దేవునికి భయపడండి!

Friday, May 17, 2024

మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞల ననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను.
— ద్వితి 13:4

నేడు క్రైస్తవంలో బాగా కొరవడింది అంటూ ఏదైనా ఉంది అంటే అది “దేవుని భయం” అని నిర్ద్వందంగా చెప్పవచ్చు. అన్యులైనా వాళ్ళ దేవుళ్ళకు భయపడుతున్నారు గానీ మనలో చాలా మందికి ఆ స్పృహ లేదు. సంఘారాధన జరుగుతున్నపుడు మోగే సెల్ ఫోన్స్, వాక్య పరిచర్య జరుగుతున్నపుడు పక్క వారితో మాట్లాడే తీరు, ఓ పక్క వాక్య ప్రబోధం జరుగుతుంటే స్టేజ్ మీద కూర్చున్న అయ్యవార్లు మాట్లాడుకుంటున్న తీరు, ప్రార్థన మధ్యలో వచ్చి కాఫీ తాగుతారా అని అడగడం, రాజకీయ నాయకులు రాగానే ప్రసంగం మధ్యలో ఆపేసి, లేచి నిలబడి వారికి పెద్ద పీట వేయడం, దేవుని మందిరంలోనే కీచులాడుకోవడం, పైగా దాన్ని యూట్యూబ్ లో పెట్టడం వంటివి చూస్తుంటే దైవ భయం మనకు బొత్తిగా లేదని ఇట్టే చెప్పేయ వచ్చు. “లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను” (కీర్త.33:8) అని ఉంది. మన దేవుడి పట్ల మన వైఖరే ఇలా ఉంటే అన్యజనులు ఆయనకు ఎలా భయపడతారు?

ఇది కృప కాలం. పాత నిబంధన కాలంలా కాదు. నాడు కోపగించినట్టు నేడు దేవుడు కోపగించడు. ఆయన కృపలో ఏం చేసినా కొట్టుకుపోతుంది. ఆయన కృపలో అన్నీ మాఫీ అయిపోతాయి అన్న “భ్రమ”లో మనం బ్రతుకుతున్నాం. ఈ అపోహకు ఇటీవలి ప్రబోధాలు ఇంకా ఆజ్యం పోశాయి. దేవుడికి కాల పరిమితులు లేవు. ఆయన సర్వకాల సర్వావస్థల్లో మారని దేవుడు (మలా.3.6; హెబ్రీ 13.8). ఆయన తాను వేవేల మందిని కరుణిస్తానని, వేయి తరాల వరకూ కృప చూపిస్తానని పాత నిబంధనలోనే చెప్పుకున్నాడు (నిర్గ.34.7; ద్వితి.7.9). మన దేవుడు దహించే అగ్ని అనీ, ఆయన చేతిలో పడటం భయంకరమనీ కొత్త నిబంధన చెబుతోంది (హెబ్రీ 12.28; 10.31). అంచేత, పాత నిబంధన రౌద్ర కాలం, కొత్త నిబంధన కృప కాలం, మనం ఏం చేసినా చెల్లుతుంది అన్న అలసత్వం నుంచి మనం బయటపడాలి. ఈ అలసత్వం వల్లనే అననీయ సప్పీరాలు మట్టికరిచారు (అపో.5.1-11).

మనం గతంలో చెప్పుకున్నట్టు దైవ భయం అంటే పిరికి భయం కాదు. అది భక్తిలోంచి పుట్టుకొచ్చే భయం. అందుకే ఈ దైవభయాన్ని తెలుగు బైబిల్లో “భయభక్తులు” అనే జంట పదాలతో అనువదించారు. గాలివానను చూసి భయపడిన శిష్యులు ఆ తర్వాత ప్రభువు వాటిని గద్ధించడం చూసి ఆయనకు భయపడ్డారు (మార్కు 4.41). రూపాంతరం చెందిన ప్రభువును చూసిన శిష్యులు బోర్లపడి మిక్కిలి భయపడ్డారు (మత్త.17.6). దేవుడ్ని చూసిన ప్రవక్త యెషయా “అయ్యో, నేను నశించితిని” అంటూ వణికిపోయాడు (6.5). దైవభయానికి మూలం దేవుని స్వరూప ప్రత్యక్షతే(ద్వితి.5.4). దేవుని గురించిన అరకొర జ్ఞానం వల్ల దైవభయం పుట్టదు. వాక్యం పరిచయం చేసిన దేవుడు మనకు సుపరిచితుడైతే బైబిల్ చెప్పే ఈ “భయభక్తులు” మనకూ అలవడతాయి.

దైవభయం అంటే “దేవుని పరిశుద్ధ సన్నిధి గురించిన నిరంతర ఎరుక” అన్నాడో క్రైస్తవ వేదాంతి. అంతేకాదు, “ఒకానొక రోజు నా ప్రతి ఆలోచనా, మాటా, చేతా ఆ దేవుని పవిత్ర తీర్పులోనికి వస్తాయి అన్న ఎరుక” అన్నాడాయన. దేవుని భయం గురించి చెప్పిన ఒళ్ళు గగుర్పొడిచే ఒక నిర్వచనమిది. మన దేవుడు పరమ పవిత్రుడనీ, పాపాన్ని ఓర్వలేడనీ, ప్రతీ విషయాన్నీ, ఆలోచనతో సహా ఒక దినం తీర్పు తీరుస్తాడనీ, అటువంటి దేవుని సర్వ సన్నిధిలో మనం నిత్యం జీవిస్తామనీ మనం గుర్తెరిగిన నాడు మనలో దైవభయం పుడుతుంది.

యెహోవా యందున్న భయం పవిత్రమైంది (కీర్త.19.9). ఎక్కడ దైవ భీతి ఉంటుందో అక్కడ పాప భీతి కూడా ఉంటుంది(కీర్త.4.4). యోబు జీవితం ఈ సత్యానికి తార్కాణంగా నిలిచింది (యోబు 1.1,8; 2.3; 28.28). దేవునికి భయపడితే ఆయన మాట వింటాం, ఆయన ఆజ్ఞలు పాటిస్తాం, ఆయనకు లోబడతాం. దేవునికి భయపడ్డ వాడు ఆయన్ను హత్తుకుంటాడు. ఆయన్ను చిత్తశుద్ధితో సేవిస్తాడు (ద్వితి.13.4). దైవభయం నుంచి పుట్టుకొచ్చే సహజ పరిణామాలే ఇవన్నీ!

దైవభయం ఉన్న వాళ్ళు ధన్యులు, వాళ్ళు ఆశీర్వాదం పొందుతారు (కీర్త.115.13; 128.1,4). దైవ భయం జ్ఞానానికి మూలం (కీర్త.111.10; సామె.1.7). తనకు భయభక్తులు చూపే వాళ్ళంటే ఆయనకు ఇష్టం (కీర్త.147.11). దైవభయం ఉన్న వారి మొర దేవుడు ఆలకిస్తాడు (కీర్త.145.19). దేవునికి భయపడే వారి మీద ఆయన కృప అధికంగా ఉంటుంది, అది వారి మీద యుగయుగాలూ ఉంటుంది. అటువంటి వారి మీద ఆయన జాలి పడతాడు (కీీర్త.113.11,13,17). దైవభయం ఉన్న వారికి కొదువ ఉండదు (కీర్త.34.9). తనకు భయపడే వారి మీద ఆయన దృష్టి పెడతాడు (కీర్త.33.19). దైవభయం ఉన్న వాళ్ళ కోసం ఆయన మేళ్ళు దాచి ఉంచుతాడు (కీర్త.31.19). తనకు భయపడే వారికి ఆయన తన మార్గాల్ని, మర్మాల్ని తెలియచేస్తాడు. వారికి మనశ్శాంతి దొరుకుతుంది (కీర్త.25.12-14). దైవ భయం దేవుడ్ని నిజంగా పూజించేలా చేస్తుంది (కీర్త.5.7).

దైవభయమే క్రైస్తవున్ని సమాజంలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. దైవభీతి నుంచి పుట్టిన శీలం బయటి ప్రపంచంలో క్రైస్తవునికి గౌరవమర్యాదలు తెచ్చి పెడుతుంది. ఇటువంటి సచ్చీల క్రైస్తవమే లోకానికి తమ దేవుడి ప్రత్యేకతను చాటగలదు.

—జీపీ