
భయం లేని నమ్మకం!
Monday, June 3, 2024
“నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించు చున్నాను.”
— కీర్త. 56:3
ఆదాము పాపం చేసినప్పటి నుంచీ భయం మనిషి జీవితంలో అంతర్భాగం అయిపోయింది (ఆది.3.10). భారతీయ జన సామాన్యంలో ఇది మరీ ఎక్కువ. తుమ్మినా భయం చిమ్మినా భయం, పిల్లి అంటే భయం బల్లి అంటే భయం, నలుపంటే భయం చీకటంటే భయం. మనకి వాస్తు భయాలు, శాప భయాలు, ముహూర్త భయాలు, జాతక భయాలు, దయ్యాల భయాలు, దిష్టి భయాలు ఉన్నాయి. ఇటువంటి సమాజంలో పుట్టి పెరిగిన క్రైస్తవులకూ ఈ భయాలు పట్టుకోవడం సహజమే మరి!
కొన్ని భయాలు మనం పెరిగిన పెంపకం, వాతావరణం వల్ల ఏర్పడతాయి. కొన్ని భయాలు మన స్నేహితుల వల్లనో, చూసిన దృశ్యాల వల్లనో ఏర్పడతాయి. మరి కొన్ని మన అనుభవాల వల్ల వచ్చే భయాలూ ఉంటాయి. చిన్నప్పుడు చీకటిని చూపించి “బూచి” అని చెప్పి అమ్మ పిల్లోడికి నోట్లో ముద్దలు పెట్టడం మన దేశంలో పరిపాటి. కొందరు తల్లులు “పొలీస్” పేరు చెప్పి పిల్లల్ని కంట్రోల్లో పెడుతుంటారు. చిన్నప్పుడు పడ్డ ఈ భయ బీజాలు నాటుకుపోయి పెద్దయ్యాక కూడా కలవరపెడుతూనే ఉంటాయి. అలా కొందరికి పరీక్షలంటే భయం, కొందరికి పెళ్లంటే భయం, కొందరికి లిఫ్ట్ అంటే భయం, కొందరికి ఫ్లైట్ అంటే భయం. కొందరికి అలవాటులేక భయం! ఇంకొందరికి అలవికాక భయం!
దైవ భయం, పాప భయం, పెద్దల భయం వంటివి తప్ప మరే భయం “మంచి భయం” కాదు. మంచి భయం కాని ప్రతీ భయం పాప పర్యవసానంగా వచ్చిందే (ఆది.3.10; 4.13,14). పాపరహితుడూ, పరమ పావనుడూ ఐన క్రీస్తు భయానికి మూలకారణమైన పాపాన్ని సిలువలో దునుమాడాడు. అంచేత మన జీవితాల్లో నుండి భయాన్ని పెకలించగల ఏకైక నాథుడు క్రీస్తే! ఆయన మరణ భీతి నుంచి కూడా మనల్ని విడిపించగల మృత్యుంజయుడు (హెబ్రి 2.13).
క్రీస్తులో విశ్వాసం సన్నగిల్లినప్పుడు భయం మన జీవితాల్లో పొడసూపుతుంది. సముద్రం పైన పెనుగాలి వీచి దోనె అతాలకుతలం అయినప్పుడు ప్రభువు తమతోనే ఉన్నా శిష్యులు భయంతో వణికిపోయారు. ఆయన లేచి “అల్ప విశ్వాసులారా” అని కోప్పడ్డాడు (మార్కు 4.35-41; మత్త.8.26). మన దేవుడు మన సమస్యల కంటే పెద్దవాడు. ఆయన సర్వలోకాన్ని, సర్వ అవస్థలను పాలించే సర్వాధికారి. ఆయనకు అలవికాని సమస్య లేదు, ఆయన అదుపు తప్పిన పరిస్థితి లేదు, ఆయన ఆదుకోలేని మనిషి లేడు.
మన దేవుడు సర్వాధికారీ, సర్వ శక్తిమంతుడే కాదు. ఆయన సర్వోత్తముడు కూడా (కీర్త.25.8; 34.8; యాకో.1.17). మన దేవుడికున్న ఈ సర్వ సామర్థ్యం, సత్ లక్షణాలే మనం ఆయన్ని ప్రతి ఆపదలో, ఆవేదనలో, అసహాయతలో నమ్మడానికి ఆధారం. మన దేవుడు చేయగలడు, చేస్తాడు కూడా అని నమ్మడం. నమ్మడం అంటే దేవుడ్ని ఆశ్రయించడం, ఆయన మీద ఆనుకోవడం. కీర్తనకారుడు చెప్తున్నదీ ఇదే. నేను భయపడినప్పుడు దేవా నిన్ను నమ్ముకుంటాను అంటున్నాడు (కీర్త.56.3).
దేవుడ్ని ఎరిగిన విశ్వాసం ఎప్పుడూ “అల్ప విశ్వాసం”గా పరిణమించదు. అరణ్యవాసంలో ఇజ్రాయేల్ ప్రజలకు అక్కర, ఆపద సంభవించినప్పుడల్లా మోషే అసాధారణ విశ్వాసాన్ని ప్రదర్శించాడు. సింహాల బోనులో సైతం దానియేలు నిర్భయంగా నిలబడ్డాడు. అగ్ని గుండంలో పడేస్తున్నపుడు కూడా భయం లేని తెగింపు ప్రదర్శించారు షద్రకు, మేషాకు, అబేద్నగోలు. ఇశ్రాయేలు సర్వ సైన్యం గొల్యాతును చూచి వెరచినా దావీదు ఏ మాత్రం జంక లేదు. వీళ్ళ దైర్యం వెనుక రహస్యం ఏంటి? వీళ్ళకు వీళ్ళ దేవుడెవరో తెలుసు, బాగా తెలుసు. అందుకే అంతలేసి విశ్వాసం! అచంచల విశ్వాసం! అసాధారణ విశ్వాసం!
భయానికి నమ్మకమే విరుగుడు. దేవుడ్ని నిజంగా నమ్మడం నేర్చుకున్న క్రైస్తవుడికి భయం ఆమడ దూరంలో ఉంటుంది. తరచూ ప్రార్థించే క్రైస్తవులు కూడా తరచూ భయపడటం నేను చూశాను. ప్రార్థన అంటే కేవలం మన వినతి పత్రం దేవుడి దగ్గర పెట్టడం కాదు. ప్రార్థన అంటే దేవుడి మీద ఆనుకోవడం, ఆయన్ను హత్తుకోవడం, ఆయన్ను అనుభవించడం. ఆయన్ను అనుభవపూర్వకంగా ఎరిగిన క్రైస్తవుడికి గొల్యాతు లాంటి సమస్య కూడా గోరంతలా కనిపిస్తుంది. మరణం కూడా అతడ్ని భయపెట్టలేదు.
ఎందుకంటే తన దేవుడికి మించిన సమస్య, సంకటం, శక్తి, ఏదీ లేదని అతడికి బాగా తెలుసు. దేవుడ్ని ఎరిగిన నమ్మకం దేనికీ భయపడదు!
—జీపీ