క్రీస్తు మనస్తత్వం

Tuesday, May 21, 2024

“క్రీస్తు యేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.”
— ఫిలి. 2:5

మనస్తత్వం మనిషి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. మనస్తత్వమే మనిషి ప్రవర్తనను శాసిస్తుంది. మనస్తత్వమంటే మనిషి ప్రవృత్తి, ఆలోచనా సరళి, వైఖరి—మనల్ని మనం చూసుకునే దృష్టి, ఇతరుల్ని చూసే దృష్టి. ప్రవృత్తిని బట్టే వృత్తి ఉంటుంది. ఆలోచనా సరళిని బట్టే ఆచరణా శైలి ఉంటుంది. మరి క్రీస్తు మనస్తత్వమంటే ఏంటి?

పౌలు ఇక్కడ క్రీస్తు మనస్సు కంటే ఆయన మనస్తత్వం గురించే ఎక్కువ మాట్లాడుతున్నాడు. అప్పటికే పౌలు సహవాసంలో ఒకరికొకరు పరస్పరం ఎలాంటి మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలో ఫిలిప్పి సంఘస్తులకు ఉపదేశిస్తున్నాడు (ఫిలి.2.1-4). సంఘంలో విశ్వాసుల మధ్య ప్రేమ, కనికరం, వాత్సల్యం, ఏకత్వం, పరస్పర గౌరవం ఉండాలనీ, స్వాభిమానాన్ని, స్వలాభాన్ని తెగనాడాలనీ, ఇతరులను పట్టించుకునే సున్నితత్వం, త్యాగనిరతి పెంచి పోషించుకోవాలనీ వారికి హిత బోధ చేశాడు. అందుకు క్రీస్తే ఆదర్శమనీ, ఆయన్నే స్ఫూర్తిగా తీసుకోమనీ ఐదో వచనంలో చెప్తున్నాడు.

ఏమిటి మన ప్రభువు మనస్తత్వం? ఇదే అధ్యాయంలో ఆరో వచనం మొదలుకొని ఎనిమిదో వచనం దాకా పౌలు క్రీస్తు మనస్తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. ఐతే క్రీస్తు మనస్తత్వాన్ని వివరించక ముందు ఆయన తత్త్వాన్ని వర్ణిస్తున్నాడు. క్రీస్తు దైవ తత్త్వం గురించి అభివర్ణిస్తున్నాడు. పౌలు ఆరో వచనంలో క్రీస్తు దేవత్వం గురించి వాడిన రెండు గ్రీకు పదాలూ ప్రత్యేకమైనవి. అవి క్రీస్తు మారని అంతః స్వరూపం గురించి మాట్లాడుతున్నాయి. ఆయన మౌళికంగా దేవ తత్త్వం ఉన్న వాడు. ఇది మారని దైవ స్వరూపం. ఇదే మాట క్రీస్తు స్వయానా చెప్పుకున్నాడు. నేను నా తండ్రితో ఏక తత్త్వం గలవాణ్ణి—అన్నాడాయన (యోహాను 10.30). దేవుని తత్త్వం మూర్తిమంతం క్రీస్తే (హెబ్రీ 1.3). అందుకే ఆయన తండ్రితో తత్త్వంలోనూ సమానుడు.

క్రీస్తు దేవ తత్త్వం ఔన్నత్యం అర్థం అయితే తప్ప ఆయన మనస్తత్వ ఔదార్యం మనకు అర్థం కాదు. తండ్రి దేవునితో తనకున్న సమానత్వాన్నీ, సహాధికారాన్నీ క్రీస్తు విడిచిపెట్టలేని భాగ్యంగా ఎంచుకోలేదు. ఆ స్థానాన్ని పట్టుకు కూర్చోవాలని అనుకోలేదు. దాన్ని మన కోసం వదులుకున్నాడు. చివరికి సిలువలో ప్రాణం పెట్టి మన కోసం తనను తాను ఖాళీ చేసుకున్నాడు. ఇది త్యాగానికి పరాకాష్ట! ఈ త్యాగపూరిత క్రీస్తు మనస్తత్వం క్రైస్తవులూ సొంతం చేసుకోవాలి అంటున్నాడు పౌలు. త్యాగమే కదా ప్రేమకు అంతిమ పరీక్ష!

క్రీస్తు విలక్షణ మనస్తత్వంలో మరో పార్శ్వం ఆయన వినయం. ఆయన మనిషిగా పుట్టడమే కాదు ఈ మానవ లోకంలో అధమ బానిసగా మారిపోయాడు. బాప్తీస్మం ఇచ్చే యోహాను తాను క్రీస్తు చెప్పులవారు విప్పే దాసుడుగా కూడా ఉండటానికి అర్హుడ్ని కానని చెప్పుకున్నాడు. క్రీస్తు ఏకంగా తన శిష్యుల పాదాలు కడిగే అట్టడుగు స్థాయి దాసుడుగా మారిపోయాడు. పాదపూజ చేయించుకోవాల్సిన వాడు పాదాలు కడగటానికి ఇష్టపడటం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఇది దీనత్వంలో అధో స్థానం! ఇంతకంటే ఎవ్వడూ వినమ్రుడు కాలేడు. దీనుడికి దేవుడి కృప తోడుంటుంది. అహంకారికి దేవుడే మొదటి శత్రువు! (1 పేతు.5.5).

క్రీస్తు మనస్తత్వంలో మరో కోణం ఆయన విధేయత. ఆయన తన తండ్రికి ఎంత విధేయత చూపాడంటే చివరికి సిలువపైన మరణించేటంత! సిలువ మరణం వికృతమైంది, నికృష్టమైంది. మరణంలేని వాడు అటువంటి మరణాన్ని స్వీకరించాడు. పాపమెరుగని వాడు మన పాపం తన మీద వేసుకుని సిలువకెక్కాడు. అదీ ఆయన విధేయత! ఇదంతా ఆయన స్వచ్ఛందంగా చేశాడు. ఆయన దైవ కుమారుడై ఉండీ (దేవునితో సమానుడై ఉండీ) తాను పొందిన శ్రమల వల్ల “విధేయత నేర్చుకున్నాడు” (హెబ్రీ 5.8). అలా విధేయులైన మానవులందరి రక్షణకు కారకుడయ్యాడు (హెబ్రీ 5.10). సకల జీవుల విధేయతకు అర్హుడైన వాడు (ఫిలి.2.9) మన కోసం తాను విధేయత నేర్చుకోవడం ఆశ్చర్యం, ఆదర్శం కూడా!

ఇదంతా క్రీస్తు ప్రేమతోనే చేశాడు. తండ్రితో తనకున్న సమాన స్థానాన్ని మన కోసం వదులుకునేటంత ప్రేమ అది. తన గౌరవం కంటే మన గౌరవాన్ని పట్టించుకునేటంత ప్రేమ అది. తనను ఖాళీ చేసుకునేటంతగా ఇచ్చివేసుకున్న ప్రేమ అది. అందరి విధేయతకు అర్హుడైన వాడు మన కోసం విధేయత నేర్చుకున్న ప్రేమ అది. తన చిత్తాన్ని కాదనుకుని మన కోసం తండ్రి చిత్తానికి శిరస్సు వంచిన ప్రేమ అది. తన ప్రాణం కన్నా మిన్నగా మనకి విలువనిచ్చిన ప్రేమ అది. క్రీస్తు ప్రేమను కొలవగల వాడెవడు?

ఈ క్రీస్తు మనస్తత్వాన్ని మన మనస్సు తత్త్వంగా చేసుకున్నప్పుడు నేటి క్రైస్తవం తీరు మారిపోతుంది. మనలోని అహంభావం ఆవిరైపోతుంది. డాబు దర్పం చూపించుకోవాలన్న దుగ్ద కరిగిపోతుంది. కీర్తి కోసం ఎగబాకే దౌర్భాగ్యం కనుమరుగౌతుంది. ధనాశకు గండి పడుతుంది. ఇతరుల కోసం ఇచ్చివేసుకునే ఔదార్యం ఒంటబడుతుంది. తోటి వారిని గౌరవించే దృష్టిపథం అలవడుతుంది. సేవ చేయించుకోవడం కంటే సేవించడమే ధన్యం అన్న పెద్ద మనసు ఏర్పడుతుంది. నిస్వార్థమైన, త్యాగపూరిత ప్రేమ పుట్టుకొస్తుంది.

మనస్తత్వమే మనిషి ప్రవర్తనకూ, పరివర్తనకూ కీలకం. క్రీస్తే క్రైస్తవానికి మూలం, మార్గ దర్శకం. క్రీస్తు మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకోలేని వాడు క్రైస్తవుడిగా మనుగడ సాధించ లేడు. లోకానికి క్రీస్తును చూపించ లేడు!

—జీపీ