
ఈరోజు భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో పరిచర్య చేసి, ఇతోధిక సేవలు అందించిన మైల్స్ బ్రాన్సన్ గారు ప్రభువు పిలుపు అందుకున్న రోజు (09-11-1883).
మైల్స్ బ్రాన్ సన్ గారు అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ. అస్సాం పరిసర ప్రాంతాల్లో గుర్తించదగిన పరిచర్య చేసిన ఈయన న్యూయార్క్ రాష్ట్రంలోని హేర్కిమెర్ లో జన్మించారు. మొదటిగా బ్రాన్ సన్ బర్మా దేశానికి మిషనరీగా పంపబడ్డారు. తర్వాత ఈశాన్య భారత గవర్నర్ జనరల్ కు ఏజెంట్ డేవిడ్ స్కాట్ గారి ప్రత్యేక అభ్యర్థన మేరకు 1838లో అస్సాం వెళ్లారు. వస్తూనే అస్సామీ భాషను స్థానిక ట్రైబల్ తెగల భాషలను నేర్చుకున్నారు. స్థానిక ప్రజలకు పాఠశాలలు స్థాపించడం, వారి భాషలో పుస్తకాలు రాయడం చేస్తూనే సువార్త పనిచేసేవారు. ఈయన పరిచర్య ఈశాన్య భారతమంతా, అరుణాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించింది. ఈయన తన తోటి మిషనరీలతో కలిసి అస్సాంలోని సాదియాకు ముద్రణా యంత్రాన్ని కూడా తీసుకువచ్చారు. అస్సాం ప్రజల సంస్కృతి పైన, వారి రాజకీయ అంశాల పైన వారి భాషలో ఎన్నో పుస్తకాలు రాశారు బైబిల్ గ్రంధాన్ని అస్సామీ భాషలో తర్జుమా చేయడం మొదలుపెట్టారు. అస్సామీ-ఇంగ్లీష్ డిక్షనరీని ప్రచురించారు. 1841లో బాలబాలికలకు పాఠశాలను స్థాపించారు. ఉదయం పనులకు వెళ్ళేవారికి వీలుగా సాయంకాలం కూడా పాఠశాలను నడిపేవారు. అస్సామీ సమాజంలో ఎన్నో సామాజిక సంస్కరణలను తీసుకురావడానికి ఈయన ఎంతో కృషి చేశారు.
బ్రాన్ సన్ గారు 1876లో బాధాతప్త హృదయంతో తిరిగి అమెరికా వెళ్లి అక్కడ తన 70వ ఏట యునైటెడ్ స్టేట్స్ లోని మిచిగాన్ లో 1883 నవంబర్ 9న పరమపదించారు.