
అద్వితీయ ప్రేమ!
Monday, May 6, 2024
“నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.”
— ద్వితి. 6:5
ఈ మధ్య ఓ నాస్తిక శిఖామణి “దేవుడు ప్రేమోన్మాది” అన్నాడు. నన్నే ప్రేమించు, నాకన్నా ఎక్కువగా ఎవర్నీ ప్రేమించకు అనడం ఉన్మాదం కాక మరేంటి—అన్నది అతని వాదన. ఓ పక్క దేవుడే లేడంటూ మరో పక్క ఆయన్ని తిట్టడం ఎంత హాస్యాస్పదం! లేని దేవుడ్ని ఎలా తిడతావయ్యా “హేతు వాదీ”! నీ తిట్లు నిజమైతే దేవుడు ఉన్నట్టే కదా సామీ!
దేవుడెవరో తెలీక, ఆయన ఔన్నత్యం తెలీక మాత్రమే ఇలా మాట్లాడుతుంటాం. దేవుడ్ని ప్రేమించడానికి కనీసం రెండు కారణాలున్నాయి.
ఒకటి, ఆయన మనందరి ప్రేమకు అర్హుడు. మన సర్వోత్కృష్ట ప్రేమకు అర్హుడు. ఆయన మాత్రమే అటువంటి ప్రేమకు అర్హుడు. ఎలక్షన్లలో అభ్యర్థి నాకు ఓటేయండి అని అడుగుతాడు. ఎందుకు ఓటేయాలి? అతనికేదో అర్హత ఉండాలి. అతడు మనకేదో చేస్తాడన్న నమ్మకం ఉండాలి. సదరు నాస్తికుడు కూడా ఫేస్బుక్ లో తాను రాసిన ఒక కవితో, గీసిన ఒక బొమ్మో, చేసిన ఒక వీడియోనో పెట్టి లైక్ చేయండి అంటాడు. ఎందుకు లైక్ చేయాలి? అతనిలో మనం అభినందించే విషయం ఏదో ఉండటం వల్ల, అది మనకు నచ్చడం వల్ల! మనకే ఇంత ఉంటే మనందరి సృష్టి కర్తకు ఎంత ఉండాలి?
నన్ను పరిపూర్ణంగా ప్రేమించండి అని దేవుడు చెప్పక ముందు తాను “అద్వితీయుడు” అని చెప్తున్నాడు (ద్వితి. 6.4). “అద్వితీయత” అంటే మరొకటి లేదు అని అర్థం. దేవుడంటూ ఉంటే ఆయన అనంతుడై తీరాలి. పదార్థాన్ని సృష్టించనూ లేమూ, వినాశనం చేయనూ లేము—అన్న సైన్స్ నియమం మన పరిమిత తత్త్వాన్ని ఎత్తి చూపుతోంది. మరి పదార్థం ఎలా పుట్టింది? అందుకే అనంతుడైన దేవుడు ఉండి తీరాలి. అటువంటి దేవుడే సర్వాన్నీ సృష్టించ గలడు, వినాశనం చేయనూ గలడు. అనంతం ఒక్కటే, రెండు అనంతాలు ఉండవు కదా! దేవుడు ఒక్కడే!
ఆ అద్వితీయ దేవుడ్ని మనం అద్వితీయంగానే ప్రేమించి తీరాలి. అంటే అలా మరెవ్వరినీ, మరి దేన్నీ ప్రేమించ కూడదన్న మాట! ఎందుకు? దేవుడి అర్హత అలాంటిది మరి! మన ప్రేమ సంబంధాల్లో పలు రకాల ప్రేమలుంటాయి. అవన్నీ ఒకటి కాదు. చెలిని ప్రేమించినట్టు చెల్లిని ప్రేమించలేం. అర్థాంగిని ప్రేమించినట్టు అమ్మను ప్రేమించలేం. పక్కింట్లో ఒక అందమైన స్త్రీ ఉంటే మనకు చెల్లి ఉన్నా ఆమెని చెల్లిగా ప్రేమించ వచ్చు. మనకు కూతురు ఉన్నా ఆమెని కూతురిగా ప్రేమించ వచ్చు. మనకు తల్లి ఉన్నా ఆమెను తల్లిగా ప్రేమించ వచ్చు. కానీ, మనకు భార్య ఉండగా పక్కింటావిడ్ని భార్యగా ప్రేమించ కూడదు. అది అపచారం! భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ ప్రత్యేకం. అది అద్వితీయ ప్రేమ. దేవుడికి మనం ఇవ్వాల్సిన ప్రేమ అంతకంటే అద్వితీయంగా ఉండాలి. ఎందుకంటే ఆయనలాంటి వాడు మరొకడు లేడు! దైవ భక్తి ఎప్పుడూ అత్యున్నతంగా, అద్వితీయంగా ఉండాల్సిందే. అపుడే అది “భక్తి” అనిపించుకుంటుంది!
దేవుడ్ని ఎలా ప్రేమించాలో చూశాం. దేవుడ్ని ఎందుకు ప్రేమించాలో కూడా చూద్దాం. ఒకరిలో కాస్త ప్రత్యేకత కనబడగానే ప్రేమలో పడుతుంటాం. మరి సాటిలేని అద్వితీయత ఉన్న దేవుడ్ని ప్రేమించకుండా ఎలా ఉండగలం? దేవుని అద్వితీయతను ఎరిగిన వాడు ఆయన్ను అభినందించకుండా, ఆరాధించకుండా ఉండలేడు. ఆయన్ని తెలుసుకునే కొలదీ ఆయనతో ప్రేమలో పడతాం.
ఆయన మన సృష్టి కర్త. ఆయన లేకుండా మనం లేం. “…. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు”(యోహా.1:2-3). ఆయన ఎల్లపుడూ ఉండే వాడు (నిర్గమ 3.14). అనంతుడికి ఆద్యంతాలు లేవు. ఆయన ఉనికి ఏ ఉనికి పైనా ఆధారపడదు. కానీ, ఆయన లేకపోతే మరేదీ లేదు, మనం కూడా లేం. ఆయన మన ఉనికికి కారణభూతుడు! “ఆయన …సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. …సర్వమును ఆయన యందు సృజింప బడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు”( కొలసీ 1:15-17). అందుకే ఆయన మన అద్వితీయ ప్రేమకు అర్హుడు!
ఆయన మన సృష్టి కర్త మాత్రమే కాదు. మన మనుగడకూ మూలాధారమైన వాడు. ఆయన లేకుండా మనం బ్రతికి బట్ట కట్టలేం. “ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు…”(అపో.17:25). మనిషి రొట్టె వల్ల మాత్రం జీవించడని, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడని ఇజ్రాయెల్ ప్రజల నలభై ఏళ్ళ అరణ్య వాసం నిరూపించింది (ద్వితి.8.3; మత్త.4.4). ఆయనే మన పోషకుడు (మత్త.6.25-34). ఆయన సర్వ మానవాళిని ఏక రీతిగా పోషిస్తాడు (మత్త.5.45).
అందువల్ల ఆయన్ను మనం ప్రేమించి తీరాలి. మన ప్రేమకు ఆయన అర్హుడు!
ఇలాంటి దేవుడ్ని మనం పాపంతో ధిక్కరించి, ఆయనకు దూరమైతే మనల్ని వెతుక్కుంటూ వచ్చి (లూకా 19.10) మనల్ని పాప విముక్తుల్ని చేయడానికి సిలువలో ప్రాణం పెట్టాడు (మార్కు 10.45) క్రీస్తు. ఆయన మన ప్రాణాల్ని కాపాడే వాడే కాదు. మన కోసం ప్రాణం పెట్టిన వాడు కూడా! (యోహా.10.11,15; 15.13).
ఇలాంటి దేవుడు మరెక్కడైనా ఉన్నాడా? లేనే లేడు! ఈ విషయంలోనూ ఆయన అద్వితీయుడే! అందుకే మన అద్వితీయ ప్రేమకు ఆయన మాత్రమే అర్హుడు! ప్రాణమిచ్చిన దేవుడ్ని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించి, ఋణం తీర్చుకోవడం కన్నా మరేం చేయగలం? (లూకా 14.25; మత్త.10.37-39).
రెండు, దేవుడ్ని ప్రేమించడం మన అవసరం! మనిషి ప్రేమ జీవి. ప్రేమించకుండా, ప్రేమ పొందకుండా ఉండలేడు. ప్రేమ అతనికి ప్రాణ వాయువు లాంటిది. అందుకే ప్రేమ కోసం అంతగా తపిస్తాడు. ప్రేమ కరువైతే ప్రాణం తీసుకోవడానికైన సిద్ధపడతాడు. మనం ప్రేమ పిపాసులం! ఐతే ప్రేమ ఎక్కడ పుట్టింది? దాని పుట్టుక మూలాలేంటి? జీవ పరిణామం వల్ల పుట్టిందా? పదార్థం నుంచి పదార్ధేతర ప్రేమ పుడుతుందా? ప్రేమికుడు లేకుండా ప్రేమ ఎలా పుడుతుంది? అన్నిటికంటే ముందున్న వాడు దేవుడు. ఆయనే ప్రేమకు మూలం(1 యోహా. 4.7,8). ఆయనే మొదటి ప్రేమికుడు. ఆయన అనంత ప్రేమికుడు! ఆయన పోలికలో పుట్టాం గనుకనే మనం ప్రేమికులమయ్యాం.
దేవుడు మానవ ప్రేమకు మూలాధారమైతే ఆయన మన ప్రేమ సంబంధాలన్నిటికీ మూలాధారం (ఎఫెసీ 3.14). అంటే, మొదట దేవుడ్ని సరిగా ప్రేమించకుండా మరెవరినీ సరిగా ప్రేమించలేం. అందుకే ప్రభువు మన తల్లిదండ్రుల కంటే, అక్క చెల్లెళ్ల కంటే, అన్న దమ్ముల కంటే, చివరికి మన ప్రాణం కంటే ఆయన్ని ఎక్కువగా ప్రేమించమన్నాడు. ఇది ఆయన స్వార్థం కాదు, మన అవసరం! అలా ఆయన్ను ప్రేమించినపుడే మనం ఇతరుల్ని ప్రేమించేంత, మనల్ని మనం ప్రేమించుకునేంత ప్రేమకు నోచుకోగలం(1 యోహా. 4.7,8).
మన జీవితాలు ప్రేమ రాహిత్యంతో కొట్టుమిట్టాడుతున్నపుడు క్రీస్తు దిగివచ్చి, సిలువలో తన అనంత ప్రేమను ఆవిష్కరించాడు (1 యెహా. 4.9-11). ఆయన సిలువ త్యాగం నిస్వార్థ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం! ఆయన సిలువ ప్రేమను ఆస్వాదిస్తే తప్ప, ఆయన పాదాల చెంత ఆ ప్రేమను నేర్చుకుంటే తప్ప మనం మన ప్రేమ సంబంధాల్లో రాజ్యమేలుతున్న స్వార్థాన్ని పారద్రోలడం సాధ్యం కాదు. ఆయన్ని “పరిపూర్ణంగా” ప్రేమించిన నాడే మనం మన ప్రేమ సంబంధాల్లో “పరిపూర్ణత”ను చవిచూస్తాం. దేవుడ్ని ప్రేమించడం మనిషి అవసరం!
—జీపీ