సాధు సుందర్ సింగ్ (1889-1929) సిక్కు మతంలో పుట్టి యేసుక్రీస్తును స్వీకరించి, ప్రముఖ క్రైస్తవ మిషనరీగా మారిన ఈయన భారతదేశ క్రైస్తవులకు సుపరిచితులు. భారతదేశపు సాధు మిషనరీ, ఆత్మీయ సువార్త జ్వాల, క్రీస్తుతో నడిచిన యాత్రికుడు. ప్రపంచ వ్యాప్తంగా గౌరవించబడిన క్రైస్తవ నాయకుడు, ఆత్మీయ దివ్యానుభవాలు కలిగినవాడు, భారతీయ సాంప్రదాయ బోధకుడు, రచయిత.

నేటి విశ్వాస నాయకుడు
సాధు సుందర్ సింగ్
పరలోక పిలుపు : 19 ఏప్రిల్ 1929 (?)
భారతదేశపు సాధు మిషనరీ, ఆత్మీయ సువార్త జ్వాల, క్రీస్తుతో నడిచిన యాత్రికుడు. ప్రపంచ వ్యాప్తంగా గౌరవించబడిన క్రైస్తవ నాయకుడు, ఆత్మీయ దివ్యానుభవాలు కలిగినవాడు, భారతీయ సాంప్రదాయ బోధకుడు, రచయిత.

సాధు సుందర్ సింగ్ (1889-1929) సిక్కు మతంలో పుట్టి యేసుక్రీస్తును స్వీకరించి, ప్రముఖ క్రైస్తవ మిషనరీగా మారిన ఈయన భారతదేశ క్రైస్తవులకు సుపరిచితులు. ముఖ్యముగా, సువార్త నిషేదిత దేశాలైన టిబెట్, నేపాల్ వంటి దుర్భర ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ రక్తము కారుచున్న పాదములతో, అననుకూల వాతావరణంలో కూడా పరిచర్య చేసిన గొప్ప సువార్తికుడు. ఈయన హిమాలయాలలో మొత్తం కాలినడకన చేసిన సేవ ఎంతో ఘనమైనది. కరడు గట్టిన బౌద్ధ సన్యాసిలకు, హిందూమత వాదులకు నేర్పుగా బోధించెడివాడు. ఈయన జైలులో వేయబడిన సందర్భాల్లో కూడా పౌలు, సీల వలె ప్రార్థనలు, పాటలతో ఇతర ఖైదీల జీవితానికి ధైర్య మిచ్చేవారు. అనేక సార్లు ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, క్రైస్తవ విశ్వాసాన్ని ఏమాత్రము విడువలేదు. తన సేవా ప్రయాణాలలో భారతదేశమే కాకుండా, యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, చాలా దేశాల్లో కూడా అదే వస్త్రధారణతో సువార్తను ప్రకటించారు. “క్రీస్తు తప్ప నాకు ఈ లోకంలోనిది ఏదియు అక్కరలేదు” అని జీవించారు. దేవుని ప్రేమను పంచుట, ప్రభువు నామములో అనేక స్వస్థతలు, అద్భుతములు చేయుట ద్వారా అనేకులను ప్రభువు వైపుకు నడిపించెను. ఈయన సువార్త ప్రసంగములు సులభ శైలిలో, అర్థవంతమైన ఉపమానములతో ఉండెడివి. ప్రభువు ఈయన ద్వారా జరిగించిన అద్భుతములు అనేకం, గొప్ప సువార్త భారంతో సంపాదించిన ఆత్మలు అనేకం. ఈయన తీవ్రమైన అస్వస్థతకు గురై, హిమాచల్ ప్రదేశ్ లో విశ్రాంతి తీసుకొనే కాలములో పుస్తకములు కూడా రచించిరి.

సాధు సుందర్ సింగ్ 1889 సెప్టెంబర్ 3న పంజాబ్ రాష్ట్రంలోని రాంపూర్ గ్రామంలో సంపన్న నిష్ఠ సిక్కు కుటుంబంలో కనిష్ఠుడుగా జన్మించెను. ఈయన తండ్రి సర్దార్ షేర్ సింగ్ గొప్ప భూస్వామి. ఈయనను ప్రేమించే తల్లి చిన్నప్పుడే చనిపోయెను. బాల్యంలోనే మత గ్రంధములను నేర్చుకున్నాడు. ఈయన క్రైస్తవ పాఠశాలలో చదువుతున్నప్పటికీ, ఈయనకు క్రైస్తవ మతంపై ఉన్న ద్వేషంపై, విద్యార్థులకు నాయకుడుగా వారిని రెచ్చగొట్టుచు, బైబిల్ ను, టీచర్ దగ్గర తీసుకొని, ఆమె ఎదురుగుండానే కాల్చివేసెను. అయితే ఆ దినము నుండి మనశ్శాంతి కరువై, ఒకరోజు వేకువజామునే తన గదిలో, తనకు తెలిసిన దేవుళ్లందరికి ప్రార్ధించినా ఫలితము లేని కారణాన, ఆత్మహత్య చేసుకోటానికి తీర్మానించుకొని, చివరగా దేవుడంటూ ఒకడుంటే కనిపించమని పట్టుదలగా ప్రార్ధించగా, ప్రభువైన యేసుక్రీస్తు, పౌలు గారిని దర్శించిన రీతిగా, ఒక వెలుగు ఈయన చుట్టూ ప్రకాశించగా, ఆయన రెండు హస్తములు చాచి, “ప్రియుడా, నీకొరకు నాప్రాణము పెట్టితిని, నీవేల నన్ను హింసించు చున్నావు”, అని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఆరోజు 1904 డిసెంబర్ 18. ఈయన చేసిన ప్రార్థనకు జవాబుగా ప్రభువే ప్రత్యక్షంగా వచ్చి జవాబిచ్చినందుకు, అత్యానందభరితుడై, యేసుక్రీస్తే నిజమైన రక్షకుడని అందరకి బహిరంగముగా సాక్ష్యమిచ్చుచుండెను. ఈ పరిస్థితిని చూచి మొదటిగా పట్టించుకోని ఈయన తండ్రి, ఎన్నో కష్టములు పెట్టిరి, చనిపోవలెనని విషపూరిత ఆహారము పెట్టిరి, ఈయన ప్రభువు కృపతో అన్నిటిని అధిగమించుటవలన, జీర్ణించుకోలేని ఈయన తండ్రి ఇంటినుండి బహిస్కరించెను. దేవుని యందు విశ్వాసముంచిన సుందర్ సింగ్, ఈలోక భోగ భాగ్యాలన్నీ త్యజించి, అప్పటినుండి క్రీస్తు సాక్షిగా, తన తలపాగా తీసివేసి, వెంట్రుకులను కత్తిరించుకొని, సువార్త ప్రకటించే తీర్మానంతో, తన 16వ పుట్టిన రోజున బహిరంగంగా క్రైస్తవ్యమును స్వీకరించి బాప్తిస్మం తీసుకొనెను. భారతీయుడు క్రైస్తవ్యములోకి మారాలంటే, వారి మఠాధిపతులు ధరించే సాధు సాంప్రదాయ వస్త్రములను ధరించుట మంచిదన్న గ్రహింపుతో, 1906లో తనను తాను సాధు సుందర్ సింగ్ గా గుర్తించ బడ్డాడు. ఇంతే కాకుండా సాధుగా కనిపించే ఈయన ముఖములో క్రీస్తుప్రేమ, దీనత్వము, తేజస్సు కనిపించేవి. ఇంకా అనేకులు ఈయనలో క్రీస్తును చూచుచుండెడివారు.

ఈయన ప్రారంభ పరిచర్యలో భాగంగా, భారమైన హృదయముతో సువార్త ద్వారములు మూయబడిన టిబెట్, నేపాల్ లలో బౌద్ధుల మధ్య సువార్త ప్రకటించవలెనని, “యేసుతో వెళ్లనే తీర్మానించితిని, వెనుదీయను; లోకము నా వెనుక, సిలువ నా ముందు, యేసుతో వెళ్లనే తీర్మానించితిని, వెనుదీయను” అని సంతోషముగా పాడుచూ, తనతో బైబిలు, నల్లటి దుప్పటి మాత్రమే, కాళ్లకు జోళ్లుకూడా లేకుండా రాళ్ళల్లో, మంచు గడ్డల మీద నడచుకుంటూ సువార్త ప్రకటించుటకు టిబెట్టుకు వెళ్లెను. అక్కడ ఈయన ప్రకటించే క్రీస్తు ప్రేమను అర్ధం చేసుకోలేని మూర్ఖమైన ప్రజలు ఈయనను ఎన్నో కష్టములు, ఎదిరింపులు, ప్రాణాపాయములు కలిగించినను యేసువైపు చూచుచూ ముందుకు సాగెను. మరణ శిక్షగా పాడుబడిన నూతిలో పడవేసి, పైమూతలు బిగించినను ప్రభువే ఆశ్చర్యరీతిగా తప్పించెను. అలాగే సువార్త నిషేధింపబడిన నేపాల్ లో ఇదే కారణంతో జైలులో ఉన్నప్పుడు తోటి ఖైదీలకు సువార్త చెప్తున్నాడనే కారణంతో భయంకరమైన చిత్రహింసలకు గురిచేసితిరి. ఎటువంటి పరిస్తితులోనైనా ప్రభువునందు ఆనందించడమే ఈయనకు తెలిసిన దైవ రహస్యం. ఇదే ప్రశ్న ఈయనను అడుగగా, “నా శ్రమలలో, నా భాదలలో క్రీస్తు శిలువే నాకు ఆదరణ, నిరీక్షణ” అని చెప్పెడివాడు. ఇంకా నాయేసు నాకొరకు సిలువ శ్రమలను సహింపగా, నా యేసు కొరకు ఆత్మలను సంపాదించుటకై ఈ శ్రమలు ఎన్నతగినవి కావని చెప్పెడివాడు.

సాధు సుందర్ సింగ్ టిబెట్ ప్రాంతంలో సువార్త ప్రచారం కోసం వెళ్లి, అక్కడే అదృశ్యమయ్యారు. ఈయన మరణం గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ, 1929, ఏప్రిల్ 19 నుండి ఈయనను ఎవరూ చూడలేదు. “క్రీస్తును లోకానికి ప్రకటించుటయే నాద్యేయం” అనే తీర్మానంతో చివరివరకు పయనించెను. ఈయన జీవితములో చిన్నతనమునుండి పరిచర్య చేయుటవలన 23 సంవత్సరాల సేవా జీవితము అత్యంత గుర్తింపు గలదై క్రైస్తవులకు, మిషనరీలకు ప్రేరణగా నిలిచింది. ఈయనకు ముందుగానే తెలిసి అన్ని సిద్ధపరచి, తానూ సిద్ధపడినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తుంది.

జాన్ మైఖేల్, రాజమండ్రి.

Leave a comment