బిజీ. ప్రభువుకు టైం ఇవ్వలేనంత బిజీ. ఇంత బిజీలో కూడా మనం పెళ్లిళ్లకు వెళ్లగలం, వినోదాన్ని ఆస్వాదించ గలం, డైన్ ఔట్ చేయగలం, సోషల్ మీడియాలో ఉండగలం, సెల్ఫోన్ తో గడపగలం… కానీ ప్రభువు పాదాల చెంత కూర్చునే టైం లేదు మనకి. మనం మార్తలాంటి వాళ్ళం. మరియలా ఉండలేం. ఇదే మన వెలితి!
మరియ ప్రభువు పాదాల చెంత కూర్చుండిపోయింది (లూకా 10.39). మార్త అనేక పనులు పెట్టుకుంది(లూకా 10.41). ప్రభువు కోసమే బిజీ అయిపోయింది. కానీ ప్రభువును మిస్ చేసుకుంది. పైగా “నీకైనా చింత లేదా? నువ్వైనా చెప్పు మరియకు” అని ప్రభువునే నిష్టూరమాడింది (లూకా 10.40). ప్రభువంటున్నాడు—మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. మార్త అవసరమైన దాన్ని వదిలి అనేక విషయాల మీద దృష్టి పెట్టింది (లూకా 10.41,42).
క్రీస్తు మన గురువైతే ఆయనతో మనకున్న సంబంధం ఎలా ఉందో మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి.
గురువు పాదాల చెంత కూర్చోవడం, నేర్చుకోవడం ఇదే శిష్యుడి పని. జీవన పోరాటంలో మనం అలుపు లేకుండా పరిగెడుతున్నాం, కొట్టుమిట్టాడుతున్నాం. కానీ క్రైస్తవుడికి ఉత్తమమైంది, అవసరమైంది ఒక్కటే! అది మన ప్రభువుతో గడపడం. ఆయన పాదాల చెంత నేర్చుకోవడం.
శిష్యుడంటే గురువు దగ్గర నేర్చుకునే వాడే కాదు, గురువును అనుసరించేవాడు, అనుకరించేవాడు కూడా (లూకా 9.23; కొల.2.8). మన ప్రభువు ఇతర గురువుల్లాంటి వాడు కాడు. వాళ్ళు చెప్పిందే చేయగలం తప్ప వాళ్ళు చేసింది మనం చేయలేం. వాళ్ళను అనుకరించలేం (మత్త.23.2,3). క్రీస్తు అలాంటి గురువు కాదు. ఆయన వ్యక్తిత్వానికి, ప్రబోధానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ గురువు పాదాల చెంత గడిపే శిష్యుడు ఆయన తత్త్వాన్నే కాదు, ఆయన వ్యక్తిత్వాన్నీ పుణికిపుచ్చుకుంటాడు. “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి” అన్నాడు పౌలు (1 కొరిం.11:1; cf.ఎఫె.5.1).
గురువంటే చీకటిని పారద్రోలి, వెలుగులు విరజిమ్మే వాడు. మన ప్రభువు వెలుగుల వెలుగు, మహా వెలుగు! ఆయన లేకుండా భవిష్యత్తు కానరాదు, బ్రతుకు అర్థం బోధపడదు. క్రీస్తే మన జీవన గమ్యం (కొల.1.16). క్రీస్తే మన జీవన దీపం (2 కొరిం.4.5-6). “నేను సూర్యుడ్ని చూడటమే కాదు. దాని వల్ల అన్నింటినీ చూస్తున్నా. నాకు క్రైస్తవమూ అంతే” అంటాడు కరుడుగట్టిన నాస్తికత్వం నుంచి క్రీస్తు తత్త్వంలోకి వచ్చిన నాటి ఆక్స్ఫర్డ్ మేధావి సి. ఎస్. లూయిస్.
క్రీస్తే మన నీతి సూర్యుడు (మలా.4.2). అస్తమించని అనంత సూర్యుడాయన (ప్రక.22.5). ఈయన మనకు కావాలి. రాబోయే ఆ లోకంలోనే కాదు. ఇప్పుడున్న ఈ లోకంలో కూడా! క్రీస్తు లేకుండా క్రైస్తవం లేదు. ఈ గురువు పాదాల దగ్గర నేర్చుకున్న వాడే శిష్యుడు. గురువుకు శిరస్సు వంచే వాడే శిష్యుడు. గురువును అనుకరించే వాడే శిష్యుడు. శిష్యుడు కాని వాడు, గురువు దగ్గర అనుదినం నేర్చుకోని వాడు క్రైస్తవుడిగా బ్రతకలేడు.
—జీపీ