ప్రొఫె.ప్రకాష్ గంటెల, గుంటూరు (ఆంధ్ర ప్రదేశ్) వాస్తవ్యులు. తన పద్నాల్గవ ఏట ఒక వి.బి.యెస్. (సండే స్కూల్) లో ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో వెనుక బడి మళ్లీ తన ఇరవై ఒకటో ఏట ప్రభువుకు పునః సమర్పించుకున్నారు. 1992 మే నెలలో ప్రభువు పిలుపు మేరకు సేవకు వచ్చారు. మొదట భారతీయ విద్యార్థి సువార్త సమాఖ్యలో పని చేస్తూ కళాశాల విద్యార్థులకు క్రీస్తు సువార్త ప్రకటించడంలో దాదాపు ఇరవై ఏళ్ళు శ్రమించారు. పదమూడున్నర ఏళ్లు ఆ సంస్థ పత్రిక ‘విద్యార్థి జ్వాల’కు ఎడిటర్ గా పనిచేశారు. ఈ కాలంలోనే తెలుగు క్రైస్తవులను జాగృతం చేసి, వారిని వాక్యంలో విద్యావంతుల్ని చేసే వందల వ్యాసాలు రచించారు, అనువదించారు, సంపాదకీయాలూ రాశారు.

ఆ తర్వాత తాను మారుమనస్సు పొందిన సంఘంలో కొన్నేళ్ళ పాటు సండే స్కూల్, యువజన సేవలో ఉంటూనే పెద్దలకు వాక్య పరిచర్య చేశారు. అదే సమయంలో “రవి జకరియస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్” లో కొంత కాలం జాతీయ ఫ్యాకల్టీగా పని చేశారు.

నాస్తికులు, అన్య మత గురువులు, పండితులతో చర్చల్లో పాల్గొని, క్రైస్తవ విశ్వాసం పక్షాన వాదించారు. జన విజ్ఞాన వేదిక, ఇతరత్రా నాస్తికులతో సైతం తలపడి ఆస్తిక విశ్వాసాన్ని ధీటుగా సమర్ధించారు. క్రైస్తవేతర విశ్వాసులతో, నాస్తికులతో స్నేహ పూర్వక చర్చలు చేయడానికి స్థాపించిన “క్రిస్టియన్ థింకర్స్ ఫోరమ్” కు వీరు సహ వ్యవస్థాపికులుగా ఉన్నారు.