క్రైస్తవ మనస్సాక్షి

Sunday, May 19, 2024

“ఈ విధమున నేనును దేవుని యెడలను మనుష్యుల యెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను”
— అపో. 24:16

మనస్సాక్షి వల్లనే లోకంలో ఇంకా కాస్తయినా మానవత్వం బ్రతికి ఉంది. మనస్సాక్షి వల్లనే ప్రతీ మనిషికీ తప్పొప్పులు తెలుస్తాయి (రోమా 2.14,15). మనస్సాక్షి మనిషికి దేవుడిచ్చిన వరం. నైతికతకు మూలాధారమైన దేవుడు మనిషిని “తన పోలికలో” సృష్టించాడు కాబట్టే సహజంగా మనిషికి నైతిక స్పృహ అబ్బింది. ఆ నైతిక స్పృహను కలిగించే అంతర్గత సామర్థ్యమే “మనస్సాక్షి”.

ఐతే మనస్సాక్షికి పరిమితులు లేకపోలేదు. అది మనిషికి తప్పొప్పులు తెలియచేస్తుంది. లేదా అతని పైన తప్పొప్పులు మోపుతుంది. అంతే తప్ప అతణ్ణి తప్పు చేయకుండా ఆపలేదు. అది మంచి చేసే సామర్థ్యమూ అతనికివ్వలేదు. ఇట్స్ ఎ విజిల్ బ్లోయర్! మనం తప్పు చేయగానే అది అరుస్తుంది, ఆక్రోశిస్తుంది. దాని కేకలు వినపడతాయి. కొందరు ఆ కేకలకు సానుకూలంగా స్పందిస్తారు, మరికొందరు దాని గొంతు నొక్కేసి తప్పు చేయడానికి పూనుకుంటారు. అలా కొంత కాలానికి “వాత వేసిన మనస్సాక్షి”ని కొని తెచ్చుకుంటారు (1 తిమో.4.3). వీళ్ళు దేవుడు నియమించిన ప్రమాణాలను సైతం తిరస్కరిస్తారు.

దేవుడు మనిషికి తన పోలికలో ఇచ్చిన మనస్సాక్షి ఇపుడు “సంపూర్ణంగా” పనిచేయట్లేదు. అది కూడా పాపం వల్ల పంకిలమై పోయింది (తీతు.1.15). తెలిసీ తెలియక చేసిన పాపాలు మనస్సాక్షిని అపవిత్రం చేస్తాయి (1 కొరిం.8.7). అందుకే క్రీస్తు రక్తం మనిషి మనస్సాక్షిని సైతం శుద్ధి చేయాలి. “… క్రీస్తు యొక్క రక్తము, నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కు వగా శుద్ధిచేయును”(హెబ్రీ 9.14). క్రీస్తు ప్రవిమల రక్తం తప్ప మరే అర్పణలూ, బలులూ మనస్సాక్షి విషయంలో మనకు పరిపూర్ణతను ఇవ్వలేవు (హెబ్రి 9.9). క్రీస్తు రక్తంతో కడుక్కున్న స్వచ్చమైన మనసాక్షితోనే మనం బాప్తీస్మం తీసుకోవాలి (1 పేతు.3.21). క్రీస్తు తన నిత్యాత్మ ద్వారా బలియాగం చేశాడు గనుక ఆయన పవిత్ర రక్తం మన మనస్సాక్షిని నిత్యం కడుగుతూనే ఉండాలి (హెబ్రి 9.14).

పాపం చేత ప్రభావితమైన మన మనస్సాక్షులకు క్రీస్తు రక్తప్రోక్షణతో పాటు వాక్య ప్రక్షాళనా అవసరం (ఎఫె.5.25-27). ఏ రెండంచుల కత్తి కన్నా బలమైన, పదునైన సజీవ వాక్యం మన మనస్సాక్షులను కూడా శోధించాలి (హెబ్రి 4.12). నిరంతరం లోకం పోకళ్ళ వత్తిళ్ళ కింద సతమతమయ్యే మన మనస్సాక్షులకు నిత్య వాక్య ప్రక్షాళన తప్పనిసరి!

“అంతరాత్మ” అని కూడా మనం పిలుచుకుంటున్న ఈ మనస్సాక్షి గురించి కొత్త నిబంధన బైబిల్ పాతిక సందర్భాలకు పైగానే ప్రస్తావించిందీ అంటే అది ఎంత ప్రాముఖ్యమైన విషయమో అర్థం చేసుకోగలం. మనం పాపాన్ని విడిచి పెట్టాలనే క్రీస్తు తన రక్తంతో మన మనస్సాక్షులను కడిగాడు (హెబ్రి 9.14). పునీతమైన క్రైస్తవ మనస్సాక్షికే విశ్వాస మర్మం అర్థమవుతుంది, ఆ మర్మాన్ని ఆచరించడానికీ వీలౌతుంది(1 తిమో.3.9). మంచి క్రైస్తవ పోరాటం పోరాడ్డానికీ మంచి మనస్సాక్షి అవసరం (1 తిమో.1.18). ఇలాంటి మంచి మనస్సాక్షిని తిరస్కరించే వాళ్ళు విశ్వాస విషయంలో చెడిపోయే ప్రమాదముంది (1 తిమో.1.19).

క్రీస్తు రక్తం శుద్ధి చేసిన మనస్సాక్షితోనే మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి (హెబ్రి 10.22). మనం అన్ని విషయాల్లో యోగ్యంగా ప్రవర్తించాలంటే మనకు మంచి మనస్సాక్షి కావాలి (హెబ్రి 13.18). స్వచ్చమైన ప్రేమ స్వచ్చమైన మనస్సాక్షి నుంచి పుడుతుంది (1 తిమో.1.5).

దైవ సేవకులకూ మంచి మనస్సాక్షి ఉండాలి. వాళ్ళు చేసే సేవ పవిత్రమైనదిగా, కపటం లేనిదిగా ఉందో లేదో చెప్పేది ఈ మనస్సాక్షే! (2 కొరిం.1.12). పవిత్రమైన మనస్సాక్షితో మనం దేవుడ్ని సేవించాలి. పౌలు అలానే సేవించాడు (2 తిమో.1.3). నేటి సేవకులు దేవుడ్ని చిత్తశుద్ధితో సేవించాలంటే క్రీస్తు రక్త ప్రోక్షిత మనస్సాక్షులను వాళ్ళు సంతరించుకోవాలి (హెబ్రి 9.14).

మన సువార్త పరిచర్యలోనూ మనస్సాక్షి పాత్ర కీలకం. మలినం లేని మనస్సాక్షితోనే మనం ఇతరులకు సువార్త చెప్పాలి, అలానే ఆ సువార్త సత్యాన్ని సమర్థించాలి కూడా. మనం చెప్పే సువార్తలో గానీ, మన జీవించే జీవితాల్లో గానీ కపటం ఉండ కూడదు. అలా స్వచ్చమైన మనస్సాక్షితో మనం సత్య సువార్త చెబితే మనల్ని దూషించే వాళ్ళు సైతం సిగ్గుపడతారు(1 పేతు.3.15,16), ఆ సువార్త నమ్మ శక్యంగా ఉంటుంది.

క్రైస్తవులు శ్రమల్ని సహించే విషయంలో సైతం క్రీస్తు రక్తంలో పునీతమైన మనస్సాక్షి కీలక పాత్ర పోషిస్తుంది. శ్రమ మన తప్పిదాల వల్ల వచ్చిందా లేక క్రీస్తు కోసం మనం నిలబడటం వల్ల వచ్చిందా అన్నది తేల్చుకోవడానికీ ఈ మనస్సాక్షి అవసరం. మలినం లేని మనస్సాక్షితో మనం తప్పు చేయకపోయినా వచ్చే హింసను, శిక్షను, శ్రమను దేవుని కోసం భరిస్తే అది హితం (1 పేతు.2.19,20). మన ప్రభువు నిందారహితమైన మనస్సాక్షితో మన నిమిత్తం అన్యాయంగా హింస నొంది సిలువలో బలయ్యాడు, ఆ మహా బాధను భరించాడు (1 పేతు.2.21-23; హెబ్రి 9.14).

“వాక్యం గుప్పిట్లో ఉన్న నా మనస్సాక్షికి వ్యతిరేఖంగా నేను ప్రవర్తించ లేను” అని రాజు ముందు నిలబడి చెప్పాడు లూథర్. అంతకంటే ముందు రాజు ముందు నిలబడ్డ భక్త పౌలు తన మనస్సాక్షిని “దోషం లేనిది”గా ఉంచుకోవడానికి “అభ్యాసం” చేశాను అంటున్నాడు. (అపో.24.16). అతడు దేవుని ముందూ, మనుషుల ముందూ ఈ అభ్యాసంతోనే నిందారహితంగా జీవించాడు. పౌలు ఎప్పటికప్పుడు తన దేవుని ముందు (ఆయన వాక్యం వెలుగులో) తన మనస్సాక్షిని పరీక్షించుకుంటూ దాన్ని “మంచి మనస్సాక్షి”గా పెంచి పోషించుకున్నాడు (అపో.23.1). నేటి క్రైస్తవుల్లో ఈ అభ్యాసం కరువైంది. నిత్యం క్రీస్తు రక్తంలో పునీతమయ్యే, ఆయన వాక్యంతో ప్రక్షాళనమయ్యే మంచి మనస్సాక్షి నేటి క్రైస్తవుడికి అత్యవసరం!

—జీపీ