అపవాదికి భయపడకండి!
Thursday, May 16, 2024
అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.
— 1 యోహా. 3.8
మన దేశం మూఢ నమ్మకాలకు పెట్టింది పేరు. తుమ్మితే అనర్థం, నల్ల పిల్లి ఎదురైతే అనర్థం, నర దిష్టి అనర్థం, ఇంట గోళ్ళు కత్తిరిస్తే అనర్థం, నోట “చావు” అంటే అశుభం, మంగళవారం అశుభం, నల్లరంగు అశుభం, అమావాస్య అశుభం, వితంతువు ఎదురొస్తే అశుభం, బుధవారం ఆడపిల్ల పుడితే అరిష్టం, కాకి తల మీద తన్నితే అరిష్టం, బల్లి మీదపడితే అరిష్టం, ఇలా ఒకటేమిటి, అనేకమైన మూఢ నమ్మకాలు మన తెలుగు రాష్ట్రాల్లో రాజ్యమేలుతున్నాయి. ఈ మూఢ నమ్మకాల వల్లనే అనేక భయాల్లో మనవాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దుర్ముహూర్త భయం, వాస్తు భయం, దిష్టి భయం, జాతకాల భయం, చేత బడి భయం, క్షుద్ర పూజల భయం. అన్నింటికీ మించి మరణ భయం!
ఇలాంటి సమాజంలో, సంస్కృతిలో పుట్టి పెరిగిన క్రైస్తవులకు ఈ మూఢ నమ్మకాలూ, వాటితో పాటు వచ్చి పడ్డ పిచ్చి భయాలూ సహజంగానే అంటుకున్నాయి. క్రీస్తులోకి వచ్చాక కూడా వీటి గుప్పిట్లో నుంచి వాళ్ళు బయట పడలేక పోతున్నారు. దానికి తోడు పాస్టర్లు సైతం వీటిని ఖండించట్లేదు సరికదా, కొందరైతే వీటిని ఇంకా పెంచి పోషించి, వాటి కోసం ప్రత్యేక ప్రార్థనలూ చేస్తున్నారు. ఇది వాక్య విరుద్ధం, ఘోరం, గర్హించతగ్గ విషయం!
మీరు నా వాక్యంలో నిలిస్తే, సత్యాన్ని తెలుసుకుంటారు, అపుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది—అన్నారు ప్రభువు (యోహా.8.31,32). వాక్య అజ్ఞానం అనేకమంది క్రైస్తవుల్ని ఇంకా మూఢ నమ్మకాల బానిసత్వంలో ఉంచేసింది. తమ ప్రభువు నరావతారంలో, సిలువలో, పునరుత్థానంలో ఏమి సాధించాడో వాళ్లకు అర్థం కాలేదు. క్రీస్తు అపవాదిని ఓడించాడని, వాడి శక్తుల్ని తుత్తునియలుగా చేశాడని వాళ్లింకా తెలుసుకోలేదు.
మన ప్రభువు అపవాది క్రియలను లయం చేయడానికే వచ్చాడు. ఆయన అపవాది సంబంధిత “ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను”(కొల.2.15). ఆయన అపవాదిని నాశనం చేయడానికి మరణంలోకి ప్రవేశించి దాన్ని గెలిచాడు (హెబ్రీ 2.14). ఆయన తన పునరుత్థానంలో అపవాది బలాన్ని తుంచేసాడు. ఆయన సాతాను బంధకాల నుండి అనేకులను విడిపించిన వాడు (లూకా 13.16; అపో.10.38). మన ప్రభువైన యేసు సాతాను సంబంధిత ధర్మవిరోధిని తన నోటి ఊపిరితో సంహరిస్తాడని, తన రాకడ వెలుగుతో నాశనం చేస్తాడని రాయబడింది (2 థెస్స. 2:8).
క్రీస్తు చేతిలో ఓడిన అపవాదితో మనం పోరాడుతున్నాం (ఎఫే.6.12). క్రీస్తు సాధించిన విజయంలో నిలబడి మనం పోరాడుతున్నాం (రోమా.8.31,37). అపవాది శక్తిమంతుడే కానీ క్రీస్తు వాడ్ని ఓడించాడు. ఆయన సర్వ శక్తిమంతుడు. ఆ సర్వ శక్తిమంతుడు మనలో నివసిస్తున్నాడు, మన పక్షాన ఉన్నాడు (1 యోహా.4.4; రోమా 8.31). అంచేత అపవాదికి, వాడి శక్తులకు క్రైస్తవులు భయపడ కూడదు. వాడికి చోటిస్తేనే వాడు మనల్ని కబళిస్తాడు (ఎఫే.4.27). వాడు ఓడిన వాడు, నిరాయుధుడు (కొల.2.15). వాడి గురించి జాగ్రత్త పడాలి (1 పేతురు 58). వాడ్ని ఎదిరించాలి (ఎఫే.6.11; యాకో.4.7). అంతేగానీ, వాడికి భయపడ కూడదు. మనం పిరికితనం ఉన్న ఆత్మను పొందలేదు. శక్తిగల ఆత్మను పొందాం(2 తిమో.1.7).
దయ్యాలు ఆయన్ను చూసి వణుకుతాయి (యాకో.2.29: లూకా 4.34). క్రీస్తును గుండె గుడిలో ఉంచుకున్న వాడిని చేతబడి ఏమీ చేయలేదు. మరే క్షుద్ర శక్తికీ అతడు జడియనక్కర్లేదు. క్రైస్తవుల దేవుడు మరణాన్ని జయించిన దేవుడు. ఏ వాస్తు దోషం వారిని తాకలేదు. మన దేవుడు కాలాన్ని చీల్చిన కాలాధీశుడు ( 1 తిమో.1.17). మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి (కీర్త.31.15). ఏ కాలదోషం, ఏ దుర్ముహూర్తం మనల్ని నాశనం చేయలేదు. ఆయన సూర్యచంద్ర నక్షత్రాదుల్నీ, గ్రహాల్నీ సృష్టించిన దేవుడు (అపో.17.24; యోహా.1.3), వాటిని తన చెప్పుచేతల్లో ఉంచుకుని, నిర్వహించే వాడు (హెబ్రీ 1.3; కొల.1.15-17). ఏ గ్రహ దోషం మనల్ని పట్టి పీడించ లేదు. ఏ జాతకాలూ మన బ్రతుకుల్ని మార్చలేవు, క్రీస్తు తప్ప!
మనం అపవాదికీ, వాడి దూతలకూ భయపడనక్కర్లేదు. వాళ్ళ కోసం అమావాస్య ప్రార్థనలు చేయనూ అక్కర్లేదు. క్రీస్తు ఇప్పటికే వాడ్ని ఓడించేశాడు. ఆ విజయంలో నిలబడి బ్రతకడం నేర్చుకోవాలి. అంతే! క్రైస్తవులు అజేయుడైన క్రీస్తు వైపు చూస్తూ క్రైస్తవ జీవనం సాగించాలి తప్ప, అపవాది ఎరుకలో, భయంలో బ్రతక కూడదు. అపవాదికి భయపడవద్దు, దేవునికి భయపడండి అని ప్రభువు మనకు ముందే చెప్పారు (లూకా 12.4,5). నిజానికి, దేవునికి భయపడే వాడు మరి దేనికీ భయపడడు!
—జీపీ