ప్రభుత్వాలన్నీ దేవుడివే!

Tuesday, June 4, 2024

“ప్రతివాడును పై అధికారులకు లోబడి యుండవలెను; ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి యున్నవి.”
— రోమా 13:1

ఇండియాలో ఎన్నికల పర్వం ముగిసింది. దేశమంతా నెలకొన్న ఉత్కంఠకు దాదాపుగా తెర పడింది. కొందరి ఆశలు అడియాశలయ్యాయి. కొందరి నిస్పృహలు ఆశలుగా చిగురించాయి. క్రైస్తవులు, ఇతర మైనారిటీలు ఫలానా వాళ్ళు అధికారంలోకి వస్తే బావుండు అని ఆశపడ్డారు. అనేకమంది క్రైస్తవులు రాబోయే ప్రభుత్వాల గురించి ప్రార్థనలు చేశారు, చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో క్రైస్తవులు వాక్యానుసారమైన దృక్పథాన్ని అలవర్చుకోవాలి. మొదటిది, మన దేవుడు సర్వాధికారి. ఆయన ఆన లేకుండా ఎవ్వరూ అధికారంలో కూర్చోలేరు. అపొస్తలుడు పౌలు ఇదే చెబుతున్నాడు. ప్రతీ అధికారం దేవుడు నియమిస్తేనే వస్తుంది. దేవుడు నియమించని ఏ అధికారమూ లేదు—అంటున్నాడు పౌలు (రోమా 13.1). బబులోను మహా సామ్రాజ్యం అధినేత నెబుకద్నేజరు అధికార గర్వంతో విర్రవీగాడు. దేవుడతనికి బుద్ధి చెప్పడానికి అతడ్ని అడవిపాలు చేశాడు. బుద్ధివచ్చాక నెబుకద్నెజరు బైబిల్ దేవుడి గురించి చెప్పిన మాటలివి. “ఆయన పరలోక సేన యెడలను భూనివాసుల యెడలను తన చిత్తము చొప్పున జరిగించు వాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు” (దాని. 4:35). పౌలు మాటలు వినండి. “ఏలయనగా ఆకాశ మందున్నవియు భూమి యందున్నవియు, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను”(కొల.1:16). ఇదీ మన దేవుడి సర్వాధిపత్యం. అంచేత ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా ఆయన చిత్తం లేకుండా రాలేరని మనం తెలుసుకోవాలి.

రెండోది, దేవుడు తన సర్వాధికార చిత్తంలో అనుమతించిన రాజుల్ని, అధికారుల్ని మనం అంగీకరించాలి. “నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించు కొనవలెను”(ద్వితి. 17:14). ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి లోబడాలని పౌలు సెలవిస్తున్నాడు (రోమా.13.1). రాజ్యాధికారానికి లోబడాలని, రాజును సన్మానించాలని అపొస్తలుడైన పేతురు ఆదేశిస్తున్నాడు (1 పేతు.2.14,17). మనకు ఇష్టం లేని ప్రభుత్వాల్ని కూడా మనం దేవుని కోసం అంగీకరించాలి.

మూడోది, మన ప్రభుత్వాల గురించీ, అధికారుల గురించీ మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. మనం సంపూర్ణ భక్తితో, గౌరవంతో, నిశ్చింతగా, సుఖంగా బ్రతకాలంటే “రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును” చెల్లించాలని పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు (1 తిమో. 2:1,2). ఇలాంటి ప్రార్థనా వైఖరిని, కర్తవ్యాన్ని మనం అలవర్చుకోవాలి. ఇది క్రైస్తవ పౌరులుగా మన విధి!

నాల్గోది, సార్వభౌముడైన మన దేవుడు ఏ రాజు మనసునైనా మన కోసం కాలువలా తిప్పి మనకు న్యాయం చేయగలడు, తన చిత్తాన్ని జరిగించుకోగలడు (సామె.21.1). మరో పక్క, మనకు వ్యతిరేఖంగా ఉన్న రాజుల్ని సైతం ఆయన వాడుకుని తన చిత్తం జరిగించుకోగలడు. అష్షూరు, బబులోను, మాదీయ, పర్షియా రాజుల ద్వారా ఇజ్రాయెల్ జాతీయ జీవనంలో దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడని పాతనిబంధన ఘోషిస్తోంది. అలా దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఎలా క్రమశిక్షణ చేశాడో ఈ రోజుల్లో సైతం తన సంఘాన్ని అన్య ప్రభుత్వాల ద్వారా ఆయన ప్రక్షాళనం చేసుకోగలడు. ప్రభుత్వాల నిరంకుశత్వాన్ని కూడా ఆయన మన మంచికి అనుగుణంగా మలచగలడు. ఒకవేళ రాజులు అధికారులు అతిగా ప్రవర్తిస్తే ఆయన గద్దె దించనూ గలడు. చరిత్ర ఈ సత్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది!

ఈ దేవుడు మన దేవుడు. ఈయన సార్వభౌముడు. ఈయనకు మించిన అధికారం లేదు. ప్రతి సింహాసనం పైన సింహాసనాసీనుడైన సర్వాధిపతి ఈయన (కీర్త.102.12; 103.19; యెష.6.1). “యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు” (కీర్త.47:2). మహోన్నతుని చాటున నివసించే వారికి, సర్వశక్తుని నీడన విశ్రమించే వారికి ఏ భయం, దిగులూ, చింతా ఉండనక్కర్లేదు. మనం నిశ్చింతగా, నిబ్బరంగా జీవించగలం. మనుగడ సాధించగలం.

—జీపీ

Comments (1)

Comments are closed.