నేటి విశ్వాస నాయకురాలు.
ఫ్యానీ జాక్సన్ కాపిన్
పరలోక పిలుపు : 21 జనవరి 1913.
మిషనరీ, ప్రిన్సిపాల్, విద్యావేత్త, విద్యా సంస్కర్త

ఫ్యానీ జాక్సన్ కాపిన్ (1837–1913) అమెరికాలో ఉన్న ఆఫ్రికా జాతికి చెందిన ప్రముఖ వున్నత విద్యావేత్త. జాతి, లింగ సమానత్వం కోసం పాటుపడిన న్యాయవాది. ముఖ్యంగా ఆఫ్రికన్-అమెరికన్ మహిళలకు విద్య దాదాపుగా లేని సమయంలో ఈమె అడ్డంకులను బద్దలు కొట్టి, గెలిచిన ధీశాలి. 1865లో ఒబెర్లిన్ కళాశాల నుండి గ్రాడ్యుయేట్ చేసిన మొదటి నల్లజాతి మహిళ. ఉన్నత విద్యలో ఈమే మొదటి మహిళగా చెప్పవచ్చును. ఫిలడెల్ఫియాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ కలర్డ్ యూత్ ప్రిన్సిపాల్గా పనిచేసింది, యునైటెడ్ స్టేట్స్లో మొదటి ఆఫ్రికన్ అమెరికన్ స్కూల్ సూపరింటెండెంట్గా కూడా పని చేశారు. ఈమె దక్షిణాఫ్రికాలో మిషనరీగా సేవ చేశారు. అక్కడ స్థానిక ప్రజలను విద్యతో పురోభివృద్ధి చేయడానికి కృషి చేశారు. ఫ్యానీ జాక్సన్ కాపిన్, మహిళలకూ, వర్ణ వివక్షను ఎదుర్కొన్న సమూహాలకూ మార్గదర్శిగా నిలిచిన ఆదర్శవంతమైన నాయకురాలు.

ఫ్యానీ జనవరి 8, 1837న వాషింగ్టన్, డి.సి.లో బానిసత్వంలో జన్మించారు. చిన్నతనంలోనే, ఈమె ఆంటీ బానిసత్వము నుండి విడిపించి స్వతంత్రరాలుగా చేసింది. జాతి, లింగ వివక్ష తీవ్రంగా పెరిగిన కాలంలో దానిని రూపుమాపటానికి విద్య పురోగతికి సాధనమని గాఢంగా విశ్వసించారు. విద్యను పొందడం కోసం, గృహసేవకురాలిగా పని చేస్తూ తన అవసరాలను తీర్చుకున్నారు. అవకాశం దొరికిన ప్రతి సమయాన్ని ఉపయోగించుకుని చదవడం, వ్రాయడం నేర్చుకున్నారు. ఈ నిరంతర కృషి ఈమె ను ఫిలడెల్ఫియాలో కలర్డ్ యూత్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ బాధ్యతలను చేపట్టే స్థాయికి తీసుకెళ్లింది. తదనంతరం, ఈమె యునైటెడ్ స్టేట్స్లో మొదటి ఆఫ్రికన్-అమెరికన్ పాఠశాల సూపరింటెండెంట్గా చరిత్రలో తన స్థానాన్ని పొందారు. ఫ్యానీ తన జీవితాన్ని విద్యా సాధన ద్వారా వ్యక్తిగత అభివృద్ధి, సమాజాన్ని ఎదుగుదలకు ప్రేరణ కలిగించడానికి అంకితం చేశారు.

1881లో, ఫ్యానీ రెవరెండ్ లెవీ జెంకిన్స్ కాపిన్ను వివాహం చేసుకున్నారు, ఇది ఈమె జీవితంలో మరింత ముఖ్యమైన అధ్యాయాన్ని సూచించింది. తన భర్తతో కలిసి, ఫ్యానీ మిషనరీ కార్యాలలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. 1888లో, ఫిలడెల్ఫియాలోని మదర్ బెతెల్ AME చర్చి మహిళల కమిటీతో కలిసి, ఫ్యానీ నిరాశ్రయ యువతుల కోసం ఒక వసతిగృహాన్ని ప్రారంభించారు. ఫ్యానీ, లెవీ జెంకిన్స్ దంపతులు ప్రభువుకు సేవ చేయడంలో ప్రత్యేకమైన అంకితభావాన్ని పంచుకున్నారు. 1902లో, వారు దక్షిణ ఆఫ్రికాకు ప్రయాణించి మిషనరీ కార్యాలను చేపట్టారు. అక్కడ, విద్యా కార్యక్రమాలను ప్రారంభించడంపై దృష్టి పెట్టి, “బెతెల్ ఇన్స్టిట్యూట్ ” ను స్థాపించారు. ఈ సంస్థ స్థానిక సముదాయాలను అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. అత్యంత ముఖ్యంగా, వారు స్వయం సహాయ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి, వ్యక్తుల్ని స్వయం సమర్థులుగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని సాధించారు. వారి కృషి ద్వారా, అనేక మంది తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకొని ఆత్మస్థైర్యము సాధించగలిగారు.

దాదాపు పది సంవత్సరాల మిషనరీ సేవ చేసిన తరువాత, ఫ్యానీ జాక్సన్ కాపిన్ ఆరోగ్యం క్షీణించడం వల్ల ఫిలడెల్ఫియాకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అక్కడే, 1913 జనవరి 21న ఈమె తుది శ్వాస విడిచారు. అనేక మంది ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ ఫిలడెల్ఫియన్లతో కలిసి, ఈమెను పెన్సిల్వేనియాలోని బాలా సిన్విడ్ వద్ద ఉన్న మెరియన్ మెమోరియల్ పార్క్ లో సమాధి చేశారు. ఈమె మరణానంతరం, ఈమె స్మారకార్థం కొన్ని పాఠశాలలు, అనాథాశ్రమాలు, ఆఫ్రికన్-అమెరికన్ కమ్యూనిటీ కేంద్రాలు స్థాపించబడ్డాయి. ఇవి ఈమె అందించిన సేవల పట్ల గౌరవ సూచకంగా నిలిచాయి, ఈమె ప్రేరణాత్మక జీవితాన్ని స్మరించేటట్లుగా నిర్మించబడ్డాయి.

Leave a comment