ఇవ్వడం నేర్చుకుందాం!

Wednesday, May 15, 2024

“ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి–కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”
— మార్కు 12:42

“కాసు” అంటే మూల భాషలో “లెప్టన్” అని ఉంది. నాటి రోమా సామ్రాజ్యంలో అతి తక్కువ విలువ ఉన్న నాణెం అది. మనకు పూర్వం కాసు అంటే దాదాపు అరపైసా. వాళ్ళకి ఆ నాడు కాసు అంటే దేనారంలో నూట ఇరవై ఎనిమిదో భాగం. దాదాపుగా విలువ లేని నాణెం. ఇలాంటి రెండు నాణేలను ఒక పేద వితంతువు కానుక పెట్టెలో వేయడం చూసిన ప్రభువు “ఈమె అందరికంటే ఎక్కువ వేసింది” అంటున్నాడు. అనేకమంది ధనవంతులు అప్పటికే పెద్ద మొత్తాలు కానుక పెట్టెలో వేస్తున్నారు (మార్కు 12.41). అది చూసినా ప్రభువు అతి తక్కువ ఇచ్చిన ఈ పేద మహిళను “ఎక్కువ ఇచ్చింది” అనడంలో అంతరార్థం ఏమిటి?

ప్రభువిక్కడ పక్క వారి కానుకలతో ఆ పేదరాలి కానుకను పోల్చి లెక్క కట్టట్లేదు. అందరి కానుకల్ని వారి వారి ఆదాయాలతో పోల్చి లెక్క కడుతున్నాడు. అలా లెక్క కడితే ఆ పేదరాలే ఎక్కువ ఇచ్చింది అని తేలిపోయింది. ధనవంతులంతా తమకున్న దాంట్లో పదోవంతు ఇచ్చారేమో లేక ఇంకాస్త ఎక్కువ ఇచ్ఛారేమో. ఈ మహిళ మాత్రం తాను పేదరికంలో ఉండి కూడా తన “జీవనమంతా” (ఆదాయమంతా) ఇచ్చేసింది—అన్నారు ప్రభువు (మార్కు 12.44). ఆదాయం ఎంతైతేనేం ఇచ్చే మనసుండాలి, అంతే! (2 కొరిం.8.12).

ఈ ఉదంతం నుంచి భారతీయ క్రైస్తవులు నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. మనకు ఇవ్వడం రాదు. ఎంత సంపాదించినా ఇవ్వలేం. ఇచ్చినా ఆశీర్వాదం కోసమో, అంతకు పదిరెట్లు దేవుడిస్తాడు అంటూ నేటి బోధకులు పెట్టే “అత్యాశ” వల్లనో ఇస్తాం. మనలో చాలామంది దేవుడ్ని ప్రేమించి ఇవ్వం. దేవుడి దగ్గర “ఇంకేదో ఆశించి” ఇస్తాం. ఆ పేద వనితకు ఆశలు, అత్యాశలు లేవు. ఆమెకు దేవుడే ఎక్కువ. ఆమె దేవుడ్ని ప్రేమించింది. తనకున్నదంతా ఇచ్చేసేటంత ప్రేమించింది. ఆస్తిపాస్తులు ఆదాయాల కంటే ఎక్కువగా ఆ దేవుడ్ని ప్రేమించడం నేర్చుకున్నప్పుడు “ఇవ్వడం” కూడా నేర్చుకుంటాం.

దాతృత్వం ప్రేమ నుంచి పుట్టాలి. నేనిస్తే నాకెంత వస్తుంది అన్న వ్యాపార భావనతో ఇవ్వకూడదు. క్రీస్తు తనని విశ్వసించని వారి కోసం కూడా సిలువలో చనిపోయాడు (1 యోహాను 2.2). దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తన ఏకైక కుమారుణ్ణి ఆ లోక రక్షణ కోసం ఇచ్చి వేశాడు (యోహా. 3.16). ఆయన మనందరి కోసం తన కుమారుణ్ణి ఇచ్చివేశాడు (యెష. 9.6). ఇందులో ప్రేమ ఉంది (1 యోహా. 4.9,10). తన ఏకైక కుమారుణ్ణి మన కోసం బలి పీఠం పైన “త్యాగం” చేసేటంత ప్రేమ మన దేవునిది. క్రీస్తు సిలువ ప్రేమ మన దాతృత్వానికి స్ఫూర్తి కావాలి (2 కొరిం.8.9). ప్రేమలోంచే త్యాగం పుడుతుంది, త్యాగపూరిత దాతృత్వం పుడుతుంది. దేవుడికిచ్చినా, మనుషులకిచ్చినా ప్రేమతోనే ఇవ్వాలి, ప్రతిఫలం కోసం ఇవ్వకూడదు. ప్రేమ లేకుండా శరీరాన్ని కాల్చుటకిచ్చినా అది పనికిమాలిందే! (1 కొరిం.13.2,3). ప్రేమ లేని కానుకల్ని దేవుడు స్వీకరించడు.

ఆ పేద వితంతువు తన సంపాదనంతా దేవుడికిచ్చేస్తే ఇక ఆమెకు బ్రతకడానికి మిగిలేదేంటి? ఆవిడ ధైర్యమేంటి? ఆమె ధైర్యం దేవుడే! దేవుడి నమ్మకత్వం మీద ఆమెకు అచంచల విశ్వాసం. ప్రభువు “కొండమీది ప్రసంగం”లో చెప్పిన “చింతలేని విశ్వాసం” ఆమె సొంతం (మత్త.6.25-34). తన పరమ తండ్రి తన బాగోగులు చూసుకుంటాడన్న కొండత ధైర్యం ఆమెది!

ఇలాంటి “చింతలేని విశ్వాసం” లేకనే మనం అనేక సార్లు దేవుడికి ఇవ్వడంలోనూ, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడంలోనూ వెనుకంజ వేస్తుంటాం. విశ్వాసం లేని చోటనే “చింత” రాజ్యమేలుతుంది. చింత మనకు “మూరెడంత లాభం” చేకూర్చకపోగా (మత్త.6.27) అది మనల్ని లోలోపల తినివేస్తుంది. పలు మనోదేహ రోగాలకు కారకమవుతుంది. చింతలేని విశ్వాసం మన ప్రాణాత్మ దేహాలకు ఆరోగ్యాన్నిస్తుంది. ఇటువంటి విశ్వాసం సహజంగానే “ఇచ్చే మనసు”ను పుట్టిస్తుంది, పెంచి పోషిస్తుంది కూడా.

ఇవ్వడం నేర్చుకుందాం. మన ప్రభువు మనసును పుణికిపుచ్చుకుందాం. తనను ఖాళీ చేసుకునేంతగా సిలువలో మన కోసం ఇచ్చివేసుకున్న ప్రభువు మనసును (ఫిలి.2.7,8) అనుకరిద్దాం. త్యాగపూరితంగా ఇవ్వడం నేర్చుకుందాం. “పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం”(అపో.20.35) అన్న ప్రభువు మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం.

—జీపీ