“కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక”
—అపో. 26:19
పిలుపు లేని పరిచర్య

పిలుపు లేని పరిచర్య
Wednesday, June 12, 2024
“కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక”
— అపో. 26:19
పిలవని పేరంటానికి వెళ్లకూడదు అన్నది భారతీయుల పట్టింపు. ఆ మాటకొస్తే ఆత్మ గౌరవం ఉన్న ఎవ్వరూ పిలవని పెళ్లికి, పేరంటాలకు వెళ్ళరు. విచిత్రమేమిటంటే, ప్రభువు పిలవకుండానే “పరిచర్య” చేయడానికి విచ్చేసిన ప్రబుద్ధులు ఇప్పుడు మన క్రైస్తవంలో కోకొల్లలు. సోషల్ మీడియా వచ్చాక, “సెలబ్రిటీ సేవకులు” ఎక్కువయ్యాక చాలా మందికి దేవుని పిలుపు వచ్చేసింది. అదేవిటో గానీ ఆ పిలుపు సువార్తికులు గానో, సహాయకులు గానో అస్సలు రాదు. ఐతే పాస్టర్ గానో, లేకపోతే స్పీకర్ గానో దేవుడు పిలిచినట్టు చెబుతున్నారు. మరి ఇది లాభదాయక పరిచర్య కదా!
పిలవని పెళ్లికి వెళ్లి హుందాగా భోంచేస్తుంటే పెళ్లివారు ఎలా ఈసడించుకుంటారో ప్రభువు పిలుపు లేకుండా వచ్చి ఇష్టారాజ్యంగా పరిచర్య చేసేవాళ్ళని ఆయన కూడా ఈసడించుకుంటాడు (మత్త.7.22,23). ప్రభువు పిలిస్తే వచ్చే సేవకుడు ఇష్టారాజ్యంగా పని చేయడు, ప్రభువు చిత్తానుసారంగా సేవ చేస్తాడు (మత్త.7.22).
ప్రభువు పిలవని సేవకుడు ఆయన మహిమ కోసం కాక తన మహిమ కోసమే పని చేస్తాడు (యోహాను.7.18). పిలుపులేని “దైవ దాసుడి”కి దేవునితో సంబంధం, ఆయన మీద నమ్మకం ఉండదు కనుక అతడు “ధన దాసుడు” కావడంలో ఆశ్చర్యం లేదు. మీరు దేవునికీ, ధనానికీ దాసులుగా ఉండలేరని ప్రభువు ఖండితంగా చెప్పారు(మత్త.6.24). “దేవుడ్ని సేవించే వాడు ధనాన్ని వాడుకుంటాడు. ధనాన్ని సేవించే వాడు దేవుడ్ని వాడుకుంటాడు” అంటారు క్రైస్తవ మేధావి ఆస్ గిన్నిస్. ఇది నిజం!
పిలుపు తెలియాలంటే ప్రభువు తెలియాలి. పిలుపు కంటే పిలిచిన ప్రభువే ముఖ్యం. ఆయన మనల్ని ప్రాథమికంగా ఒక పని కోసం పిలవలేదు. తన కోసం పిలుచుకున్నాడు.
ప్రభువు పిలుపుతో వచ్చిన సేవకుడు ఆయన మాటలే (వాక్యనుసారంగా) మాట్లాడతాడు. పిలుపులేని వాడు సొంత బోధ చేస్తాడు (యోహాను.7.16-18). పిలుపులేని సేవకుడు పక్కవాళ్ళను కాపీ కొడతాడు లేదా పోటీపడతాడు. పిలుపులేని వాడు లోకం పోకడ బట్టి పోతుంటాడు. ఆత్మ నడిపింపుతో అతనికి పనిలేదు (మత్త.10.19,20; లూకా 1.80; లూకా 4.14,18; అపో.6.10; 8.29; 16.6,7).
సేవకు పిలుపు తప్పనిసరి. పిలుపులేకుండానే గతంలో క్రైస్తవులను అవమానించి, హింసించి ‘అదే దేవుని సేవ’ అని పౌలు భావించాడు (cf.యోహా.16.2). కానీ దమస్కు మార్గంలో ప్రభువు ఎదుర్కొన్నాకనే తెలిసింది అతనికి అది దేవుని సేవ కాదని (అపో.9.3-6). ప్రభువు పిలవకుండా చేసే సేవ చెల్లదు. అది ప్రభువుకు నచ్చదు కూడా. సేవను నిర్వచించేది, నిర్దేశించేది ఆయనే. మన ఇష్టానుసారంగా దేవుడ్ని సేవించడానికి వీల్లేదు. అందుకే తన ఆత్మను అనుగ్రహించే వరకూ యెరూషలేంలో వేచి ఉండమని ప్రభువు తన శిష్యులకూ, అపోస్తలులకూ ఆదేశించారు (అపో.1.4,8; లూకా 24.49). ప్రభువు ఆమోదం లేని సేవకు ఆయన అభిషేకం ఉండదు!
పిలుపు తెలియాలంటే ప్రభువు తెలియాలి. పిలిచిన వాడు లేకుండా పిలుపు లేదు. పిలుపు కంటే పిలిచిన ప్రభువే ముఖ్యం. ఆయన మనల్ని ప్రాథమికంగా ఒక పని కోసం పిలవలేదు. తన కోసం పిలుచుకున్నాడు. “పిలుపు ఒక వాస్తవం. దేవుడు తన కోసం మనల్ని నిర్ణయాత్మకంగా పిలుచుకుంటాడు. అప్పుడు మనకున్నదంతా, మనం చేసేదంతా, మన సామర్థ్యమంతా ఆయనకూ, ఆయన సేవకూ సమర్పించాలి. దేవుని పిలుపుకు ప్రతిగా ప్రత్యేకమైన అంకితభావంతో, చైతన్యంతో మన జీవితాన్ని ఆయనకు ఒక పెట్టుబడిగా సమర్పించేదే సేవ” అంటారు గిన్నిస్. ఎంత లోతైన మాటలివి! అసలు ప్రభువు ఎవరో తెలుసుకునేంత వరకూ తానెలాంటి సేవ చేయాలో పౌలుకు అర్థం కాలేదు (అపో.22.8-10; 9.15,16). మనకూ అర్థం కాదు!
ప్రభువును ఎరగకుండా, ఆయనతో సాన్నిహిత్యం పెంచుకోకుండా ఆయనకు ఆమోద యోగ్యమైన సేవ చేయడం జరగని పని (మత్త.7.23). నా సేవకుడు నన్ను వెంబడిస్తాడు అన్నారు ప్రభువు(యోహా.12.26). ఆయన చెప్పింది ఆయన పద్ధతిలో ఆయన సమయంలో తూ.చ. తప్పకుండా చేయడమే సేవ. దేవుడు వెళ్ళమన్న చోటుకు కాకుండా తాననుకున్న చోటుకు యోనా బయల్దేరాడు. దేవుడు దాన్ని తిప్పికొట్టాడు. దేవుడు చెప్పిన పనిని సంపూర్తిగా చేయనందుకు సౌలును ఆయన కఠినంగా శిక్షించాడు (1 సమూ.15.18-24; 31.1-6).
“దేవుని పిలుపుకు ప్రతిగా ప్రత్యేకమైన అంకితభావంతో, చైతన్యంతో మన జీవితాన్ని ఆయనకు ఒక పెట్టుబడిగా సమర్పించేదే సేవ”—ఆస్ గిన్నిస్
మనకిష్టమైనవన్నీ ప్రభువుకు ఇష్టమైనవి కాదు. మనకు మంచిగా తోచినవన్నీ ఆయన దృష్టిలో మంచివి కావు. సేవలో సగం విధేయత చూపినా ఆయనకు నచ్చదు. ‘ప్రభువు పిలుపుకు తాను సంపూర్ణంగా విధేయుడనయ్యాను’ అంటూ రాజు ముందు సంకెళ్ళతో నిలబడ్డ పౌలు నిర్భయంగా నిస్సందేహంగా సాక్ష్యం చెప్తున్నాడు (అపో.26.19). ఆ తర్వాత కొన్నాళ్లకే ఈ అపొస్తలుడు రోమ్ సామ్రాజ్యాధినేత సీజర్ ముందు సువార్త చెప్పి హతసాక్షిగా మారిపోయాడు. ప్రభువునెరిగిన పిలుపు ప్రాణం పోయేదాకా మనల్ని పట్టుకుని నడిపిస్తుంది, పటిష్టంగా నిలబెడుతుంది. ఈ పిలుపు లేని సేవ లోకంలో రాణిస్తుందేమో గానీ లోకాన్ని ఎదిరించ లేదు. లోకానికి ప్రభువును పరిచయం చేయలేదు.
—జీపీ