
మన చిత్తం vs దేవుని చిత్తం
Tuesday, May 28, 2024
“…ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు…”
— రోమా 12.2
చాన్నాళ్ల క్రితం ఇంగ్లీష్ క్రైస్తవ మేధావి సి. ఎస్. లూయిస్ ఒక మాటన్నారు. “నరకంలో పాడుకునే పాట ఒక్కటే—నా చిత్తమే సిద్ధించింది కదా—అని.” నిజమే. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలిచే వాళ్ళు పరలోక రాజ్యంలో చేరలేరు. నా తండ్రి చిత్తం చేసే వాళ్ళే పరలోకం చేరతారు—అని మన ప్రభువు ముందే చెప్పారు (మత్త.7.21). విశ్వాసికి అవిశ్వాసికి ఇదే తేడా. అవిశ్వాసి తన ఇష్టానుసారం జీవిస్తాడు. నిజమైన విశ్వాసి ప్రభువు చిత్తానుసారం జీవిస్తాడు (ఎఫెసి 6.6). దేవుని చిత్తం జరిగించే వాడే నా వాడు—అన్నారు ప్రభువు (మార్కు 3.35).
ఐతే ప్రభువు చిత్తానుసారం జీవించడం అంత సులభమైన విషయం కాదు. అది సహజంగా, యాంత్రికంగా జరిగిపోయేది కాదు. దేవుని చిత్త ప్రకారం జీవించడం ప్రతి విశ్వాసికీ ఒక సవాలే. అది ఒక అనుదిన ఆధ్యాత్మిక సంగ్రామం. మనం అవిశ్వాసులుగా ఉన్న నాటి నుంచి కొన్నేళ్లుగా పాపంతో ప్రభావితమవుతూ వచ్చిన మనస్తత్వాలు మనవి. అంచేత విశ్వాసి జీవితాంతం “వేరొక నియమంతో” (పాప నియమంతో) పోరాటం చేస్తూనే ఉంటాడు (రోమా 7.23). ఐతే క్రీస్తులో ప్రతి విశ్వాసికీ అందుబాటులో ఉన్న “ఆత్మ నియమానికి” లోబడటం నేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో గెలుస్తూనే ఉంటారు (రోమా 8.2).
మన చుట్టూ ఉన్న “లోక మర్యాద” కూడా మనం దేవుని చిత్తం జరిగించకుండా మనల్ని ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూనే ఉంటుంది(రోమా 12.2a). అవి వివాహాలు కావచ్చు, విదేశాలకు వెళ్ళడం కావచ్చు; అవి ఉద్యోగాలు కావచ్చు, ఉండే గృహాలు కావచ్చు; అవి పిల్లల చదువులు కావచ్చు, పరిచర్యా విషయాలు కావచ్చు. ఇప్పుడన్నీ అచ్చం లోకం చేస్తున్నట్టు గానే (లేక చెప్తున్నట్టు గానే) మనమూ (క్రైస్తవులు) చేస్తున్నాం. అటు లోక మర్యాదతో, ఇటు పాప నియమంతో నిరంతరం ప్రభావితం అవుతున్న మనకు (విశ్వాసులకు) మన చిత్తమో లేక లోక విధానాలో “మంచి”గా అనిపించడం సహజం. ఐతే మనకు తోచిన ప్రతీ “మంచీ” “దేవుని మంచి” కాకపోవచ్చు. ప్రభువును ప్రేమించే పేతురుకు ఆయన సిలువకెక్కడం ఏమాత్రం “మంచి”గా తోచలేదు. ఐతే అది అపవాది ఆలోచన అని ప్రభువు పేతురును గద్ధించారు (మత్త.16.21-23).
క్రైస్తవుల జీవితంలో దేవుని చిత్తానికి “మించిన మంచి” లేదు. దేవుని చిత్తం నెరవేర్చడం బలులకంటే, నైవేద్యాల కంటే ఉత్తమమైనది (కీర్త.40.6-8). దేవుని చిత్తం ఉత్తమమైందనీ, ఆనందాన్ని ఇస్తుందనీ, అది లోపం లేనిదనీ వాక్యం ఘోషిస్తోంది (రోమా 12.2b). దేవుని చిత్తం మనకు “ఎందుకు మంచిది”? ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు. ఆయన ఎల్లపుడూ మన మంచినే కాక్షించే దేవుడు. ఆయన మంచితనంలో “చంచలత్వం” ఏ కోశానా ఉండదు. ఆయన స్వచ్చమైన వెలుగు, వెలుగుల వెలుగు! అంచేత ఆయన మనకిచ్చే ప్రతి ఈవీ శ్రేష్టమైంది. ఆయన మనకు ప్రసాదించే ప్రతి వరమూ లోపంలేని పరిపూర్ణ వరం (యాకో.1.17).
దేవుని చిత్తం మనకు “ఎందుకు మంచిది”? ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని! ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం బలాదూర్! ఆయన గురించి మనకు పూర్తిగా తెలీదు. కానీ ఆయన మనల్ని పూర్తిగా చదివేశాడు. మన గురించి మనకు తెలిసిన దానికంటే మన గురించి ఆయనకు తెలిసింది ఎన్నో రెట్లు ఎక్కువ. మన సంగతంతా ఆయనకు తెలుసు. మన మంచిచెడ్డలు ఆయనకు తెలిసినంత ఎవ్వరికీ తెలియవు. మన తల్లిదండ్రులకు కూడా తెలియవు. ఆయనకు తెలిసిన దాన్ని తెలుసుకోవడం మన తరం కాదు. మన బుర్ర పేలిపోతుంది (కీర్త.139.1-6). అందువల్ల దేవుని చిత్తమే మన చిత్తం కంటే ఎప్పుడూ ఉత్తమమైంది (యెష.55.8,9). ఇది తిరుగులేని సత్యం!
దేవుని చిత్తం జరిగించే వారికి ఏ అనర్థం దాపురించదు, ఏ అరిష్టం దరి చేరదు. దేవుని చిత్తం జరిగించే వారికి ఆయన అండ ఎప్పుడూ ఉంటుంది. దేవుని చిత్తం జరిగించే వాళ్ళు నిరంతరం నిలుస్తారు—అని వాక్యం అభయమిస్తోంది (1 యోహా.2.17). అంచేత ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరాలని మనం ప్రతీ దినం కోరుకోవాలి, ప్రార్థించాలి (మత్త.6.9). దేవుని చిత్తాన్ని మనం ఇష్టంగా జరిగించాలి (ఎఫేసి.6.6; కీర్త.40.8). అదే మనకు క్షేమం, శ్రేష్ఠం!
—జీపీ