“మోషే– నీ సన్నిధి రాని యెడల ఇక్కడనుండి మమ్మును తోడుకొని పోకుము.”
—నిర్గమ 33:15

ఆయన సన్నిధిని వెతకండి

“దేవుడి పేరిట చేసే కార్య్రమాల కంటే దేవుడి సన్నిధే ప్రాముఖ్యం”. దేవుడి నామాన్ని రోషంగా ప్రకటిస్తూ, నేటి క్రైస్తవ సంఘ దుస్థితిని ఏడు దశాబ్దాలకు ముందే చెప్పి హెచ్చరించిన దైవజనుడు ఐడెన్ విల్సన్ టోజర్ అన్న మాటలివి. నేటి క్రైస్తవంలో మన కళ్ళెదుట కనబడుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆయన చెప్పిన హెచ్చరికలు మన కోసమే అనిపిస్తుంది. నేటి క్రైస్తవంలో సభల జోరు, సంఘాల్లో కార్యక్రమాల హోరు ఎక్కువయ్యింది. వీటిలో పాల్గొనడమే ఆధ్యాత్మికత అని తలంచే భ్రమలోకి చాలామంది వెళ్ళిపోయారు. చేస్తున్న కార్యక్రమాలు, పెడుతున్న సభలు దేవుని చిత్త ప్రకారమే జరిగిస్తున్నామా, వాటి పైన ఆయన ప్రసన్నత ఉందా అన్న విషయం ఎవ్వరికీ పెద్దగా పట్టట్లేదు. వీటిలో పాల్గొంటే చాలు ఆశీర్వాదం దానంతట అదే వచ్చేస్తుంది అన్నది అనేకుల అపోహ.

ఆయన సన్నిధిని వెతకండి!

Saturday, June 15, 2024

“మోషే– నీ సన్నిధి రాని యెడల ఇక్కడనుండి మమ్మును తోడుకొని పోకుము.”
— నిర్గమ 33:15

“దేవుడి పేరిట చేసే కార్య్రమాల కంటే దేవుడి సన్నిధే ప్రాముఖ్యం”. దేవుడి నామాన్ని రోషంగా ప్రకటిస్తూ, నేటి క్రైస్తవ సంఘ దుస్థితిని ఏడు దశాబ్దాలకు ముందే చెప్పి హెచ్చరించిన దైవజనుడు ఐడెన్ విల్సన్ టోజర్ అన్న మాటలివి. నేటి క్రైస్తవంలో మన కళ్ళెదుట కనబడుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆయన చెప్పిన హెచ్చరికలు మన కోసమే అనిపిస్తుంది. నేటి క్రైస్తవంలో సభల జోరు, సంఘాల్లో కార్యక్రమాల హోరు ఎక్కువయ్యింది. వీటిలో పాల్గొనడమే ఆధ్యాత్మికత అని తలంచే భ్రమలోకి చాలామంది వెళ్ళిపోయారు. చేస్తున్న కార్యక్రమాలు, పెడుతున్న సభలు దేవుని చిత్త ప్రకారమే జరిగిస్తున్నామా, వాటి పైన ఆయన ప్రసన్నత ఉందా అన్న విషయం ఎవ్వరికీ పెద్దగా పట్టట్లేదు. వీటిలో పాల్గొంటే చాలు ఆశీర్వాదం దానంతట అదే వచ్చేస్తుంది అన్నది అనేకుల అపోహ.

దేవుడు తన ప్రజల్ని విడిచి పెట్టి వెళ్ళడం అంత దౌర్భాగ్యం మరొకటి లేదు. ఇది అత్యంత ప్రమాదకరమైన దుస్థితి.

మోషే మనలాంటి వాడు కాడు. అతడికి తన దేవుడి పట్ల భయం, భక్తీ రెండూ ఉన్నాయి. అతనిది స్వశక్తిని నమ్ముకున్న నాయకత్వం కాదు. అతడు తన దేవుడ్ని నమ్ముకున్నాడు. అతనికి తన దేవుడు తెలుసు. ఆయన ఔన్నత్యం తెలుసు. అప్పటికే ఈ దేవునితో అతడు చాన్నాళ్లుగా స్నేహిస్తున్నాడు, సహవసిస్తున్నాడు (నిర్గ.3.1-6; 33.9,11). ఇప్పుడు తన దేవుడ్ని ప్రాధేయపడుతున్నాడు. తనతోనూ, ప్రజలతోనూ దేవుని సన్నిధి తప్పక రావాలని అర్థిస్తున్నాడు. నీ సన్నిధి లేకుండా మమ్మల్ని పంపివేయద్దు అని బ్రతిమాలుకుంటున్నాడు మోషే (నిర్గ.33.12,15). ఎందుకని, మోషే దేవుని సన్నిధి కోసం ఇంతలా తపిస్తున్నాడు? మోషేకి తన దేవుడి విలువ తెలుసు. ఆయన లేకుండా తనకు గానీ, తన ప్రజలకు గానీ విలువ లేదనీ తెలుసు. తమ దేవుడే తమ ప్రత్యేకత. ఆయన లేకుండా తమకంటూ ఏ ప్రత్యేకతా లేదని మోషేకి తెలిసిపోయింది. అందుకే ఈ ప్రయాస, ప్రార్థన.

ఆయన సన్నిధిని వెతకమని దేవుడి మనకు సెలవిస్తున్నాడు (కీర్త.27.8). “నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవముగల దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?” అన్న కీర్తనకారుల మాటలు మనకు స్ఫూర్తిదాయకం(కీర్త.42:2). “నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది” అంటున్న దావీదు మాటలు వినండి(కీర్త. 69:9). ఐనా మనం వాళ్ళలాంటి వాళ్ళం కాదు. మనలో చాలా మందికి మన దేవుడి గురించి తెలుసేమో గానీ దేవుడు స్వయంగా తెలీదు. ఆయనతో స్వానుభవం గానీ, సాన్నిహిత్యం గానీ, ఆయన పట్ల భయభక్తులు గానీ మనలో చాలా మందికి లేవు. అంచేత ఆయన విలువ, ప్రత్యేకత, గొప్పతనం మనకు తెలీదు. అందుకే ఆయన సన్నిధి ప్రాముఖ్యత మనకు అంతగా తెలీదు. కొందరికైతే ఆయన సన్నిధి స్పృహ కూడా లేదు. దేవుడు మనతో లేకుండా ఆయన పేరిట మనం ఏం చేసినా అది చెల్లదు.

ఈ రోజు మన క్రైస్తవంలో పాలరాతి మందిరాలున్నాయి, ప్రభలతో వెలిగే వేదికలున్నాయి, అత్యాధునిక దృశ్య శ్రవణ సామగ్రి, సరంజామా ఉంది. దానికి తోడు అద్భుతమైన గాయకులూ, వాయిద్యకారులూ ఉన్నారు. వింతలూ, విడ్డూరాలూ, విచిత్ర ప్రసంగాలూ చేసే వక్తలూ, ప్రవక్తలూ ఉన్నారు. కానీ మన సభల్లో, సంఘ సమావేశాల్లో, ఆరాధనల్లో దేవుడున్నాడా అన్నదే పెద్ద ప్రశ్న! అదేంటి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు తన నామంలో చేరితే అక్కడ నేనూ ఉంటానని ప్రభువు చెప్పారు కదా (మత్త.18.20) అని మీరనవచ్చు. ఇక్కడ షరతు “ప్రభువు నామంలో చేరడం”. నామమంటే “వ్యక్తిత్వం”. ప్రభువు సౌశీల్యం, స్వభావ స్వరూపాల సమాహారమే ఆయన నామం. అంటే తన స్వభావానికి అనుగుణ్యమైన ప్రవర్తన, ప్రార్థన, పరిచర్య ఉన్న చోటనే ఆయన ఉంటాడు. తన నామానికి భంగం కలిగే చోట ఆయన ఉండడు, ఉండలేడు. ఇజ్రాయెల్ ప్రజలు తన నామ గౌరవాన్ని కించపరిచారు గనుకనే, తన ప్రజలే తనకు అవిధేయత చూపించారు గనుకనే తాను వాళ్ళతో రాను అన్నాడు దేవుడు (నిర్గ.32.35; 33.3).

దేవుడు మనతో లేకుండా ఆయన పేరిట మనం ఏం చేసినా అది చెల్లదు.

మన దేవుడు రోషమున్న దేవుడు (ద్వితి.4.24‘). తనకు గౌరవం దక్కని చోట ఆయన ఉండడు, ఉండలేడు. లవొదికయ సంఘం “నులివెచ్చని జీవితం” ప్రభువుకు నచ్చ లేదు. అందుకే ఆ సంఘం నుంచి ఆయన వెళ్ళిపోయి బయట నిలుచున్నాడు (ప్రక.3.15,16,20). ప్రభువు సన్నిధిని మనం చులకనగా తీసుకోలేం. ఆయన మనల్ని “ఉమ్మి వేసి” వెళ్ళిపోతాడు (ప్రక.3.16). ప్రభువు తమను విడిచి వెళ్లి చాలా కాలమైంది అన్న సంగతి తెలీని దీనావస్థలో ఉన్న లవొదికయ సంఘం లాంటి గుడ్డి సంఘాలు ఈ రోజు అనేకం ఉన్నాయి (ప్రక.3.17). మనం ఎంత త్వరగా కళ్ళు తెరిస్తే అంత మంచిది.

దేవుడు తన ప్రజల్ని విడిచి పెట్టి వెళ్ళడం అంత దౌర్భాగ్యం మరొకటి లేదు. ఇది అత్యంత ప్రమాదకరమైన దుస్థితి. ఈ రోజు క్రైస్తవం లోకంలో తన ప్రత్యేకతను కోల్పోవడానికి కారణం ఇదే. అది తన ప్రభువుకు పెద్ద పీట వేయలేకపోయింది. అది తన ప్రభువు సన్నిధిని మోషే కాంక్షించినట్టు ఆకాంక్షించ లేకపోయింది. “తన ప్రభువే తన ప్రత్యేకత” అని అది గుర్తించ లేకపోయింది (నిర్గ.33.16). లోకానికి వెలుగు చూపాల్సిన క్రైస్తవం ఈ రోజు లోకం వెంట, దాని ఆకర్షణల వెంట పడి పరిగెడుతోంది.

ప్రభువు సాన్నిధ్యాన్ని పోగొట్టుకున్న క్రైస్తవం ఇక లోకంలో తన ప్రత్యేకతను ఎలా చాటుకుంటుంది? స్వకీర్తి కోసం, స్వలాభం కోసం, భౌతిక ఆశీర్వాదాల కోసం పాకులాడే క్రైస్తవం ఈ లోకంలో తన ప్రత్యేకతను ఎలా నిలబెట్టుకుంటుంది? ఇటువంటి క్రైస్తవం ప్రభువు విలక్షణ నామాన్ని అన్యలోకానికి ఎలా చాటి చెబుతుంది?

మనం దేవునితో నిత్య సహవాసం చేయాలనే కదా ఆయన ఈ లోకం లోనికి వచ్చాడు (యోహా.3.16). దేవునితో మన నిత్య సహవాసాన్ని తెగ్గొట్టిన పాపాన్ని (ఆది.3.23,24) దునుమాడాలనే కదా (1 కొరిం.15.55-57) ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపం వల్ల దేవునికి మనకు మధ్య తలెత్తిన వైరాన్ని తొలగించి, క్రీస్తు తన సిలువ బలియాగం ద్వారా ఆయనకు, మనకూ సంధి కుదిర్చింది మనం ఆయనతో నిత్య నివాసం చేయడానికే కదా (కొల.1.19-22). దేవుడు తన ఆత్మను మనకిచ్చి మనలను తన ఆలయంగా చేసుకుంది మనం ఈ లోకంలో సైతం ఆయనతో నిత్యం సహవసించాలనే కదా (1 కొరిం.3.16). ఇటువంటి దేవుడ్ని మనం ఎలా నిర్లక్ష్యం చేయగలం? ఆయన సన్నిధిని మనం ఎలా పోగొట్టుకోగలం? నాటి ప్యూరిటన్ ప్రబోధకుడు జోనాథన్ ఎడ్వర్డ్స్ మాటల్లో చెప్పాలంటే “దేవుడ్ని ఈ లోకంలో ఇంతగా నిర్లక్ష్యం చేసి పై లోకంలో ఆయనతో ఎల్లకాలం జీవిస్తామని అసలు మనం ఎలా అనుకోగలం?”

—జీపీ

Previous Devotions