నేత్రాశతో జాగ్రత్త!

నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?
—యోబు 31:1

“సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అన్నారు. కళ్ళు దేవుడు మనకిచ్చిన అపురూపమైన వరాల్లో ఒకటి. ఐతే వాటిని అపురూపంగా చూసుకోకపోతే అవి శాపంగా కూడా పరిణమించ గలవు—మరి ముఖ్యంగా క్రైస్తవ జీవనానికి! అంచేత “సర్వేంద్రియాణాం నయనం ప్రమాదం” అన్నది కూడా నిజమే అనిపిస్తుంది.

ఈ ప్రమాదం అర్థమైంది కనుకనే యోబు తన కళ్ళతో “నిబంధన” చేసుకున్నాడు. పరిశుద్ధమైన దేవుని పట్ల యోబుకున్న సునిశిత స్పృహకు ఇది అద్దం పడుతోంది. ఇక్కడ యోబు యువతులను అస్సలు చూడను అని చెప్పడం లేదు. “కామ వాంఛతో చూడను” అంటున్నాడు. “ఒక యువతిని కామవాంఛతో చూడకూడదని నా కళ్లతో నేను ఒప్పందం చేసుకొన్నాను” అని ఇదే వచనాన్ని వాడుక భాష తెలుగు బైబిల్లో అనువదించారు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం—అని ప్రభువు చెప్పడం మనకు విదితమే (మత్త.5.28).

అయితే ఈ నేత్రాశ కేవలం కామవాంఛకే పరిమితం కాదు. ఇది దేవుని నుంచి మనల్ని దూరం చేసే ఏ దురాశ అన్నా కావచ్చు. “మీరు… మీ దేవునికి ప్రతిష్ఠితులై యుండునట్లు మునుపటివలె కోరినవాటిని బట్టియు చూచినవాటిని బట్టియు వ్యభిచరింపక,…” (సంఖ్యా.15.39) అని పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని హెచ్చరించాడు. ఈ వచనంలో “వ్యభిచరింపక” అంటే కళ్ళు చూసిన, మనసు కోరిన దేవునికి ఇష్టం లేని ఏ “వాంఛ” అయినా కావచ్చు. ‘ధన వ్యామోహం’ గురించి హెచ్చరిస్తున్న సందర్భంలో కళ్ళను జాగ్రత్తగా చూసుకోమని ప్రభువు చెప్పడం మనకి తెలుసు (మత్త. 6.19-24). ఏదేను వనంలో హవ్వ పాపం చేయడానికి “నేత్రాశ” కూడా ఒక ప్రధాన ప్రేరకం. ఆ నిషిద్ధ వృక్ష ఫలం ఆమె “కన్నులకు రమ్యంగా” తోచింది (ఆది. 3.6). అబ్రాహాము, లోతు ఆస్తిని పంచుకునేటప్పుడు కూడా “నేత్రాశే” లోతుకు ప్రధాన ప్రేరకం అయ్యింది. “లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను” (ఆది. 13:10). లోతు భార్య కూడా ఈ “నేత్రాశ” వల్లనే ఉప్పు స్థంభంగా మారిపోయింది. “అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను”(ఆది. 19.26). ఆ తర్వాత లోతు కుమార్తెలు తండ్రితో పాపం చేయడానికి కూడా సొదొమలో తాము “చూస్తూ వచ్చిన పాపం” కారణంగా మనసులో తిష్ట వేసిన “నేత్రాశే” ప్రధాన ప్రేరకం అని నిర్ద్వందంగా చెప్పగలం.

ప్రభువును శోధించేటప్పుడు “మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి”నట్టు మనం చదువుతాం (మత్త.4.8). అయితే మన ప్రభువు నేత్రాశను జయించాడు. ఆయన మాత్రమే మనకి నేత్రాశ పైన విజయాన్ని ప్రసాదించ గలడు.

“నేత్రాశ” బలమైంది. పంచేంద్రియాల్లో కళ్ళకు ప్రత్యేక స్థానం ఉంది. మానవ మెదడులో మిగిలిన ఇంద్రియాలన్నిటికీ ఒకే జ్ఞప్తి స్థానముంటే, కళ్ళకు మాత్రం ప్రత్యేక జ్ఞప్తి స్థానముంది. అంచేత కంటితో చూసే విషయాలు, మిగిలిన ఇంద్రియాల ద్వారా గ్రహించే విషయాల కంటే గాఢంగా మనస్సులో నాటుకుపోయి మనపైన బలమైన ప్రభావం చూపుతాయి. మనస్సు ఉపచేతనావస్థలో కూడా (అంటే మనం నిద్రించేటప్పుడు కూడా) ఇవి చురుగ్గా పని చేస్తాయి. నేత్రాల ద్వారా మన ఉపచేతన మనసులో ముద్రితమైన విషయాలే అనేక సందర్భాల్లో మన కలల్ని, క్రియల్ని శాసిస్తాయి. ఈ రోజుల్లో మన జేబులో ఉన్న సెల్ ఫోన్ చాలు నేత్రాశతో మన మనసుల్ని మలినం చేయడానికి. జాగ్రత్త!

మరి మనస్సు ఉపచేతనావస్థలో సైతం నేత్రాశతో తలపడ గలిగిన శక్తి ఏమైనా ఉందీ అంటే అది దేవుని వాక్య శక్తి మాత్రమే. “యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్దిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?”(కీర్త. 119:9). “ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది” (హెబ్రీ 4:12). అది దేవుని వాక్యానికి ఉన్న మహా శక్తి! ఐతే కేవలం వాక్యం చదవడం వల్ల లేక వినడం వల్ల ఈ శక్తిని మనం కైవశం చేసుకోలేం. నేడు ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా పుణ్యమా అంటూ మనకు వాక్య వినికిడి ఉధృతమయ్యింది. ఐనా క్రైస్తవుల్లో మార్పు అరకొరగానే ఉంది. దీనికి కారణం “వాక్య ధ్యానం” అనే ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేకపోవడమే! “నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను” (కీర్త. 119:11). వాక్యాన్ని దినమెల్లా ధ్యానించే అలవాటు ఉన్న వారికే ఆత్మ ఫలం దొరుకుతుంది, పాపం పైన విజయం లభిస్తుంది. “యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును”(కీర్త. 1:2-3). చదివిన వాక్యాన్ని మళ్లీ మళ్లీ నెమరు వేసుకుంటూ దినమెల్లా లోతుగా పునరాలోచన చేయడమే “ధ్యానం”! ఇలాంటి ధ్యానం వాక్యాన్ని మన నరనరాల్లోకి తీసుకెళ్తుంది. అప్పుడే వాక్యం మన “ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయ తలంపులను ఆలోచనలను శోధిస్తుంది”.

అలా అభ్యాసం ద్వారా మనసు ఉపచేతనావస్థను సైతం శాసించే వాక్ శక్తి మనల్ని “నేత్రాశ” నుంచి విడిపిస్తుంది.

జీపి

Comments (1)

Comments are closed.