మన విధి!

ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.
—ప్రసంగి 12:13

అసలు మనిషి దేవునికి ఎందుకు భక్తి చేయాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు విధేయుడు కావాలి? ఎందుకంటే ఆయన దేవుడు కనుక. మనం ఆయన సృజించిన జీవులం కనుక. దేవుడు ఉంటే ఆయన సర్వానికీ సృష్టి కర్తే! సర్వ జీవులూ ఆయన వారే! భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే (కీర్త. 24:1). ఆయన మన సృష్టి కర్త, యజమాని, పోషకుడు, సంరక్షకుడు. అసలు మన ఉనికి ఆయన ఉనికి పైన ఆధారపడి ఉంది. ఆయనే మన ఊపిరి, జీవం (యెష. 43.15; యిర్మి. 3.14; జక. 12.8; అపో. 17.24,25,28). ఈయన మన దేవుడు (యిర్మి.10.10; కీర్త. 48.14). లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను (కీర్త.33.8). అందుకే భయభక్తులతో ఆయనకు విధేయులు కావడం మన విధి!

ఇక్కడ భయం అంటే గౌరవప్రదమైన భయం, పిరికితనం కాదు. ఆయన ఒక్కడే పూజనీయుడు గనుక మన అత్యున్నత గౌరవానికి అర్హుడు. అలా ఆయన్ను గౌరవించడం మన కర్తవ్యం!

భక్తి అంటే ప్రేమ—అత్యున్నత ప్రేమ. మనకంటే ఉన్నతమైన దాన్ని ప్రేమించడం భక్తి. గౌరవంతో కూడిన ప్రేమే భక్తి. దేశభక్తి, గురు భక్తి, పితృ భక్తి, వగైరా ఈ కోవకు చెందినవే. దైవ భక్తి వీటన్నిటికీ మించిన భక్తి! ఎందుకంటే దేవుడు అద్వితీయుడు, అత్యున్నతుడు, అత్యంత గౌరవనీయుడు (ద్వితి.6.4-5; యెష. 6.1). అందుకే దేవుడ్ని అత్యున్నతంగానే కాదు, అద్వితీయంగా, అసమానంగా ప్రేమించాలి (నిర్గ.20.3-7; లూకా 14.25-26). ఇంకా చెప్పాలంటే, దేవుడ్ని సరిగా ప్రేమించకుండా మనం ఎవర్నీ సరిగా ప్రేమించలేం. ఎందుకంటే ఆయనే సమస్త ప్రేమలకు మూలాధారం (1 యోహా. 4.8). అంచేత దేవుడ్ని ప్రేమించడం మన విధి, అవసరం కూడా!

మనకంటే పెద్దవారిని, గొప్ప వారిని ప్రేమించినపుడు అది సహజంగానే విధేయత రూపంలో వ్యక్తం అవుతుంది. తండ్రిని ప్రేమించే కొడుకు తండ్రికి లోబడతాడు. భర్తను ప్రేమించే భార్య భర్తకు విధేయురాలిగా ఉంటుంది. గురువును ప్రేమించే శిష్యుడు విధేయుడవుతాడు. అంటే ప్రేమ విధేయతకు దారి తీస్తుంది. అందుకే ప్రభువు ఇలా అన్నారు— నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు … ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నా మాట గైకొనును, … నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు (యోహా. 14:21,23-24). అంచేత, భయభక్తులు ఉన్నచోట విధేయతా ఉండి తీరుతుంది.

పాపం అంటేనే అవిధేయత! ఈ అవిధేయత మనల్ని దేవుని నుంచి దూరం చేసింది. దేవుడు మన జీవానికి మూలం, మన జీవితాలకు కర్త. ఆయన లేకుండా మన జీవితాలకు అర్థం లేదు, నిత్య జీవం అంతకన్నా లేదు. అందుకే భయభక్తులతో దేవుని కట్టడలను అనుసరించి నడచుకోవడం మన విధి, అవసరం కూడా!

మీ ప్రకాష్ గంటెల