క్రీస్తుకు పట్టం కట్టే పరిచర్య
Sunday, May 26, 2024
“ఆయన హెచ్చవలసి యున్నది, నేను తగ్గవలసియున్నది.”
— యోహా. 3:30
“సెలబ్రిటీ సేవకుల” కాలంలో జీవిస్తున్నాం మనం. వేదికలపైన “దైవ జనులు” సన్మానాలు చేయించుకుని వేడుకలు చేసుకుంటున్న దినాలివి. యూట్యూబ్ లో “లైక్స్” కొట్టించుకుంటూ, వాటికి “ర్యాంకింగ్స్” ఇచ్చుకుంటూ, “బౌన్సర్లను” పెట్టుకుని, కానుకల కాసులతో “దైవ సేవకులు” BMW లలో ఊరేగుతున్న రోజులివి. తాము విమానమెక్కితే వీడియో, “జూ” కెళితే వీడియో, తమ పిల్లలు ఆడినా పాడినా వీడియో. సామాజిక మాధ్యమాల్లో “అంతా మనదే హవా” అన్నదే యావ. పరిచర్య అంటే “మనమూ మన కుటుంబమే” ఇంకెవరూ కనపడకూడదన్న స్వాతిశయ పరాయణత్వం! గొప్పల డప్పులు కొట్టుకుని చిట్టచివర “దేవునికే మహిమ” అంటూ ముక్తాయించే వేషధారణకు ఇపుడు కొదువేమీ లేదు.
సేవకులంతా ఇలానే ఉన్నారు—అనలేం. కానీ నేడు లైమ్ లైట్ లో ఉన్న అనేకమంది “సేవకులు” ఇలానే ఉన్నారని మాత్రం కచ్చితంగా చెప్పగలం. చాన్నాళ్ళ క్రితం “ఎందుకన్నా వేదికల పైన మిమ్మల్ని పొగిడించు కుంటున్నారు?” అని అడిగాను ఓ క్రైస్తవ పెద్ద మనిషిని. “ఇన్ని కోట్లు ఖర్చు పెడుతుంటే ఆ మాత్రం పొగిడించు కోకపోతే ఎలా?” అన్నాడాయన. “ఆ కోట్లు ప్రజల కానుకలు కదా!” అన్నాన్నేను. ఆ పెద్ద మనిషి దగ్గర సమాధానం లేదు, ఉక్రోషం తప్ప!
ఇలాంటి వాళ్లకు బాప్తీస్మమిచ్చే యోహాను మాటలు రుచించవు. బాప్తీస్మమిచ్చే యోహాను తన సాక్ష్యం తాను చెప్పుకోలేదు. అతను క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చాడు (యోహా.1.15,19,32,34). మన గురించి మనం సాక్ష్యమిచ్చుకోవడం సరికాదని ప్రభువే చెప్పారు (యోహా.5.31). స్త్రీలు కనిన వారిలో బాప్తీస్మమిచ్చే యోహాను వంటివాడు పుట్టలేదని ప్రభువే ఈ యోహానుకు కితాబిచ్చారు (మత్త.11.11). ప్రభువు అంతిమ తీర్పు తీర్చే రోజున కూడా తమ గురించి తాము చెప్పుకున్న ఒక “సేవకుల బ్యాచ్” మనకు కనబడుతుంది. వాళ్ళను ప్రభువు బహిష్కరించారు (మత్త.7.22,23). మన సేవ ప్రజల చేత చప్పట్లు కొట్టించుకునే సేవ కాకూడదు. అది క్రీస్తు కితాబిచ్చే సేవ కావాలి. అటువంటి సేవే క్రీస్తు న్యాయపీఠం ముందు అంతిమ తీర్పులో నిలబడుతుంది.
నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు ఎందుకంటే ఆయన నా కంటే ముందే ఉనికిలో ఉన్నవాడు—అంటూ యోహాను క్రీస్తు గురించి “ఎలుగెత్తి” చాటాడు (యోహా.1.15,30). క్రీస్తు చెప్పుల తాళ్ళు విప్పడానికైనా, వాటిని మోయడానికైనా తాను పాత్రుణ్ణి కానని యోహాను నిస్సంకోచంగా చెప్పుకున్నాడు (మత్త.3.11; మార్కు 1.7; లూకా 3.16). నేనిచ్చే బాప్తీస్మం కంటే క్రీస్తు ఇచ్చే బాప్తీస్మం ఎంతో గొప్పది అని నిర్ద్వందంగా చెప్పాడతను (మత్త.3.11; మార్కు 1.8). క్రీస్తే హెచ్చవలసి ఉంది, తాను తగ్గవలసి ఉంది—అంటూ మనస్పూర్తిగా తన వైఖరిని బయటపెట్టాడతను.
ఇలాంటి “బాప్తీస్మమిచ్చే యోహాను వైఖరి” నేటి దైవ సేవకులకు ఎంతైనా అవసరం. నిజానికి ఈ వైఖరి లేనివాళ్ళు సేవకు పనికిరారు. సేవంటే దేవుడు చెప్పింది చేయడమే. మనం అనుకున్నది చేయడం కాదు. సేవంటే ఆయన చేతిలో పనిముట్టుగా ఉండటమే (యెష.6.8). అంచేత “తగ్గి ఉండని వాణ్ణి” దేవుడు వాడుకోడు. ఏశావును దేవుడు తిరస్కరించడానికి ఇదే ప్రధాన కారణం. “మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండ గోరిన యెడల, వాడు అందరికి దాసుడై ఉండ వలెను” అని ప్రభువు స్పష్టం చేశారు(మార్కు 10:44). ఒదికి ఉండటం, వినమ్రంగా ఉండటమే సేవకు అర్హతలు!
క్రీస్తు తగ్గించుకోవడం నేర్పించాడు. ఆయన దేవుడై ఉండి దీనుడయ్యాడు. దేవునితో సమానుడు మనుషుల్లో ఒకడయ్యాడు. దేవాదిదేవుడు దాసుడయ్యాడు (ఫిలి.2.5-8). దీనత్వానికిది పరాకాష్ట! తనను సేవించే వాడు తనను అనుసరిస్తాడు అని ఆయన స్పష్టంగా చెప్పాడు (యోహా. 12:26).
నా దేవుడు “కింగ్” కాబట్టి నేను కూడా “కింగ్”లా ఉంటాను అని కప్పిపుచ్చుకునే కుహనా బోధకులకు ప్రభువు దీనత్వం చెంపపెట్టు కావాలి.
క్రీస్తును హెచ్చించని సేవకుడు సేవకుడే కాదు. తాను కనుమరుగై ప్రభువును కనుపరుస్తూ, ఆయన్ను హెచ్చించేవాడే నిజమైన సేవకుడు. “తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును” అని ప్రభువు తెగేసి చెప్పారు (లూకా 14.11). ప్రభువును పైకెత్తకుండా తనను తాను పైకెత్తుకునే “సేవకుడు” ఏదో ఒకరోజు భంగపడక తప్పదు. జనాన్ని ఆకర్షించడానికి “సేవకులు” రాజకీయ నాయకుల్లా జిమ్మిక్కులు చేయనక్కర్లేదు, డప్పాలు కొట్టన్నకర్లేదు. క్రీస్తును పైకెత్తితే చాలు. ఆయనే ప్రజల్ని ఆకర్షించుకుంటాడు (యోహా. 12.32; 8.28).
సొంత బోధ చేసేవాడే స్వకీర్తి కోసం పాకులాడతాడు. అతనిలో సత్యం ఉండదు. దైవిక బోధ చేసేవాడు దేవుడ్ని మహిమ పరచడానికి తాపత్రయపడతాడు. అతడు సత్యం మాట్లాడతాడు—అని ప్రభువే స్వయంగా చెప్పారు (యోహా. 7.18). దేవుని చిత్తాన్ని చేయాలన్న చిత్తశుద్ధి ఉన్నవాళ్ళే ఈ నిజమైన సేవకుల్ని గుర్తుపడతారు అన్నారు ప్రభువు (యోహా. 7.17). ఆత్మాభిషేకం ఉన్న సేవకులు ఖచ్చితంగా క్రీస్తుకు పట్టం కడతారు, పెద్ద పీట వేస్తారు. ఎందుకంటే ఆత్మ దేవుడు తనంతట తానే ఏమీ బోధింపడు. క్రీస్తునే మహిమపరుస్తాడు (యోహా. 16.13,14). అంత్య దినాల్లో ఉన్నాం. బెరయా క్రైస్తవుల్లా విశ్వాసులు ప్రతీ “దైవ సేవకుణ్ణి” వాక్యంతో పరీక్షించాలి (అపో.17.10,11) లేకుంటే ప్రమాదం!
—జీపీ