శాంతి పహరా
శాంతి పహరా
Thursday, June 6, 2024
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.
— ఫిలి.4.7
శాంతి—ఈ లోకంలో కరువైన విషయాల్లో ఒకటి. డబ్బు హోదా, కులం బలం, పదవి పరపతి ఇవేవీ శాశ్వత శాంతిని ఇవ్వలేవు. సాంకేతికత సుఖాన్నివ్వగలదే గానీ శాంతిని ఇవ్వలేదు. కుబేరులు సైతం శాంతి కోసం అర్రులు చాస్తారు—అది దొరక్క! లోకస్తులు పబ్బులకు, క్లబ్బులకు అందుకే వెళ్తుంటారు. అక్కడా అది దొరకదు. మాదకద్రవ్యాల వాడకం, మందు తాగడం కూడా దాని కోసమే. ఐనా శాంతి అందని ద్రాక్షనే!
బైబిల్ మనశ్శాంతిని పొందే రహస్యం చెబుతోంది. కృతజ్ఞతా ప్రార్థనే చింతను దూరం చేస్తుంది. ఎందువల్లనంటే, ఇటువంటి ప్రార్థనే దైవ శాంతికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఫిలిప్పీ పత్రికలో (4.6,7) పౌలు చెప్తున్న శాంతి రహస్యం ఇదే!
కృతజ్ఞత, ప్రార్థన. ఇవి రెండూ తరచూ కలిసి ఉంటాయి. కృతజ్ఞత అంటే చేసిన మేలును గుర్తుపెట్టుకోవడం. భారతీయులకు ఇది కాస్త తక్కువే. మొన్నటి ఆంధ్రా ఎన్నికల ఫలితాలు దీనికి అద్దం పడుతున్నాయి. దేవుడు చేసిన ఉపకారాల్లో దేనినీ మరవద్దు అంటున్నాడు కీర్తనకారుడు దావీదు (కీర్త.103.2). కృతజ్ఞత లోపించిన చోట విశ్వాసమూ లోపిస్తుంది. దేవుడు చేసిన మేలును మరిచిన హృదయం దేవుడ్ని సరిగా నమ్మలేదు. దేవుడ్ని నమ్మని హృదయం సరిగా ప్రార్థించలేదు (యాకో.1.6,7). కృతజ్ఞతా హృదయం, ప్రార్థనా మనస్సు ఉన్నపుడే దేవుని సమాధానాన్ని మనం అనుభవించడం సాధ్యమవుతుంది.
ప్రార్థన అంటే దేవుడి దగ్గర కోర్కెల చిట్టా ఏకరువు పెట్టడం కాదు. మన గుండె బరువును, మనో వ్యాకులతను దేవుడి మీదకు బదలాయించే ఒక ఆధ్యాత్మిక అభ్యాసం ప్రార్థన. నేటి క్రైస్తవ లోకంలో కొరవడింది ఈ అభ్యాసమే. జోసెఫ్ స్క్రివెన్ రాసిన ప్రఖ్యాత ఆంగ్ల క్రైస్తవ గీతం “వాట్ ఎ ఫ్రెండ్ వి హావ్ ఇన్ జీసస్” ఈ క్రైస్తవ అలసత్వాన్ని సునిశితంగా విమర్శించింది.
అయ్యో, శాంతి నెంత కోల్పోతాం
అనవసర బాధలన్నీ భరిస్తాం
చింతలన్నీ ప్రభువు చెంతకు తేలేక
అయ్యో, శాంతి నెంత కోల్పోతాం
క్రీస్తు యేసు మనకెంత ప్రియ నేస్తం
ఇహ పాప తాపం మోసే మన నేస్తం
చింతలన్నీ తీర్చే మన ప్రభు చెంత
భాగ్యమే నీది వేయి నీ భారమంతా*
మన బాధల్నీ బరువుల్నీ మోసే దేవుడు మనకుండటం మన భాగ్యం! ఆయన మీద మన చీకూ చింతల్ని మోపడం మనం చేయాల్సిన అభ్యాసం! మీ చింతనంతా దేవుడి మీద వేయండి. ఎందుకంటే ఆయన మీ గురించి చింతిస్తూ ఉన్నాడు—అంటున్నాడు అపొస్తలుడు పేతురు (1 పేతు.5:7). దేవుడు మన గురించి ఎల్లపుడూ చింతిస్తూ ఉంటాడని ఈ వచనంలోని వ్యాకరణ కాలం చెబుతోంది. మన దేవునికి మన పట్ల ఉన్న ఈ “నిరంతర శ్రద్ధ” ఆయన వాత్సల్యానికి అద్దం పడుతుంది. అది మన విశ్వాసాన్ని ఇనుమడింప చేస్తుంది, మన మనసును కుదుటపరుస్తుంది. నీరు నిప్పు ఎంత విరుద్ధమో, చింత ప్రార్థన అంత కంటే విరుద్ధం అంటాడో బైబిల్ వ్యాఖ్యాత. నిజమే, అసలైన ప్రార్థన ఉన్న చోట అసలు చింతే ఉండదు!
పౌలు చెప్తున్న శాంతి రహస్యమిదే. పైన చెప్పుకున్న కృతజ్ఞతా ప్రార్థన మనకు అలవడిన నాడు మనం దేవుని శాంతిని అనుభవిస్తాం. ఇది దేవుని శాంతి. మన మేధస్సుకు అందని శాంతి. ఈ శాంతిని అనుభవించాలే తప్ప అర్థం చేసుకోలేం. అలవిగాని సమస్యల మధ్య అర్థంకాని దేవుని శాంతే మనల్ని నిలబెడుతుంది. ఈ శాంతి మన హృదయాన్నీ, మనసునూ చింత నుంచీ, లోకపు అత్యాశల నుంచీ కాపాడుతుంది. హృదయం భావోద్వేగాలకూ, సంకల్పానికీ ఆలవాలం. మనస్సు ఊహలకూ, తలంపులకూ నిలయం. ఈ రెంటికీ దేవుని శాంతి కావలి కాస్తుంది అంటోంది వాక్యం. ఇంతకు మించిన భద్రతా భావం ఎక్కడ దొరుకుతుంది?
ఐతే మన తెలివికి మించిన ఈ శాంతి క్రీస్తు లేకుండా మనకు దొరకడం కల్ల. “యేసుక్రీస్తు వల్లనే” ఈ శాంతి మీకు లభిస్తుందని పౌలు సెలవిస్తున్నాడు. క్రీస్తుకు అతీతమైన నిజమైన శాంతి అంటూ లేదు. ప్రభువు చెప్తున్న మాటలివి. “శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించు చున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుట లేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి” (యోహా.14.27). లోకమిచ్చే శాంతిలాంటిది కాదు ప్రభువిచ్చే శాంతి. కష్టాల మధ్య, కన్నీళ్ళ మధ్య కూడా అనుభవించ గల అర్థంకాని, అసాధారణ అంతర్గత శాంతి ఇది (యోహా.16.33).
మారుమనస్సు పొంది క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం పెట్టుకున్న వాళ్ళకే ఈ శాంతి సొంతమవుతుంది. ప్రతీ దినం ప్రభువు చెంత తమ బాధల్ని చెప్పుకునే వాళ్ళకి, తమ భారాల్ని దించుకునే వాళ్ళకి మాత్రమే ఈ శాంతి దొరుకుతుంది. ప్రభువు చేసిన మేళ్ళను మరువక కృతజ్ఞతా హృదయాన్ని పెంపొందించుకునే వాళ్ళను ఈ శాంతి వరిస్తుంది. ప్రభువును తమ హృదయ సింహాసనం పైన ప్రతిష్ఠించుకున్న (1 పేతు.3.15) క్రైస్తవుల జీవితాలను ఈ శాంతి ఏలుతుంది (కొల.3.15). ఎందుకంటే, క్రీస్తే శాంతి ప్రదాత, సమాధాన కర్త (యెష.9.6).
—జీపీ
*అనువాదం నాది