దేవుని పితృత్వం

కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి —పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక.
—మత్తయి 6:9

ప్రభువు నేర్పిన ప్రార్థనలో మొదటి వచనమిది. ఈ ప్రభువు ప్రార్థన “పరలోకమందున్న మా తండ్రీ” అన్న సంబోధనతో ఆరంభమవుతుంది. “తండ్రీ” అన్న ఈ పిలుపు క్రైస్తవ ప్రార్థనకు పునాది. ఇది క్రైస్తవానికి ప్రత్యేకం. ఇతర మతాల్లో దేవుడ్ని తండ్రీ అని పిలవడం అరుదు. యూదులకు తమ దేవుడి నామాన్ని ఉచ్చరించడానికే భయం. ఇస్లాంలో అది నిషిద్ధం. అందుకే క్రీస్తును తెలుసుకున్న ఆ ముస్లిం మహిళ బిల్కిస్ షేక్ “ఐ డేర్ టు కాల్ హిమ్ అ ఫాదర్” అంటూ తన సాక్ష్యాన్ని పుస్తకంగా రాసింది. మన ప్రభువైన క్రీస్తు వల్లనే ఇది సాధ్యం.

పాప పంకిలమైన తన బ్రతుకు వల్ల మనిషి పరమ పవిత్రుడైన దేవుడ్ని చేరుకోలేడు అన్నది అక్షర సత్యం. అందువల్లనే ఆనాడు ఒక్క ప్రధాన యాజకుడు తప్ప (అందునా ఏడాదికి ఒక్కమారే) మరెవరూ దేవుని అతి పరిశుద్ద స్థలంలోనికి వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి. క్రీస్తు సిలువలో బలియాగమైన ఆ శుక్రవారం మధ్యాహ్నం ఆ మహా దేవాలయపు తెర నిట్ట నిలువుగా చినిగిపోయింది. “నిరంతరము మెల్కీ సెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను. … ఏలయనగా –నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను (హెబ్రీ 6:20; 7:17). దేవునికి సమీపం కావడానికి క్రీస్తు సిలువ మనందరినీ భాగ్యవంతుల్ని చేసింది. “గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము” (హెబ్రీ 4:16). ఇపుడు క్రీస్తు సిలువ రక్తాన్ని ఆశ్రయించిన ప్రతీ విశ్వాసికి ఎప్పుడైనా ఆయన సన్నిధికి వెళ్ళే స్వేచ్ఛావకాశం దొరికింది. ఆయనను “అబ్బా, తండ్రీ!” అని ప్రార్థించే దగ్గర సంబంధం, చనువూ ఏర్పడ్డాయి (రోమా 8.15).

క్రీస్తు సిలువ వల్ల ఏర్పడ్డ ఈ సంబంధం క్రైస్తవ ప్రార్థనకు కీలకం. ఈ సంబంధం లేనప్పుడు మన ప్రార్థనలు పేలవంగానో, యంత్రికంగానో, గొంతెమ్మ కోర్కెల చిట్టా గానో, స్వార్థ పూరిత వినతి పత్రాలగానో మిగిలిపోతాయి. “తండ్రీ” అని పిలిచే ప్రార్థన చనువుతో పాటు, గౌరవ విధేయతలను కూడా వ్యక్తం చేస్తుంది. “నా చిత్తం కాదు, నీ చిత్తమే” అని లోబడుతుంది. విధేయత చూపించని బిడ్డలు తండ్రిని ఘనపరచ లేరు.

దేవుని పితృత్వమే ప్రార్థనలో మన అభయం. మన పరలోకపు తండ్రి మన పోషకుడు, సంరక్షకుడు. విత్తక, కోయక, కూర్చుకొనక మనుగడ సాధించే ఆకాశ పక్షులను పోషించే ఆ తండ్రి మన అవసరాలను తప్పక తీరుస్తాడు (మత్త.6.26). ఈ తండ్రిని నమ్ముకున్న ప్రార్థన మన చింతలన్నిటినీ దూరం చేస్తుంది. ఆ తండ్రి ఎద పైన ఆనుకుని నిశ్చింతగా ఉండే మనస్తత్వాన్ని పుట్టిస్తుంది. ఆ తండ్రి వాత్సల్యం, నమ్మకత్వమే మన మనశ్శాంతికి మూలాధారాలు. మన చింతలన్నీ మోసి, వాటిని తీర్చే పరమ తండ్రి (1 పేతు. 5.7) మనకున్నాడు. మన ప్రార్థనలో ఆయనే మన ధైర్యం!

మీ ప్రకాష్ గంటెల