దైవ స్పృహ

నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?
—కీర్తనలు 139:7

దేవుని సర్వ సన్నిధి గురించిన సుపరిచిత వచనం ఇది. దేవుడు సర్వాంతర్యామి అన్న నానుడి మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. నిజానికి సర్వాంతర్యామి అన్నది క్రైస్తవ ఆలోచన కాదు. అది అన్యాలోచన. విశ్వంలోని ప్రతీ వస్తువులో, ప్రతీ వ్యక్తిలో దేవుడు ఉంటాడని వారి అభిప్రాయం. పరిమితమైన ప్రపంచం అపరిమితమైన దేవుడ్ని తనలో ఇముడ్చుకోలేదు. అది అసాధ్యం! అందుకే పౌలు ఏథెన్స్ వాసులతో మాట్లాడేటపుడు మనం “దేవుడిలో” చలిస్తున్నాం, బ్రతుకుతున్నాం, మన ఉనికి “ఆయనలోనే” ఉంది అంటున్నాడు (అ.కా. 17.28). అంటే పరిమిత ప్రపంచం అపరిమిత దేవుడిలో ఉంటుంది, చలిస్తుంది. అంతేకదా, అనంతంలో పరిమితం ఉంటుంది గానీ, పరిమితంలో అనంతం ఎలా ఇముడుతుంది?! అది అసాధ్యం! దేవుడు అన్నింటా ఉండడు, అందరిలో ఉండడు కానీ అన్ని చోట్లా ఉంటాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు(అ.కా. 17.27). అంచేత దేవుడ్ని సర్వాంతర్యామి అనడం కన్నా “సర్వ వ్యాపి” అనడం సబబు.

ఇది దేవుని గురించిన ఒక ప్రాముఖ్యమైన వేదాంత సత్యం. అయితే ఇక్కడ దావీదు దేవుని సర్వ సన్నిధి గురించిన ఒక తాత్విక వ్యాఖ్య మాత్రం చేయడం లేదు. ఈ వేదాంత సత్యాన్ని తన సొంత అనుభవంగా కూడా చెబుతున్నాడు. “నీ” సన్నిధి నుంచి “నేనెక్కడికి” పారిపోవుదును—అంటున్నాడు. “నీ”, “నేను” అన్న ఈ వ్యక్తిగత సర్వనామాల వాడుక దావీదు దేవుడ్ని ఎంత సొంతం చేసుకున్నాడో చెబుతోంది. దేవుడు “సర్వ వ్యాపి” కావడం ఒక విషయం అయితే ఆయన “సర్వ సన్నిధి”ని మనం అనుభవించడం మరొక విషయం. మనం గుర్తించినా గుర్తించక పోయినా దేవుడు నిత్యం సర్వ వ్యాపిగానే ఉంటాడు. ఆ సత్యం మన అనుభవాన్ని బట్టి మారదు. కానీ, ఆయన సర్వ సన్నిధిని మనం ప్రతీ చోటా అనుభవించడం ప్రాముఖ్యం. ఈ స్పృహ మన క్రైస్తవాన్ని నిర్దేశిస్తుంది, నిర్ధారిస్తుంది.

దేవుడు గుడిలో ఉంటాడు అన్నది సనాతనంగా మన దేశంలో ఉన్న ఒక సార్వత్రిక ఆలోచన. ఇదే ఆలోచన సహజంగానే భారతీయ క్రైస్తవుల్లో కూడా ఉండిపోయింది. అందువల్లనే చాలామంది క్రైస్తవులు గుడిలో ఒకలాగా బయట ఒకలాగా, ఆదివారం ఒకలాగా, మరోవారం ఒకలాగా ఉంటూ ఉంటారు. వీరికి దేవుని సర్వ సన్నిధి గురించిన ఎరుక దాదాపుగా ఉండదు.

దేవుని సర్వ సన్నిధి గురించిన నిత్య స్పృహ లేక ఎరుక క్రైస్తవుల జీవన శైలిని సమూలనంగా మార్చేస్తుంది. పసలేని పై పై భక్తి నుంచి అది మనల్ని విడుదల చేస్తుంది. ఈ ఎరుక క్రైస్తవునిలో దేవుని భయాన్ని పుట్టిస్తుంది. దైవ భీతి పాప భీతిని పుట్టిస్తుంది. ఈ దైవ సన్నిధి స్పృహ పరిశుద్ధత వైపు మనల్ని నడిపిస్తుంది. ఈ స్పృహ మనం ఈ లోకంలో జవాబుదారీతనంతో జీవించడానికి దోహదం చేస్తుంది. దేవుని సర్వ సన్నిధి గురించిన నిత్య స్పృహ మనం దేవుడ్ని నిత్యం అనుభవించడానికి, ఆస్వాదించడానికి తోడ్పడుతుంది. దేవుడ్ని ఆస్వాదించే క్రైస్తవుడు ఇహలోక సుఖాభోగాలకు బానిస కాలేడు. నిజానికి మన జీవితాలకు కర్త అయిన దేవుడ్ని ఆస్వాదించకుండా మనం జీవితాన్ని ఆస్వాదించలేం. దావీదుకు ఉన్న దేవుని సర్వ సన్నిధాన స్పృహ మనలోనూ కలుగునుగాక!

మీ ప్రకాష్ గంటెల