దేవుడు లేని ఆశీర్వాదాలు
దేవుడు లేని ఆశీర్వాదాలు!
Saturday, July 6, 2024
“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.”
— కీర్తన 23:1
వృత్తిరీత్యా గొర్రెల కాపరి ఐన దావీదు తనను గొర్రెగా, దేవుడ్ని తన కాపరిగా ఊహించుకుని రాసుకున్న ఒక అద్భుతమైన కవిత ఈ కీర్తన. ఇక్కడ కాపరి, గొర్రె అన్నవి కవితాత్మకంగా చెప్పిన ఊహా చిత్రాలు, పోలికలే తప్ప వాస్తవానికి దేవుడొక గొర్రెల కాపరి, మనం గొర్రెలం కాదు. ఈ కీర్తన మనకు ఎంత సుపరిచితమో అంతగా ఇందులోని అంతరార్థాన్ని మనం ఆకళింపు చేసుకోలేకపోయాం అన్నది నిజం. నిజానికి మన క్రైస్తవ లోకంలో వల్లె వేసే కంఠత వాక్యాలు చాలా మట్టుకు కంఠం దాటి హృదయం దాకా వెళ్లవేమో అనిపిస్తుంది. వాక్యాన్ని సుపరిచితం చేసుకోవడం అంటే వచనాలు కంఠత పెట్టడం మాత్రమే కాదు అందులోని అంతరార్థాన్ని అవలోకనం చేసుకుని, ఆచరించడం అని మనం తెలుసుకోవాలి.
దేవుడు తన పోషకుడైతే తనకు ఏ కొదువా ఉండదు అన్న కవి అచంచల విశ్వాసాన్ని ఈ సంకీర్తన ఆరంభంలోనే మనం స్పష్టంగా చూడగలం. ఇది దేవుని వీగిపోని నమ్మకత్వం మీద పెట్టుకున్న నమ్మకం. ఈ నమ్మకమే దావీదులో ఆశను, అభయాన్ని, నిశ్చింతను, నిబ్బరాన్ని, శాంతిని, సంతృప్తిని పుట్టించిందని సంకీర్తన ఆసాంతం చదివితే మనకు ఇట్టే అర్థమవుతుంది.
మనకి దేవుడికంటే ఆయన ఇచ్చే వరాలు, వనరులే ముఖ్యం. ఇటువంటి విశ్వాసాన్ని దేవుడు తిరస్కరించాడు
విశ్వాసం కేవలం ఆరాధనకో ఆధ్యాత్మికతకో, భక్తికో భజనకో పరిమితమైన విషయం కాదు. క్రైస్తవ జీవనంలో అన్ని రంగాల్లో అవసరమైంది విశ్వాసం. ఆంతరంగిక బహిరంగ జీవనం, దాంపత్య కుటుంబ జీవనం, వ్యాపార వృత్తి జీవనం, సామాజిక సంఘ జీవనం ఇలా అన్నింటా విశ్వాసాన్ని అభ్యసించడం క్రైస్తవునికి అనివార్యం, అత్యవసరం. విశ్వాసం లేనిదే దేవుణ్ణి సంతోష పెట్టలేం (హెబ్రీ 11.6). విశ్వాసం లేనిదే ఈ లోకంలో సంతోషంగా జీవించలేం, మనుగడ సాధించలేం కూడా (హబ.2.4,13; 3.16-19).
ఈ విశ్వాసం మన సామర్థ్యాల పైనో, లౌకిక వనరులు వైభవాల పైనో ఆధారపడే విశ్వాసం కాదు. నమ్మకత్వానికి మూలాధారమైన దేవునిపైన ఉండాల్సిన విశ్వాసం ఇది. ఇరవై ఒకటో శతాబ్దపు క్రైస్తవుల్లో కరువైన విశ్వాసం ఇదే. నేటి రోజుల్లో దేవుడి మీద కంటే బ్యాంక్ బాలెన్స్ మీదా, బంగారం మీదా, ఆస్తిపాస్తుల మీదా, అధికారం మీదా క్రైస్తవులకు విశ్వాసం ఎక్కువైంది. వారి భావి భద్రతకు అవే కీలకంగా మారిపోయాయి. అవి ఉండకూడదు అని కాదు. వాటిని నమ్ముకోకూడదు, వాటిని కావలించుకుని కూర్చోకూడదు.
ఇరవై ఒకటో శతాబ్దపు క్రైస్తవుడు ఇపుడు కొత్త సంకీర్తన రాసుకున్నాడు. అమెరికా సంబంధం దొరికితే చాలు… అదే నాకు పదివేలు, మా అబ్బాయి డాక్టరో ఇంజనీరో ఐతే చాలు…ఇక నాకు కొదువే లేదు, డబ్బూ దస్కం ఉంటే చాలు…ఆయన దుడ్డుకర్ర దండం లేకపోయినా ఫర్వాలేదు, కార్లు బంగళా కావల్సినంత బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే చాలు…కలకాలం బతికేస్తా, కాకపోతే అప్పుడప్పుడూ దేవుడి గుడికెళ్లి దండం పెట్టుకుని వచ్చేస్తా. ఇదీ నేటి దావీదుల కీర్తన!
మనకి దేవుడికంటే ఆయన ఇచ్చే వరాలు, వనరులే ముఖ్యం. ఇది నేరం. ఇటువంటి విశ్వాసాన్ని దేవుడు తిరస్కరించాడు (యోహా. 2.24; 6.26). ఇలాంటి వైఖరిని ఆయన తప్పుబట్టాడు (మత్త.12.39;16.4). దేవుడు వద్దు, కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి అనే నేటి క్రైస్తవులకు ఆయన దొరకడు. ఆయన లేని బ్రతుకులో సంతృప్తి (వ.1), శాంతి, సౌఖ్యం (వ.2), సేద, నీతి (వ.3), అభయం, ఆదరణ (వ.4), గౌరవం, ఆశీర్వాదం (వ.5), కృప, క్షేమం (వ.6) దొరకడం కష్టం. లోక వైభవాలూ వనరులూ వీటిని ప్రసాదించ లేవు.
విశ్వాసం కేవలం భక్తికో భజనకో పరిమితమైన విషయం కాదు. అది క్రైస్తవ జీవనంలోని అన్ని రంగాల్లో అవసరం.
దావీదు విశ్వాసం మన విశ్వాసానికి భిన్నమైంది. దేవుడి నమ్మకత్వమే అతడి విశ్వాసానికి మూలాధారం. దేవుడ్ని రుచి చూసిన వాడికే ఈ రకం విశ్వాసం అబ్బుతుంది (కీర్త.34.8). దేవుడ్ని అనుభవ పూర్వకంగా ఎరిగిన క్రైస్తవుడికే ఈ లోకంలో ఎటువంటి గడ్డు సమస్యనైనా ఎదురొడ్డి నిలబడి జీవించడం సాధ్యమవుతుంది. గాఢాంధకారంలోనూ, మరణలోయల్లోనూ అతడి విశ్వాసం చలించదు. కష్టంలోనూ ఇష్టంగా అతడు ప్రభువును హత్తుకుంటాడు.
దావీదు దేవుడ్ని కాపరిగా, పోషకుడిగా చూడటమే కాదు. అతడు దేవుడ్ని సొంతం చేసుకున్నాడు. యెహోవా “నా” కాపరి—అంటున్నాడు. ఈ కీర్తనలోని తర్వాతి వచనాలన్నీ ఈ ఒక్కమాట మీదే నడిచాయి. దావీదుకు దేవుడిచ్చే విషయాల కన్నా దేవుడే ముఖ్యం. దావీదుకీ దేవుడికీ మధ్య నెలకొన్న ఒక వైయక్తిక సంబంధం ఇది. ఇది ఒక గాఢమైన అనుబంధం. ఇదే విశ్వాసి జీవితానికి కీలకం. విశ్వాసానికి కర్త ఐన వాడితో మనకు సరైన సంబంధం లేకుండా విశ్వాస జీవితాన్ని ఎలా నెరపగలం, నెట్టుకురాగలం? ఈ లోకంలో ఎలా తట్టుకుని జీవించగలం?
దేవుడ్ని సొంతం చేసుకున్న బ్రతుకులో—లేమిలో సంతృప్తి, ఆందోళనలో నిశ్చింత, వేదనలో ఆదరణ, ఆపదలో అభయం, అభద్రతలో నిబ్బరం, అవమానంలో గౌరవం, వెలితిలో నిండుదనం, బలహీనతలో బలం, క్షామంలో క్షేమం సొంతమవుతాయి. అన్నింటికీ మించి దేవుని సన్నిధానం క్రైస్తవుడికి అమితానందాన్ని ప్రసాదిస్తుంది. జీవిత రచయితను ఆస్వాదించిన వాడికే జీవితాన్ని ఆస్వాదించడం చేతనవుతుంది. దేవుడు మనకు దొరకడమే మన అసలుసిసలు ఆశీర్వాదం. ఆయన లేని ఆశీర్వాదాలు అడియాశల్లాంటి ఎండమావులే!
—జీపీ