మా, తుజే సలాం!

Sunday, May 12, 2024

“ఆమె కుమారులు …ఆమెను ధన్యురాలందరు”
— సామె.31:28

తల్లిని ప్రేమించడం, గౌరవించడం ‘మదర్స్ డే’ కి పరిమితం కాకూడదు. ఆమె మన బ్రతుకంతటికీ తల్లి—చిన్నప్పుడు పెద్ద వాళ్ళమైనప్పుడు, మనకు పెళ్లి అయ్యాక పెళ్లి కాకమునుపు, ఆమె మనకు సాయం చేసేటప్పుడు, మన సాయం ఆమెకు అవసరం అయినప్పుడు—అమ్మ మనకు అమ్మే! దేవుడి తర్వాత—అమ్మ మనకంత విలువైనది, ఆమె ప్రేమ అంత పవిత్రమైనది, ఆమె అంత గౌరవం పొందతగింది.

దేవుడు తన లేఖనాల్లో పలు సందర్భాల్లో తన ప్రేమను “తల్లి ప్రేమ”తో పోల్చి చెప్పాడు. “ఒకని తల్లి వానిని ఆదరించు నట్లు నేను మిమ్మును ఆదరించెదను”(యెష.66:13). “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను”(యెష.49:15). “యెరూషలేమా, యెరూషలేమా, …కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చు కొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి” (మత్త. 23:37). దేవుడు తన ఉగ్రతను ఉగ్గబట్టుకునే విషయంలో “ప్రసవ వేదన పడుతున్న” తల్లితో పోల్చుకున్నాడు (యెష. 42.14). తన కూనల్ని కోల్పోయిన తల్లి ఎలుగుబంటిలా తాను ఉగ్రత చూపిస్తానని మరో సందర్భంలో ఆయన చెప్పుకున్నాడు (హోషే.13.8). ఎఫ్రాయిముకు చేయిపట్టుకుని నడక నేర్పింది నేనే అన్నప్పుడు కూడా తాను ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో తల్లి పాత్రను ఎలా పోషించాడో దేవుడు చెప్పుకున్నాడు (హోషే.11.3). పాలు విడిచిన బిడ్డ తల్లి ఒడిలో నిశ్చింతగా ఉన్నట్టు దేవుడి సంరక్షణలో తనకూ అలా ఉంటుందని కీర్తనకారుడు చెబుతున్నాడు (కీర్త.131.2). దేవునిలోని ఈ మాతృత్వ లక్షణం ప్రతీ తల్లికీ ఆధారం, ఆదర్శం కావాలి. దేవుని పోలికలో సృజించబడిన స్త్రీ (ఆది.1.26-27) ఆ దేవునితో అనుబంధం పెంచుకున్నప్పుడే తన బిడ్డల్ని దైవికమైన మాతృ ప్రేమతో పెంచగలదు. అటువంటి మాతృమూర్తి నిజంగానే ధన్యురాలు!

పదాజ్ఞల్లో తోటి మనిషి పట్ల మనం పాటించాల్సిన విధుల్లో “నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము” అన్నదే మొదటి ఆజ్ఞ (నిర్గ.20.12). ఇది వాగ్దానంతో ఉన్న మొదటి ఆజ్ఞ అని పౌలు సెలవిచ్చాడు (ఎఫె.6.2). ఇక్కడ దేవుడు తమ తల్లికి, తండ్రికి సమాన గౌరవం ఇవ్వమని పిల్లలందరినీ ఆదేశిస్తున్నాడు. తల్లిని గౌరవించడం ప్రతి కొడుకూ కూతురి కర్తవ్యం. ఇది ఆదేశం, ఆప్షన్స్ లేవు!

వితంతువులైన తల్లుల పట్ల పిల్లలు మరింత బాధ్యతతో నడచుకోవడం నేర్చుకోవాలనీ, ఇది దేవునికి ఇష్టమైన పని అనీ పౌలు చెప్తున్నాడు (1 తిమో.5.4). మన ప్రభువు ముప్పై ఏళ్ళు కుటుంబం పట్ల తన బాధ్యతలు నిర్వర్తించాడు (లూకా 3.23). ఆయన వితంతువైన తన తల్లి బాధ్యతను సిలువకు వెళ్ళే దాకా మోశాడు (యోహా.19.26,27). ప్రభువు తన తల్లిదండ్రులకు ముప్పై ఏళ్ళ వరకూ లోబడి ఉన్నాడని రాయబడింది (లూకా 2.51).

మరి క్రైస్తవ తల్లుల బాధ్యతలేంటి? క్రైస్తవ తల్లి ఇంట ఉండి ఇతరులు నిందించడానికి ఆస్కారం లేని గృహ పరిపాలన చేయాలని వాక్యం చెబుతోంది (1 తిమో.5.14). ఆదర్శ క్రైస్తవ తల్లి జ్ఞానంతో, కృపతో తన పిల్లలకు ఉపదేశం చేస్తుంది (సామె.31.26). అటువంటి తల్లి బిడ్డలకు నీతి సూత్రాలు, న్యాయ విధులు, దేవోక్తిని బోధిస్తుంది (సామె.31.1-9). మీ పిల్లలకు ధర్మశాస్త్రాన్ని విధిగా బోధించాలని దేవుడు ఆజ్ఞ వేశాడు (ద్వితి.4.9; 6.7; 11.19). తిమోతి తల్లి అతడ్ని విశ్వాసంలో పెంచింది (2 తిమో.1.5). తల్లి ఒడి మొదటి బడి!

వంధ్యత్వంతో పిల్లల కోసం అలమటించిన హన్నా దేవుడు బిడ్డనిచ్చాక అతడ్ని దేవుడి సన్నిధిలోనే విడిచి వెళ్ళిపోయింది (1 సమూ.2.11,18). తల్లి మరియ తన బిడ్డ యేసు జీవితంలో జరిగే విషయాలను నిశితంగా పరిశీలిస్తూ, వాటిని గుండెల్లో భద్రం చేసుకుంది (లూకా 2.51). అన్యరాజు అంతఃపురంలో పెరిగినా మోషే తల్లి అతనికి బైబిల్ దేవుడ్ని పరిచయం చేయకుండా లేదు (నిర్గ.2.1-10).

బిడ్డలు దేవుడిచ్చు బహుమానాలు (కీర్త.127.3). మన బిడ్డల విషయంలో మనకున్న కలలు, కోరికలు కాదు. వారిని మనకు బహుమానంగా ఇచ్చిన దేవుడి ఉద్దేశాలూ, ప్రణాళికలూ ఏవిటో తెలుసుకుంటూ వాటి ప్రకారం బిడ్డల్ని పెంచడం క్రైస్తవ పెంపకం. ఇందులో తల్లి పాత్ర చాలా కీలకం!

మాతామహులందరికీ వందనం!

జీపీ