చాలినంత కృప!

Saturday, May 4, 2024

అందుకు– నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.
—2 కొరిం. 12.9

“నా కృప నీకు చాలును”. ఈ మాట మీద అనేక క్రైస్తవ పాటలు రాశారు. ప్రసంగాలూ చేశారు. ఇది క్రైస్తవుల నోట అతి విరివిగా వినబడే మాట. కానీ ఎందరికి దేవుని కృప నిజంగా తెలుసు? క్రీస్తు కృప పైన పౌలులా ఆధారపడే వాళ్ళు ఎందరు? లౌకిక, భౌతిక విషయాల్లో కాకుండా క్రీస్తు కృపలో అతిశయించే క్రైస్తవులు ఎందరు?

బైబిల్ దృక్కోణం నుండి చూస్తే “కృప” అన్నది భావగర్భితమైన మాట. కృపంటే కేవలం కనికరం కాదు. అర్హత లేకున్నా వరించే అనుగ్రహం. అర్హత లేని వాడికి అర్హతనిచ్చేది కృప. క్షమించరాని వాడ్ని సైతం క్షమించేది కృప. ప్రేమకు పనికిరాని వాడ్ని సైతం ప్రేమించేది కృప. దేవుని కృప క్రైస్తవులకే పరిమితం కాదు. ఆయన కృప వల్లనే మనందరం బతికి బట్టకడతాం (విలాప.3.22). “ఆయన కృపను బట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక”(కీర్త. 107.31). ఇది ఆయన సార్వత్రిక కృపా బాహుళ్యం. సృష్టిలో దేవుని కృప గురించి కీర్తనకారుడు వర్ణించడం మనం చూస్తాం (కీర్త.136.1-9). తన కృప వల్లనే “ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు”(మత్త.5.45).

కృప దేవుని వరం. మనమేదో గొప్ప వాళ్ళమని మనం కృప పొందలేం. కృప పొందడానికి మనలోని ఏ మంచీ కారణం కాలేదు. కేవలం దేవుని మంచితనం వల్లనే మనం ఆయన కృపకు పాత్రులమయ్యాం. కృప వల్లనే మనకు రక్షణ భాగ్యం దొరికింది. “మీరు… కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే”(ఎఫెసి.2.8). దేవుని రాజ్య వారసుడు కావడానికి మనుషుల్లో ఎవడూ అర్హుడు కాడు. ఐనా దేవుని కృప వల్లనే ఈనాడు మనిషికి క్రీస్తులో ముక్తి దొరికింది.

ఐతే దేవుని కృప ముక్తికి, రక్షణకు పరిమితం కాదు. రక్షణకు ముందూ, తర్వాత కూడా కృప మనకు అత్యవసరం! రక్షణానంతరం విశ్వాసి క్రీస్తులో ఎదగడానికీ కృప అవసరం. కృప ఒక అర్హతనే కాదు, అది విశ్వాసి అవసరం, అభయం కూడా. మన బలహీనతల్లో కృప మన బలం. “నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము” (2 తిమో. 2:1) ఈ కృప గురించే పౌలు పై వచనంలో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవనం ఒక దైనందిన పోరాటం. క్రీస్తులోకి వచ్చిన దినం నుంచీ మనం శరీరంతో, అపవాదితో, లోకంతో పోరాడుతూనే ఉంటాం. ఈ పోరాటం కొన్ని సార్లు తీవ్ర స్థాయిలో ఉంటుంది (హెబ్రీ.12.4). అందుకే మనకు ప్రభువు కృప తప్పనిసరి! మన స్వశక్తితో మనం క్రైస్తవ జీవనం సాగించలేం. పరిశుద్ధతలో ఎదగలేం. “నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు” అన్నారు మన ప్రభువు (యోహా.15.5).

బలహీనత ఏదైనా కావచ్చు. అవి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆర్థిక బలహీనతలూ కావచ్చు. ప్రభువు కృప అన్నిటికీ చాలినది! ఎందువల్ల? “యెహోవా… కృపాసమృద్ధి గలవాడు” (కీర్త.103.8). దేవుడు కొదువ లేనివాడు (అపో. 17.25). అంచేత ఆయన కృపకూ కొదువ ఉండదు. ఆయన కృప మన ప్రతీ సమస్య సంక్షోభాల కంటే పెద్దది. “యెహోవా, నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది” అంటున్నాడు కీర్తనకారుడు (కీర్త. 108.4). అంతేకాదు, ఆయన కృప వీగిపోదు. “ఆయన కృప నిరంతరముండును” (కీర్త.136.23). ఏనాటి కీడు ఆనాటికి చాలు అన్నారు మన ప్రభువు. ప్రతీ కొత్త కష్టంలో దేవుని కృపావాత్సల్యం మనల్ని అనుదినం కొత్తగా పలకరిస్తుంది (విలాప. 3.23) అంటున్నాడు ప్రవక్త.

ఇంత గొప్ప కృపను ఆశ్రయించడం నేర్చుకున్న నాడు మనం క్రీస్తులోని జీవితాన్ని ఆస్వాదించడం మొదలెడతాం. నా బలహీనతలోనే నేను సంతసిస్తాను, అతిశయిస్తాను అంటున్నాడు పౌలు. ఈ వైఖరి ప్రతీ క్రైస్తవునికీ అవసరం. క్రైస్తవులు తమ గొప్పతనంలో అతిశయించరు. వారి ఆనందం ప్రభువే. వారి అతిశయం ఆయన కృపనే. కష్టాల్లో ఏడుస్తూ కూర్చోరు. కృపతో ఎదుర్కుంటారు. కృపను ఆశ్రయించిన క్రైస్తవుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు. ఇతరుల కంటే తాను పరిశుద్ధుడనని విర్రవీగడు. ఆ పరిశుద్ధత కూడా ప్రభువు కృప వల్లనే సాధ్యమైందని ఎరిగి వినమ్రంగా జీవిస్తాడు (2 కొరిం.4.7; 1 కొరిం.2.3).

జీపీ