నాటి బైబిల్ నేటికీ…
Saturday, July 27, 2024
ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయ బడెను.
— 1 కొరింథీ.10:11
ఎపుడో రాసిన బైబిల్ ఇపుడు నాకు ఎలా వర్తిస్తుంది? నాటి బైబిల్ కాల పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు! నాటి మహిళలు ఇంటి పట్టున ఉండేవారు, ఉద్యోగాలు చేసేవారు కాదు. నేటి మహిళలు అన్నింటా ముందు ఉంటున్నారు, ఉద్యోగస్తులు. ఆ వాక్య సూత్రాలు ఇప్పుడెలా వర్తిస్తాయి? నేడున్న సైన్స్, టెక్నాలజీ నాడు లేదు. కాలం మారింది, కాలం చెల్లిన బైబిల్ ఇప్పుడు నాకు ఎలా అక్కరకు వస్తుంది? ఈ తరం క్రైస్తవంలో అలముకున్న కొన్ని అపోహలు, అనుమానాలివి! వాక్యం కంటే లౌక్యాన్ని తలకెక్కించుకున్న క్రైస్తవులకు ఇలాంటి అభిప్రాయాలు కలగడంలో ఆశ్చర్యం లేదు!
మనుషుల రాతలు మాసిపోతాయి, మారిపోతాయి. దేవుని మాటలు మారవు, మాసిపోవు!
సత్యం కాలాన్ని బట్టి మారదు అన్నది మొదట సదరు ఆధునిక క్రైస్తవులు తెలుసుకోవాల్సిన సత్యం! రెండు రెళ్ళ నాలుగు అన్న ప్రాచీన గణిత సత్యం నేటికీ వర్తిస్తుంది. క్రీస్తు పూర్వం ఆర్కిమెడిస్ కనుక్కున్న సూత్రం నేటికీ సముద్రయానం చేసే ఓడల నిర్మాణానికి, నిర్వహణకు పనికొస్తోంది. భూమి గుండ్రంగా ఉంది అని అరిస్టాటిల్ చెప్పిన సత్యం నేటికీ వాస్తవంగానే నిలిచి ఉంది. సోక్రటీస్ వంటి తాత్వికులు చెప్పిన తార్కిక సూత్రాలు నేటికీ విశ్వవ్యాప్తంగా విరివిగా తత్వశాస్త్రంలోనూ, న్యాయ శాస్త్రంలోనూ ఉపయోగిస్తూనే ఉన్నాం. వందల సంవత్సరాల క్రితం న్యూటన్ కనుక్కున్న గురుత్వాకర్షణ నియమం నేటి ఆధునిక భౌతిక శాస్త్రంలోనూ, మనిషి దైనందిన జీవితంలోనూ ఇంకా పనికొస్తోంది. అశాశ్వత ప్రకృతి నియమాలకే కాలం చెల్లనప్పుడు శాశ్వత దైవ (వాక్య) నియమాలకు కాలం చెల్లుతుందా? ఆలోచించండి! సత్యం కాలాన్ని బట్టి మారదు అన్నది మనం తెలుసుకోవాల్సిన ప్రాథమిక సత్యం!
రెండోది, బైబిల్ దేవుడు మారని దేవుడు! (మలా.3.6). ఆయన నిత్యుడు, శాశ్వతుడు (కీర్త.9.7; 41.13) కనుక కాలానికి అతీతుడు! మరో విషయం ఏవిటంటే, ఆయన సత్యానికి మూలాధారమైన దేవుడు. ఆయనే సత్యం (నిర్గ.34.6; 1 సమూ.15.29; యోహా.3.33; 7.28; 8.26; 14.6,16; 16.13; 17.3; రోమా 3.4; 1 యోహా.5.20).
ఆధునిక ప్రపంచంలో ఇన్ని రంగాల్లో వ్యవస్థల్లో మూల పుస్తకంగా, స్ఫూర్తిగా ఉన్న బైబిల్ మన జీవితాల్లో ఎలా వర్తించకుండా పోతుంది?
ఇటువంటి దేవుడు ప్రత్యక్షంగా పలికిన మాటలే నేటి బైబిల్ (2 పేతు.1.20,21). కీర్తనకారుని మాటలు వినండి: యెహోవా, నీ సత్యం ఎన్నటికీ నన్ను కాపాడుతుంది (కీర్త.40.11). నీ సత్యం నాకు త్రోవ చూపుతుంది (కీర్త.43.3). యెహోవా సత్యము తరతరాలు ఉంటుంది (కీర్త.100.5). అంచేత ఆయన వాక్య సత్యాలు కూడా శాశ్వతమైనవి, కాలం చెల్లనివి. అవి నాటికీ, నేటికీ, ఎన్నటికీ వర్తిస్తాయి (కీర్త.111.7,8; 119.142). ఆయన వాక్య సత్యాల వల్లనే మనం ఈ లోకంలో బ్రతకడానికి జ్ఞానం సంపాదించుకుంటాం (కీర్త.119.144).
మానవ చరిత్రలోకి తొంగి చూస్తే లౌకిక ప్రపంచంలో సైతం నేటి వరకూ బైబిల్ సత్యాలు, సూత్రాలు ఉపయోగపడుతూనే ఉన్నాయి. మోషే మామ యిత్రో ఇచ్చిన సలహా (నిర్గ.18.13-26) నేడు ఐ.ఐ.యం. వంటి ప్రతిష్ఠాత్మక మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో “యిత్రో నియమం”గా బోధిస్తున్నారు. ఆదాముకు దేవుడు గాఢ నిద్రనిచ్చి అతని పక్కటెముక నుంచి హవ్వను చేసిన నాటి పద్ధతి నేటి వైద్య రంగంలో ఇంకా ప్రతీ సర్జరీలో (అనస్థీషియా) ఉపయోగిస్తూనే ఉన్నారు. అంటు వ్యాధులు వ్యాపించకుండా వ్యాధిగ్రస్తులు పారు నీళ్లలో కడుక్కోవాలి అన్న బైబిల్ వైద్య సత్యాన్ని (లేవీ.15.13) నేటికీ వైద్య రంగంలో పాటిస్తున్నారు. దేవుడు మూడున్నర సహస్రాబ్దుల క్రితం మోషేకిచ్చిన ధర్మ శాస్త్రమే అమెరికా, భారత దేశాలతో సహా నేటి ప్రపంచంలో అనేక ప్రజాస్వామ్య ప్రభుత్వాల చట్టాలకు మూలాధారమైంది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి కీలకమైన గాంధీజీ అహింసా వాదానికి మన ప్రభువు పర్వత ప్రబోధం (మత్త.5–7) స్ఫూర్తిగా, పునాదిగా మారింది. నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఆద్యుడైన సర్ ఫ్రాన్సిస్ బేకన్ (1561-1626)కి బైబిల్లోని ఆదికాండం మొదటి రెండు అధ్యాయాలు, హీలియో సెంట్రిక్ యూనివర్స్ (సూర్య కేంద్రిత ప్రపంచం)ను ప్రతిపాదించిన గెలీలియో (1574-1642)కు రోమా పత్రిక మొదటి అధ్యాయం స్ఫూర్తినిచ్చింది. ఆధునిక ప్రపంచంలో ఇన్ని రంగాల్లో వ్యవస్థల్లో మూల పుస్తకంగా, స్ఫూర్తిగా ఉన్న బైబిల్ మన జీవితాల్లో ఎలా వర్తించకుండా పోతుంది? ఆలోచించండి!
జవసత్వాలు ఉడిగిపోయిన ముసలితనంలో సైతం విశ్వాసంతో వాగ్దాన పుత్రున్ని వంశోద్ధారకుడ్ని పొందిన యూదు క్రైస్తవ విశ్వాసాలకు తండ్రిగా పేరుపొందిన అబ్రాహాము మనకు స్ఫూర్తి కాడా? మారని అబ్రాహాము దేవుడు నేడు మన దేవుడు కాడా? ఎనభై ఏళ్ళ వయస్సులో సైతం మాట వినని లక్షలాది ఇజ్రాయేల్ జనాన్ని నీళ్ళు లేని, నిలువ నీడ కూడా దొరకని అరణ్యంలో విశ్వాసంతో నడిపించిన మోషే మనకు స్ఫూర్తి కాడా? నాటి మోషే దేవుడు నేడు మన దేవుడు కాడా? యుద్ధం చేయకుండానే యెరికోను జయించిన నాటి యెహోషువ దేవుడు నేడు మన దేవుడు కాడా? ఆకలితో ఉన్న సింహాల బోనులో నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన నాటి దానియేలు దేవుడు నేటి మన దేవుడు కాడా? గులకరాయితో గొల్యాతును మట్టి కరిపించిన చిన్నవాడైన నాటి దావీదు దేవుడు నేటి మన దేవుడు కాడా? బానిసగా అమ్ముడుపోయి చివరికి ప్రపంచ సామ్రాజ్యాధినేతలైన ఫరోల ఐగుప్తునే శాసించే స్థాయికి ఎదిగిన నాటి యోసేపు దేవుడు నేటి మన దేవుడు కాడా? ఏళ్ల తరబడి వంధ్యత్వంతో బాధపడుతూ కన్నీటి ప్రార్థనతో, విశ్వాసంతో పుత్రున్ని పొందిన నాటి హన్నా దేవుడు నేటి మన దేవుడు కాడా? పేదరికంలో మగ్గుతున్న ఓ సామాన్య యూదు కన్య లోక రక్షకుడు ఉదయించడానికి పనిముట్టుగా మారిన వైనం మనకు స్ఫూర్తినియ్యదా? ప్రపంచాన్నే గడగడలాడించిన రోమ్ సామ్రాట్టులనే ప్రభావితం చేసే సేవ చేసిన పామరులైన నాటి అపోస్తలుల జీవితాలు, పరిచర్య మనకు ఆదర్శం కాదా?
అలాగే నాటి హవ్వ అపనమ్మకం, కయీను అహంకారం, అబ్రాహాము అబద్ధం, శారా తొందరపాటు తనం, లోతు లోభత్వం, యాకోబు మోసం, యోసేపు అన్నదమ్ముల ఈర్ష్య, మోషే కోపం, కోరహు కుమారుల ధిక్కారం, ఇశ్రాయేలీయుల సణుగుడు, సంసోను స్త్రీ లోలత్వం, దావీదు నేత్రాశ, సొలొమోను సుఖభోగాలు, నెబుకద్నేజరు విర్రవీగుడు, పరిసయ్యుల స్వనీతి, అననీయ సప్పీరల అవినీతి, సీమోను ధన మదం, … ఇవన్నీ నేటి మనకు బుద్ధి చెప్పే దృష్టాంతాలు కావా?
మన దేవుడు మారని సత్య దేవుడు. ఆయన నేటికీ మన జీవితాల్లో అద్భుతాలు చేయగల దేవుడు. మన చదువుల్లో ఉద్యోగాల్లో, మన దాంపత్యాల్లో కుటుంబాల్లో, మన జీవితాల్లో పరిచర్యలో ఆయన అద్భుతాలు చేయగలడు, మన అవసరాలు తీర్చగలడు. ఆయన వాక్యం మారని సత్యం. అందులోని దృష్టాంతాలు, జీవితాలు నేటికీ మనకు ఆదర్శం కాగలవు, స్పూర్తినివ్వగలవు, బుద్ధి చెప్పనూ గలవు. ఎందుకంటే ఆయన మారని దేవుడు. ఆయన సర్వకాల సర్వావస్థల్లో పాలించే దేవుడు. ఆయన మన దేవుడు. ఆయన వాక్యం, నీతి, సత్యాలు మారనివి! అవి అన్ని కాలాల్లోనూ వర్తించేవి! మనుషుల రాతలు మాసిపోతాయి, మారిపోతాయి. దేవుని మాటలు మారవు, మాసిపోవు!
—జీపీ
J RAJASEKHAR