దేవుడు తీర్చే హృదయ వాంఛ!

వాంఛ లేని మనిషి ఉండడు. కాకపోతే అది ఎలాంటి వాంఛ అనేదే ప్రశ్న. ఉన్నదంతా పదార్థ ప్రపంచమే అన్న భౌతికవాద ధోరణి, ఉన్నన్నాళ్ళూ సుఖంలోనే స్వర్గాన్ని వెతుక్కోవాలి అన్న సుఖవాద పోకళ్ళూ, అవసరం ఉన్నా లేకపోయినా మార్కెట్లో కొత్త వస్తువు వస్తే కొని తీరాలి లేకుంటే ప్రతిష్టకు భంగం అన్న వినిమయ తత్త్వమూ, నేనూ లోకంతో పోటీ పడాలి లేకుంటే మనుగడ సాగించలేనన్న అభద్రతా భావమూ కట్టగట్టుకుని ప్రతీ దినం మన మనసుపై దండయాత్ర చేస్తూనే ఉంటాయి. ఇలాంటి లోక మర్యాదకు లోనైన మనస్సు నుంచి పుట్టే వాంఛలను దేవుడు తీరుస్తాడు అనుకోవడం మన అవివేకం.

దేవుడు తీర్చే హృదయ వాంఛ!

Thursday, July 25, 2024

యెహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును.
— కీర్త. 37:4

వాంఛ లేని మనిషి ఉండడు. కాకపోతే అది ఎలాంటి వాంఛ అనేదే ప్రశ్న. ఉన్నదంతా పదార్థ ప్రపంచమే అన్న భౌతికవాద ధోరణి, ఉన్నన్నాళ్ళూ సుఖంలోనే స్వర్గాన్ని వెతుక్కోవాలి అన్న సుఖవాద పోకళ్ళూ, అవసరం ఉన్నా లేకపోయినా మార్కెట్లో కొత్త వస్తువు వస్తే కొని తీరాలి లేకుంటే ప్రతిష్టకు భంగం అన్న వినిమయ తత్త్వమూ, నేనూ లోకంతో పోటీ పడాలి లేకుంటే మనుగడ సాగించలేనన్న అభద్రతా భావమూ కట్టగట్టుకుని ప్రతీ దినం మన మనసుపై దండయాత్ర చేస్తూనే ఉంటాయి. ఇలాంటి లోక మర్యాదకు లోనైన మనస్సు నుంచి పుట్టే వాంఛలను దేవుడు తీరుస్తాడు అనుకోవడం మన అవివేకం.

ఐనా ఇదేమీ పట్టనట్టు ఈ వచనంలో మనకిష్టమైన రెండో భాగాన్ని మాత్రం కత్తిరించి విరివిగా వాడేయడం ఇప్పటికే మనకూ, మన బోధకులకూ బాగా అలవాటై పోయింది. దేవుని వాక్యాన్ని మన ఇష్టానుసారం అలా కత్తిరించి మరీ వాడుకోలేం. లేఖనానికి ఏదైనా కలపడానికి గానీ, దాని నుంచి ఏదైనా తీసివేయడానికి గానీ మనకు అధికారం లేదు. అది పూర్తిగా నిషిద్ధం, నేరం కూడా (ద్వితి.12.32; సామె.30.6).

దేవుడ్ని ఆస్వాదించే హృదయం దేవునికి ఇష్టం లేని వాంఛలకు నిలయం కాలేదు.

దేవుడ్ని మన ఇష్టానుసారంగా వాడుకోలేం. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించ లేడు (2 తిమో.2.13). మన వాంఛలు ఆయన స్వభావానికి విరుద్ధంగా లేనంత వరకే ఆయన ఏదైనా ఆమోదిస్తాడు. దైవ స్వభావానికి వ్యతిరేకమైన కోరికలను మనం ప్రార్థనలో అడగలేం, అడిగినా ఆ కోరికల్ని ఆయన తీర్చడు కూడా. “యేసు నామంలో” మనం ఏది అడిగినా దేవుడు దయచేస్తాడు అన్న మాటకు అర్థం కూడా అదే (యోహా.14.14; 16.23). బైబిల్లో “నామం” అంటే స్వభావం. అంటే మన ప్రభువు స్వభావానికి విరుద్ధమైన ఏ వినతిని దేవుడు అంగీకరించడు, మన్నించడు అని అర్థం. అంచేత విశ్వసించిన వారి అన్ని కోరికల్ని దేవుడు మన్నించడని సదరు విశ్వాసులు తెలుసుకోవాలి.

మరి దేవుడు ఎవరి కోరికలను మన్నిస్తాడు, ఏ మనో వాంఛలను తీరుస్తాడు? యెహోవాను బట్టి సంతోషించే వారికే ఈ భాగ్యం దక్కుతుంది అని వాక్యం సుస్పష్టం చేస్తుంది (కీర్త.37.4). దేవుడిలో ఆనందించడమే ఇక్కడ కీలకం. దేవుడిలో సంతోషించడానికీ, ఆయన మన కోర్కెల్ని తీర్చడానికీ విడదీయలేని సంబంధం ఉన్నదన్నది ఇక్కడ మనం గ్రహించాల్సిన సత్యం. ఇది ఒక కార్యకారక సంబంధం. దేవుడిలో ఆనందించండి (పాటించాల్సిన ఆజ్ఞ). అప్పుడు ఆయన మీ అభిలాషను తీరుస్తాడు (పొందే ఫలితం). మొదటిది లేకుండా రెండోది లేదు!

దేవుడ్ని మన ఇష్టానుసారంగా వాడుకోలేం. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించ లేడు.

దేవుడిలో ఆనందించే వాళ్ళ కోరికలకు, లోకంలో ఆనందించే వాళ్ళ కోరికలకు కొండంత వ్యత్యాసం ఉంది. దేవుడిలో ఆనందించే విశ్వాసులు లోకాశలకు లొంగరు, లోకం పోకళ్ళతో పోటీపడరు, లోక మర్యాదను పాటించరు(రోమా 12.2; 1 యోహా.2.15,16; యాకో.4.4). దేవుడ్ని ఆస్వాదించే హృదయం దేవునికి ఇష్టం లేని వాంఛలకు నిలయం కాలేదు.

దేవుడిలో ఆనందించే హృదయం ఆయన వాక్యంలోనూ ఆనందిస్తుంది. దేవుడి వాక్కులో ఆనందం పొందే హృదయం ఆయన వాక్య ధ్యానంలోనూ ఓలలాడుతుంది (కీర్త.1.2; 119.35,70,97,131,148). నిజానికి వాక్య ధ్యానంలోనే హృదయ శుద్ధి జరుగుతుంది (హెబ్రీ 4.12). అలా వాక్యం వల్ల ఆశయ శుద్దీ, ఆశల శుద్దీ పొందిన హృదయం దేవునికిష్టమైన వాంఛలకు ఆలవాలం కాగలదు. అటువంటి హృదయ వాంఛలను దేవుడు తప్పక తీరుస్తాడు. అటువంటి హృదయాల నుంచి పెల్లుబికిన ప్రార్థనలు ఆయన సన్నిధిని చేరతాయి, అవి ఆయనకు ఇంపైన పరిమళంగా ఉంటాయి కూడా (కీర్త.147.11).

—జీపీ

Previous Devotions