
నేటి విశ్వాస నాయకుడు
తిమోతి రిచర్డ్
పరలోక పిలుపు : 17 ఏప్రిల్ 1919
చైనాను మేల్కొలిపిన మిషనరీ, సువార్తికుడు, విద్యావేత్త, సంఘ-సంస్కర్త, రచయిత, అనువాదకుడు, మానవతావాది.
తిమోతీ రిచర్డ్ (1845-1919) చైనాకు వెల్ష్ బాప్టిస్ట్ మిషనరీగా, చైనా ఆధునికీకరణ, చైనీస్ రిపబ్లిక్ పెరుగుదలను ప్రభావితం చేశాడు. రిచర్డ్ మానవతా ప్రయత్నాలలో లోతుగా పాలుపంచుకున్నాడు, ముఖ్యంగా 1876-1879 ఉత్తర చైనీస్ కరువు సమయంలో కరువు నివారణను నిర్వహించాడు. పనికిరాని పురాతన సాంప్రదాయాలైన, ఆడపిల్లల పాదాలు పెరగకుండా చేయడం వంటి పద్ధతులకు వ్యతిరేక ప్రచారాలు, లింగ సమానత్వంతో సహా సామాజిక సంస్కరణల కోసం గొప్పగా వాదించాడు. సాధారణ ప్రజలతో మాత్రమే కాకుండా చైనా మేధావులు, సంస్కర్తలతో కూడా సువార్తను పంచుకోవడంపై దృష్టి పెట్టాడు. ఈయన చైనీస్ తాత్విక, మతపరమైన ఆలోచనలతో ప్రతిధ్వనించే విధంగా క్రైస్తవ సత్యాలను ప్రదర్శించడం ద్వారా సందర్భోచితమైన క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించాడు. విద్య యొక్క ప్రాముఖ్యతను విశ్వసిస్తూ, తైయువాన్‌లో షాంగ్సీ విశ్వవిద్యాలయం స్థాపనను ప్రతిపాదించాడు, దీనిని క్వింగ్ ప్రభుత్వం 1902లో ఆమోదించింది. ఈయన 1912 వరకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ వెస్ట్రన్ స్టడీస్‌కు అధిపతిగా పనిచేశాడు. చైనీస్ సాహిత్యం, సంస్కరణవాద ఆలోచనలకు కూడా దోహదపడ్డాడు. చైనీస్ మేధావులలో ప్రభావవంతమైన ప్రచురణ అయిన “రివ్యూ ఆఫ్ ది టైమ్స్” (వాన్ గువో గాంగ్ బావో)కు అతను రెగ్యులర్ కంట్రిబ్యూటర్. ఈయన రచనలు పాశ్చాత్య, చైనీస్ ఆలోచనలను కలపడంలో సహాయపడ్డాయి. మార్కెట్ ఆర్థికశాస్త్రం, అంతర్జాతీయ చట్టం వంటి భావనలతో పాటు క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించాయి.
రిచర్డ్ 1845 అక్టోబరు 10న సౌత్ వేల్స్, కార్మార్థెన్ షైర్, ఫాల్డిబ్రేనిన్ లో బాప్టిస్ట్ భక్తులైన తిమోతి, ఎలియనోర్ రిచర్డ్ లకు జన్మించెను. ఈయన మిషనరీగా మారడానికి రెండవ ఎవాంజెలికల్ మేల్కొలుపు ప్రేరణతో, 1865లో హేవర్ ఫోర్డ్ వెస్ట్ థియోలాజికల్ కాలేజీలో ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. అక్కడే చైనాకు అంకితమయ్యాడు, ఈయన కొత్తగా ఏర్పడిన చైనా ఇన్‌ల్యాండ్ మిషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు, అయితే హడ్సన్ టేలర్ డినామినేషన్ బాప్టిస్ట్ మిషన్లకు రిచర్డ్ మెరుగైన సేవను అందించగలడని భావించాడు. 1869లో బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ రిచర్డ్ దరఖాస్తును అంగీకరించి, షాన్డాంగ్లోని యంటైకి పంపించారు.
1897లో రిచర్డ్ భారతదేశంలో క్రైస్తవ మిషన్ పరిస్థితులను తెలుసుకోవడానికి యువ మిషనరీ, ఆర్థర్ గోస్టిక్ షోరోక్తో కలిసి ఒక యాత్రను చేపట్టారు. వీరు సిలోన్, మద్రాస్, ఆగ్రా, బెనారస్, ఢిల్లీ, కలకత్తా, చివరగా బొంబాయిని సందర్శించి, తిరిగి చైనాకు చేరుకున్నాడు. బాక్సర్ తిరుగుబాటు సమయంలో తైయువాన్ ఊచకోత తర్వాత క్వింగ్ ప్రభుత్వానికి సహాయం చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించాడు. కరువు సహాయక చర్యలను నిర్వహించడానికి చైనా అధికారులతో కలిసి పనిచేసి, వేలాది మంది ప్రాణాలను కాపాడాడు. ఈ ఆచరణాత్మక సేవ ఈయనకు చైనా ప్రజలు, అధికారులలో లోతైన గౌరవాన్ని సంపాదించిపెట్టింది. ఈయన క్రైస్తవ బోధనతో పాటు సైన్స్, పాశ్చాత్య జ్ఞానం, నైతిక విద్యను ప్రోత్సహించాడు. అంతేకాకుండా పాశ్చాత్య తత్వశాస్త్రం, ఆర్థికశాస్త్రం, రాజకీయ ఆలోచనలను చైనీస్ పాఠకులకు అందుబాటులోకి తెచ్చే రచనలను అనువదించడం, వ్రాయడం ద్వారా తూర్పు, పడమరలను కలపాలని కోరుకున్నాడు. ఈయన ప్రగతిశీల క్వింగ్ అధికారులు, ఆలోచనాపరులకు సలహాదారుగా వ్యవహరించాడు.
రిచర్డ్ లండన్ లో మరణించగా, గోల్డర్స్ గ్రీన్ శ్మశానవాటికలో ఖననం చేశారు. అక్కడ చైనీస్ భాషలో చెక్కబడిన స్మారక పలకను ఉంచారు, చైనా ప్రజలతో ఈయనకున్న లోతైన సంబంధాన్ని గౌరవిస్తుంది. ఈయన ఆత్మకథ, “చైనాలో నలపై ఐదు సంవత్సరాలు” శీర్షిక మీద మరణానంతరం ప్రచురించబడింది.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.